SRH IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్
SRH IPL 2025: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 షెడ్యూల్ లో మార్పులు వచ్చాయి. కొత్త షెడ్యూల్ కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కు గుడ్ న్యూస్ అందింది.

SRH IPL 2025: భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తొమ్మిది రోజుల విరామంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ వారాంతంలో తిరిగి ప్రారంభం కానుంది. తాత్కాలికంగా ఐపీఎల్ 2025 ను నిలిపివేయడంతో కొంతమంది ప్లేయర్లు వారి స్వస్థలాలకు చేరారు. అయితే, మళ్లీ తిరిగి ప్రారంభం కానుండటంతో చాలా మంది విదేశీ ఆటగాళ్ళు టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్ కోసం తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ (SRH) ప్లేఆఫ్స్ నుండి నిష్క్రమించినప్పటికీ, IPL 2025లో మిగిలిన మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ తిరిగి SRHలో చేరనున్నారు. WTC 2025 ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టులో వీరిద్దరూ ఎంపికయ్యారు.
వచ్చే నెల జరిగే WTC ఫైనల్‌లో ఆడనున్న ఆస్ట్రేలియా జంట ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ మే 17 నుండి ప్రారంభమయ్యే IPL 2025 మిగిలిన మ్యాచ్‌లకు SRH తో తిరిగి చేరనున్నట్లు ESPNcricinfo తెలిపింది.
గత వారం, భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా IPL 18వ సీజన్ ఒక వారం నిలిపివేశారు. మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే సందేహం నెలకొంది. కానీ, IPL మళ్ళీ ప్రారంభమవుతుందని BCCI ప్రకటించింది.
ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లు మే 17న ప్రారంభమవుతాయి. అదే రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)-కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య మ్యాచ్‌తో టోర్నీ తిరిగి మొదలవుతుంది.
జూన్ 11న దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే WTC ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టులో కమ్మిన్స్, హెడ్ ఎంపికయ్యారు. హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్స్ నుండి నిష్క్రమించడంతో, వారు జట్టులో వుండకపోవచ్చని సందేహాలు తలెత్తాయి.
ESPNcricinfo ప్రకారం, హైదరాబాద్ కెప్టెన్ కమ్మిన్స్, హెడ్ భారత్‌కు తిరిగి వచ్చి SRHలో చేరతామని తెలిపారు. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ భారత్‌కు తిరిగి రానున్నట్లు కమ్మిన్స్ మేనేజర్ నీల్ మాక్స్‌వెల్ ధ్రువీకరించారు.
"ప్యాట్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు, తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నాడు" అని నీల్ మాక్స్‌వెల్ మంగళవారం న్యూస్ కార్ప్‌తో చెప్పినట్లు ESPNcricinfo పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో ఆటగాళ్ళు భారత్‌కు తిరిగి రావడంపై వారి వ్యక్తిగత నిర్ణయాలకు బోర్డు సహాయం చేస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా జాతీయ జట్ల అధిపతి బెన్ ఆలివర్ హామీ ఇచ్చారు.
అయితే, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ మలింగ, కమిందు మెండిస్, వైన్ ముల్డర్ వంటి విదేశీ ఆటగాళ్ళు SRHలో చేరతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని ESPNcricinfo ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాతో జరిగే WTC ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ముల్డర్ ఎంపికయ్యాడు.
గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్, 2025లో తన మ్యాజిక్‌ను కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ తప్ప, SRH బ్యాట్స్‌మెన్‌లు తమ పవర్-హిట్టింగ్ ను మళ్లీ చూపించలేకపోయారు. 11 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో, హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లక్నోలో LSGతో (మే 19), బెంగళూరులో RCBతో (మే 23), ఢిల్లీలో KKRతో (మే 25) మూడు మ్యాచ్‌లతో SRH తన ఐపీఎల్ 2025 సీజన్ ను ముగించనుంది.