- Home
- Sports
- Cricket
- kohli-Ganguly: కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన దాదా.. నూరో టెస్టుకు ముందు షాకింగ్ కామెంట్స్ చేసిన బీసీసీఐ బాస్
kohli-Ganguly: కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన దాదా.. నూరో టెస్టుకు ముందు షాకింగ్ కామెంట్స్ చేసిన బీసీసీఐ బాస్
Virat Kohli -Sourav Ganguly: గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం మొదలైన గంగూలీ-కోహ్లి వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉంది. కోహ్లి వందో టెస్టు ఆడుతున్న నేపథ్యంలో గంగూలీ మరోసారి..

గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ ను ఓ కుదుపు కుదిపిన వివాదం గంగూలీ-కోహ్లి అంశం. కోహ్లి టీ20 సారథిగా తప్పుకుంటానని చెప్పినప్పుడు తానే వద్దని చెప్పానని, కానీ కోహ్లినే తన మాట వినడం లేదని గంగూలీ వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరతీసిన విషయం తెలిసిందే.
అయితే ఇదే విషయమై దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు పాత్రికేయుల సమావేశంలో బాంబు పేల్చాడు కోహ్లి. కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు తనను బీసీసీఐ చీఫ్ తో పాటు ఎవరూ సంప్రదించలేదని.. అది తన సొంత నిర్ణయమని అన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడించింది.
ఈ అంశంలో తదనంతర పరిణామాలు కోహ్లిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీనిపై కోహ్లి ఫ్యాన్స్ ఇప్పటికీ బీసీసీఐ.. గంగూలీ మీద గుర్రుగా ఉన్నారు. అయితే గంగూలీ తాజాగా వాళ్లను చల్లబరిచే ప్రయత్నం చేశాడు.
ఓ వివాహ వేదిక నిమిత్తం లండన్ లో ఉన్న గంగూలీ.. వందో టెస్టులో కోహ్లి సెంచరీ కొట్టాలని ఆకాంక్షించి అతడి అభిమానులకు షాకిచ్చాడు. కెరీర్ లో ప్రతి ఆటగాడికి ఒకానొక దశ ఉంటుందని, ప్రస్తుతం కోహ్లి కూడా అదే ఫేస్ లో ఉన్నాడని.. కానీ త్వరలోనే ఆ గండం నుంచి అతడు బయటపడుతాడని దాదా చెప్పుకొచ్చాడు.
తనను కలిసిన ఓ మీడియా ప్రతినిధితో గంగూలీ మాట్లాడుతూ... ‘భారత క్రికెట్ లో అతి తక్కువ మంది ఈ ఫీట్ (వంద టెస్టులు) ను సాధించారు. ఈ ఘనత సాధించాలంటే సదరు ఆటగాడు మంచి ప్లేయర్ అయి ఉండాలి. విరాట్ తప్పకుండా ఆ కోవలోకి వస్తాడు. కొద్దిరోజులుగా సెంచరీ చేయలేక ఇబ్బందులు పడుతున్న కోహ్లి.. మళ్లీ ఫామ్ లోకి వస్తాడు.
తన వందో టెస్టులో కోహ్లి సెంచరీ చేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఆటగాడికి తమ కెరీర్ లో ఒకానొక హీన దశ ఉంటుంది. కోహ్లి కూడా ప్రస్తుతం అదే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ అతడు త్వరలోనే దానిని అధిగమిస్తాడు.
నేను అతడితో కలిసి క్రికెట్ ఆడలేదు. కానీ విరాట్ ఆడే అన్ని మ్యాచులను నేను ఫాలో అవుతాను. కోహ్లి కెరీర్ ప్రారంభం నుంచి నేను అతడిని చూస్తున్నాను. అతడి టెక్నిక్, సామర్థ్యం, ఆటపై అతడికున్న మక్కువ, ఫుట్ వర్క్, ఆటపై నిలకడ అద్భుతం.
2014 ఇంగ్లాండ్ పర్యటనలో అతడు ఇబ్బందులు ఎదుర్కున్నాడు కానీ ఆ తర్వాత అతడు గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. క్రికెట్ లో అది సర్వ సాధారణం. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా 2002 నుంచి 2005 దాకా గడ్డుకాలం ఎదుర్కున్నాడు. కానీ ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లంతా వాల్ల కెరీర్ లో ఆ ఫేస్ ను దాటివచ్చినవాళ్లే. సచిన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు....’అని గంగూలీ ముగించాడు.
ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా ఉన్న గంగూలీ-కోహ్లి ఫ్యాన్స్ ను గంగూలీ వ్యాఖ్యలు ఏ మేరకు చల్లబరుస్తామో చూడాలి మరి. కాగా, కోహ్లి వందో టెస్టుకు గాను మొహాలీలో ముందు ప్రేక్షకులను అనుమతించని బీసీసీఐ.. తర్వాత అతడి అభిమానుల నిరసనతో దిగొచ్చింది. శుక్రవారం మొహాలీలో జరిగే తొలి టెస్టు 50 శాతం ప్రేక్షకుల మధ్య జరుగనున్నది.