- Home
- Sports
- Cricket
- Karun Nair: డియర్ క్రికెట్.. రెండో ఛాన్స్ కూడా పాయే.. కరుణ్ నాయర్ కథ ముగిసినట్టేనా?
Karun Nair: డియర్ క్రికెట్.. రెండో ఛాన్స్ కూడా పాయే.. కరుణ్ నాయర్ కథ ముగిసినట్టేనా?
Karun Nair: కీలకమైన మాంచెస్టర్ టెస్టు లో భారత జట్టు నుంచి కరుణ్ నాయర్ ను తప్పించారు. చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో మళ్లీ అతని కెరీర్ పై ప్రశ్నలు మొదలయ్యాయి.

మాంచెస్టర్ టెస్ట్ నుంచి కరుణ్ నాయర్ అవుట్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జులై 23న మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా నాల్గో టెస్టు ప్రారంభమైంది. ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టులో కరుణ్ నాయర్ చోటుదక్కించుకోలేకపోయాడు.
దాదాపు 8 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ కు లభించిన రెండో అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోచాడు. మూడు టెస్టులు ఆడిన పెద్ద ఇన్నింగ్స్ లను సాధించలేకపోయాడు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని తప్పించాలనే కఠిన నిర్ణయం తీసుకుంది.
సాయి సుదర్శన్ ఎంట్రీ.. కరుణ్ నాయర్ కు బైబై
మొదటి టెస్ట్‌లో హెడ్డింగ్లీ వేదికగా 6వ స్థానంలో ఆడిన కరుణ్ నాయర్.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో నెంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చారు. సాయి సుదర్శన్‌ను డ్రాప్ చేసిన తర్వాత కరుణ్‌కు ప్రమోషన్ ఇచ్చారు. అయినప్పటికీ, కరుణ్ నాయర్ పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేదు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో సాయి సుదర్శన్ తిరిగి వచ్చాడు. టాస్ సమయంలో శుభ్‌మన్ గిల్ ఈ మార్పును వెల్లడించారు.
రెండో ఛాన్స్ కూడా పోయింది.. కరుణ్ నాయర్ భారత జట్టు ఏంట్రీకి శుభంకార్డు పడిందా?
2022లో తన సోషల్ మీడియా ద్వారా “క్రికెట్, నాకు మరో అవకాశం ఇవ్వు” అని భావోద్వేగంతో కరుణ్ నాయర్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో రాణించడంతో చాలా మంది ప్లేయర్లు అతనికి మద్దతు ప్రకటించారు.
అందుకే బీసీసీఐ మరో ఛాన్స్ ఇస్తూ కరుణ్ నాయర్ కు 2025 ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అవకాశం లభించింది. దేశీయ క్రికెట్, కౌంటీ క్రికెట్‌లలో మంచి ఫామ్ ను చూపించడంతో ఇంగ్లాండ్ లో కూడా పరుగుల వరద పారిస్తాడని అందరూ భావించారు.
కానీ, అంలాంటిదేమీ జరగలేదు. మూడు మ్యాచ్ లలో ఆరు ఇన్నింగ్స్ లలో ఒక్కసారి కూడా పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయాడు. చివరి 6 ఇన్నింగ్స్‌లలో కరుణ్ నాయర్ స్కోర్లు వరుసగా - 0, 20, 31, 26, 40, 14 పరుగులు చేశాడు. మొత్తం 131 పరుగులు మాత్రమే. సగటు 21.83గా ఉంది. ఒక్కసారి కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.
కౌంటీ ప్రదర్శనను మళ్లీ ఇవ్వలేకపోయిన కరుణ్ నాయర్
2023, 2024లో నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడిన కరుణ్, రెండు సీజన్లలో 56.61 సగటుతో 736 పరుగులు చేశాడు. 2024లో గ్లామోర్గాన్‌పై డబుల్ సెంచరీ కూడా చేశాడు. అంతేగాక, ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనఫిషియల్ టెస్టుల్లో 259 పరుగులు చేయడం, ఒక సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రదర్శనల్ని మళ్లీ చూపించలేకపోయాడు.
కరుణ్ నాయర్ భారత జట్టు ఎంట్రీ ఆశలు ముగిసినట్టేనా?
మాంచెస్టర్ టెస్ట్ ముందు శుభ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడుతూ.. కరుణ్ బ్యాటింగ్‌లో లోపం లేదు కానీ, అతను తన జోన్‌లోకి రాలేకపోయాడని చెప్పాడు. ఒకసారి అతను 50+ పరుగుల మార్కును అందుకుంటే ఫామ్ ను అందుకునే వాడని తెలిపాడు. కానీ, అలాంటిది జరగలేదు.
ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్ జూలై 31 నుంచి ది ఓవల్‌లో ప్రారంభం కానుంది. అందులో కూడా సాయి సుదర్శన్‌కు అవకాశమిస్తే, కరుణ్ నాయర్ భారత జట్టు ఎంట్రీ అనేది ఈ టూర్ తోనే ముగుస్తుందనే టాక్ నడుస్తోంది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాాంపియన్‌షిప్ సైకిల్‌లో కూడా కరుణ్ నాయర్ కు అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి.
అయితే ఆయన తిరిగి వచ్చే అవకాశం మాత్రం ఉంది.. మళ్లీ దేశవాళీ క్రికెట్ మెరుపులు మెరిపించాలి. అది జరిగినా అంత ఈజీగా ఛాన్స్ రాదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది యంగ్ ప్లేయర్లు జాతీయ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. ప్రస్తుతం సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ లు బలమైన పోటీగా ఉన్నారు.