- Home
- Sports
- Cricket
- వాళ్లిద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చేయడం బెటర్.. టెస్టు కెప్టెన్సీపై మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్
వాళ్లిద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చేయడం బెటర్.. టెస్టు కెప్టెన్సీపై మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్
India Test Captain: భారత క్రికెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనేదానిమీదే చర్చ. సగటు క్రికెట్ అభిమాని నుంచి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లు కూడా ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు.

ఉన్నట్టుండి విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి తలనొప్పులు మొదలయ్యాయి. కోహ్లి వారసుడి కోసం బోర్డుతో ఇప్పటికే వేట మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, దిగ్గజ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లి వారసుడిగా వెంగ్‌సర్కార్ ప్రస్తుత టీమిండియాలోని ఇద్దరు స్టార్ ప్లేయర్లను సూచించాడు. తక్షణం వారిలో ఎవరినో ఒకరిని సారథిగా నియమించి ఆ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్ గురించి ఆలోచించాలని సూచించాడు.
వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘తదుపరి భారత టెస్టు కెప్టెన్ గురించి మీరు నన్నడిగితే.. నేనైతే రోహిత్ శర్మ కు గానీ లేదంటే ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు గానీ ఆ బాధ్యతలు అప్పజెప్పడం బెటర్ అని చెబుతాను.
ఒక ఏడాది పాటు ఈ ఇద్దరిలో ఒకరిని సారథిగా నియమించి ఆ తర్వాత పూర్తి స్థాయి నాయకుడిని ఎంపిక చేయడం ఒక ఆచరణాత్మక ఆలోచన కావచ్చు..’ అని ఈ మాజీ సెలెక్టర్ చెప్పాడు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు వెంగ్‌సర్కార్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నాడని గుర్తు చేసుకున్నాడు.
‘ఆ సమయంలో మేము దీర్ఘకాల ఎంపిక కోసం వెతకడానికి బదులుగా అప్పటికీ అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు పగ్గాలను అప్పగించాం. ఆ సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో అదరగొట్టిన ధోనికి టెస్టు సారథ్యం దక్కుతుందని అందరూ భావించారు.
కానీ మేము అనిల్ కుంబ్లే తో ముందుకువెళ్లాం. ఆ తర్వాత ఎంఎస్ ధోనికి కెప్టెన్సీ అప్పగించేదాకా కుంబ్లే.. టెస్టులలో భారత్ ను నడిపించాడు’ అని వెంగ్‌సర్కార్ అన్నాడు.
ఇక కెప్టెన్సీ కోహ్లి బ్యాటింగ్ పై ప్రభావం చూపలేదని వెంగ్‌సర్కార్ చెప్పాడు. నెంబర్లపై మోజు అనవసరమైన విమర్శలకు దారితీస్తుందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగినా కోహ్లి.. ఆటగాడిగా భారత జట్టుకు మరో ఐదారేళ్లు సేవ చేస్తాడని తాను నమ్ముతున్నానని తెలిపాడు.