T20 World Cup 2024 లో కొత్త రూల్స్ ఏమిటో తెలుసా? ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
T20 World Cup 2024 new rules : టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా ప్రారంభం కానుంది. అయితే, 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో ఐసీసీ కొత్త రూల్స్ ను తీసుకువస్తోంది.
India , Cricket, T20,
T20 World Cup 2024 : మరో క్రికెట్ సమరానికి సర్వం సిద్దమైంది. టీ20 క్రికెట్ సమరానికి క్రికెట్ ప్రపంచం సై అంటోంది. అమెరికాలో తొలిసారి జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వెస్టిండీస్ తో కలిసి అమెరికా ఆతిథ్యమిస్తున్న తొలి ఐసీసీ వరల్డ్ కప్ కూడా ఇదే కావడం విశేషం.
Indian Team Practice
2024 టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ ను గమనిస్తే.. మొత్తం 20 జట్లను ఐదు జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకోవడంతో ఒక్కో జట్టు ఒక్కోసారి తలపడుతుంది, అక్కడ 4 జట్ల చొప్పున రెండు గ్రూపులు ఉంటాయి. టాప్ 4 లోని జట్లు సెమీస్ కు చేరుకుంటాయి. ఇక్కడ గెలిచిన జట్లు ఫైనల్ లో తలపడతాయి.
2024 టీ20 వరల్డ్ కప్ లో కూడా గత ఎడిషన్లలో కనిపించని కొన్ని కొత్త నిబంధనలు ఐసీసీ తీసుకురానుంది. వాటిలో కీలకమైనది 60-సెకన్ల స్టాప్ క్లాక్ రూల్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో 60 సెకన్ల స్టాప్ క్లాక్ నిబంధనను ఉపయోగించనున్నామనీ, ట్రయల్ పీరియడ్ లో వన్డే మ్యాచ్ లలో కనీసం 20 నిమిషాల సమయం ఆదా చేయడంతో అపెక్స్ బోర్డు ఈ నిబంధనను తప్పనిసరి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
60-సెకన్ల స్టాప్ క్లాక్ రూల్ ఆయా జట్లను ఏవిధంగా ప్రభావితం చేస్తుందనే విషయాలు గమనిస్తే.. ఈ రూల్ ప్రకారం తొలి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోనే బౌలింగ్ బృందం తదుపరి ఓవర్ ను వేయాల్సి ఉంటుంది. పరిమిత ఓవర్ల మ్యాచ్ లను సకాలంలో పూర్తి చేసేందుకు ఈ నిబంధనను తీసుకొచ్చారు.
2023 డిసెంబరులో మధ్యంతర ప్రాతిపదికన ప్రవేశపెట్టినప్పటికీ, ట్రయల్ పీరియడ్లో కనీసం 20 నిమిషాల సమయం ఆదా అయిన తరువాత ఈ రూల్ ను తప్పనిసరి చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొదటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు ఫీల్డింగ్ టీమ్ తదుపరి ఓవర్ ను ప్రారంభించాలి. 60 సెకన్ల లెక్కింపును గ్రౌండ్ లోని ఎలక్ట్రానిక్ గడియారంలో ప్రదర్శిస్తారు.
గడియారం ప్రారంభ సమయాన్ని థర్డ్ అంపైర్ నిర్ణయిస్తాడు. సకాలంలో ఓవర్ ను ప్రారంభించని క్రమంలో జట్టు కెప్టెన్ ను రెండు హెచ్చరికలు చేస్తారు. మూడో సారి ఫీల్డింగ్ జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు. అంటే బ్యాటింగ్ టీమ్ కు అనుకూలించే అంశంగా చూడవచ్చు. కానీ, సమయం ఆదా చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
T20 World Cup 2024, Rohit Sharma
అయితే, స్టాప్ క్లాక్ రూల్ లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఓవర్ల మధ్య కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినా, అంపైర్లు అధికారిక డ్రింక్స్ విరామాన్ని పిలిచినా, అంపైర్లు ఆమోదించిన గ్రౌండ్ లో గాయానికి చికిత్స చేసినా లేదా నియంత్రణకు మించిన ఏదైనా పరిస్థితి ఏర్పడినా ఈ నియమం చెల్లదు.
వర్షం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని 2024 ఎడిషన్ టీ20 ప్రపంచ కప్ లో మొదటి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే, రెండో సెమీఫైనల్ కు అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించనున్నారు.