- Home
- Sports
- Cricket
- Virat Kohli: రాహుల్ ద్రావిడ్ రికార్డులకే ఎసరు పెట్టిన టీమిండియా టెస్టు కెప్టెన్.. పాంటింగ్ కూ స్పాట్..?
Virat Kohli: రాహుల్ ద్రావిడ్ రికార్డులకే ఎసరు పెట్టిన టీమిండియా టెస్టు కెప్టెన్.. పాంటింగ్ కూ స్పాట్..?
India Tour Of South Africa: దక్షిణాఫ్రికాతో ఈ నెల 26 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచుల టెస్టు సిరీస్ లో భారత సారథి పలు రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అవేంటంటే..

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ గత కొద్దికాలంగా పలు వివాదాలకు కేంద్ర బింధువయ్యాడు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటన ముందు వాటిని పక్కనపెట్టి సిరీస్ పై దృష్టిసారించాలని సీనియర్ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు గత ఫామ్ ను అందుకోవడానికి నెట్స్ లో చెమటోడ్చుతున్నాడు.
కాగా.. డిసెంబర్ 26 నుంచి మొదలుకాబోయే టెస్టు సిరీస్ లో భారత సారథి పలు రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందులో ఒకటి భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దే కావడం గమనార్హం.
సౌతాఫ్రికాలో 22 ఇన్నింగ్సులు ఆడిన ద్రావిడ్.. 29.71 సగటుతో 624 పరుగులు చేశాడు. ఈ రికార్డుకు విరాట్ మరో 66 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ.. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఆడిన 10 ఇన్నింగ్సులలో 55.80 సగటుతో 558 పరుగులు చేయడం విశేషం.
కోహ్లీ ఇన్నింగ్సులలో రెండు శతకాలు, రెండు అర్థ శతకాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పర్యటనలో కోహ్లీకి ద్రావిడ్ ను అధిగమించడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.
సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ.. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (28 ఇన్నింగ్సులలో 1161 పరుగులు) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
ఆ తర్వాత ద్రావిడ్ (624), వీవీఎస్ లక్ష్మణ్ (566 పరుగులు) ఉన్నారు. కోహ్లీ తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ గంగూలీ (16 ఇన్నింగ్సులలో 506 పరుగులు) ఉన్నాడు.
ఇదే గాక కోహ్లీ మొత్తంగా సౌతాఫ్రికాపై 12 టెస్టులలో 1,075 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్.. 21 టెస్టులలో 1,252 పరుగులు చేశాడు. ఈ రికార్డు బద్దలు కావడానికి కోహ్లీకి 177 పరుగులు అవసరం ఉంది.
రాబోయే సిరీస్ లో కోహ్లీ గనుక మరో 199 పరుగులు చేస్తే తన టెస్టు కెరీర్ లో 8 వేల పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు. ఈ సిరీస్ లో అది పూర్తి కావాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇవే గాక.. ఈ సిరీస్ లో విరాట్ సెంచరీ చేస్తే ఆసీస్ సారథి రికీ పాంటింగ్ ను అధిగమించనున్నాడు. కెప్టెన్ గా అతడు 42 సెంచరీలు సాధించాడు. కోహ్లీ 41 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. కానీ విరాట్ సెంచరీ చేయక రెండేండ్లు దాటిపోయింది. కెరీర్ లో 71 వ సెంచరీ కోసం తన ఫ్యాన్స్ వేయి కండ్లతో చూస్తున్నారు.
రాబోయే మూడు మ్యాచుల సిరీస్ లో అన్ని సజావుగా సాగితే.. జనవరి 11న సౌతాఫ్రికాతో జరుగబోయే మూడో టెస్టు విరాట్ కు వందో టెస్టు కానుంది. కోహ్లీ ఆ ఫీట్ సాధిస్తే.. భారత్ తరఫున వంద టెస్టులు ఆడిన వారిలో 12వ ప్లేయర్ కానున్నాడు. సెంచరీ టెస్టు రోజే అతడి కూతురు వామిక తొలి పుట్టినరోజు కూడా జరుపుకోనుంది.
ఇన్ని రికార్డులను అధిగమించడానికి సిద్ధంగా ఉన్న విరాట్.. ఈ సిరీస్ లో ఎలా ఆడతాడో అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కొద్దికాలంగా అనవసర వివాదాలతో నలిగిపోతున్న కింగ్ కోహ్లీ.. మరి ఈ సిరీస్ లో ఎలా ఆడతాడో వేచి చూడాల్సి ఉంది.