IPL: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ విడుదల.. జూన్ 3 ఫైనల్.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే?
IPL 2025 new schedule: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నీ కొత్త షెడ్యూల్ వచ్చింది. జూన్ 3న ఫైనల్ జరగనుంది.

IPL 2025 new schedule: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025కి సంబంధించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా మే 9న టోర్నమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అభిమానులు కొత్త షెడ్యూల్ కోసం ఎదురుచూస్తుండగా, బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన చేసింది.
ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లు మే 17న ప్రారంభమవుతాయి. అదే రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)-కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య మ్యాచ్‌తో టోర్నీ తిరిగి మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశం కాగా, కేకేఆర్ కోసం డూ ఆర్ డై తరహా పోరుగా మారనుంది.
ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా, ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టేందుకు ఆర్సీబీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఇక మే 24న, మునుపటి ఆటలో భద్రతా కారణాల వల్ల నిలిపివేసిన పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ను జైపూర్‌లో నిర్వహించనున్నారు. మే 8న ధర్మశాలలో జరిగిన మ్యాచ్ 10.1 ఓవర్ల వరకు మాత్రమే సాగి, పంజాబ్ 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. భారత్-పాక్ ఉద్రిక్తత కారణంగా మ్యాచ్ ఆపివేయాల్సి వచ్చింది.
పూర్తి టోర్నీని ముగించేందుకు మిగిలిన 17 మ్యాచ్‌లు మొత్తం 6 వేదికలపై నిర్వహించనున్నారు. మొదట 25 మేకు నిర్ణయించిన ఫైనల్ మ్యాచ్‌కు కూడా వాయిదా పడింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న జరగనుంది.
ఈ మేరకు మే 29 నుండి నాక్‌ఔట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తాజా షెడ్యూల్‌తో ఐపీఎల్ 2025 మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. టోర్నీ తిరిగి ప్రారంభమవడం క్రికెట్ అభిమానులకు ఊరట కలిగించే అంశం.
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ షెడ్యూల్
క్వాలిఫైయర్ 1 – మే 29
ఎలిమినేటర్ – మే 30
క్వాలిఫైయర్ 2 - జూన్ 1
ఫైనల్ - జూన్ 3
ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదిక వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఐపీఎల్ 2025 పూర్తి కొత్త షెడ్యూల్ ఇక్కడ చూడండి