India vs Pakistan: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే రోహిత్, కోహ్లీలకు పూనకాలే !
Champions Trophy 2025: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ గతంలో పాకిస్థాన్‌పై అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో మరోసారి అదరగొడతారా?

Virat Kohli, RohitSharma
Champions Trophy 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అందరి చూపు ఉంది. ఎందుకంటే గతంలో వీరిద్దరూ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లలో అనేక అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎల్లప్పుడూ ఉత్సాహంగా.. ఇతర మ్యాచ్ లతో పోలిస్తే ఉత్కంట, ఆసక్తికరంగా ఉంటుంది. ఆదివారం జరిగే ఈ హై వోల్లేజీ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఒక బిగ్ మ్యాచ్. ఇదే సమయంలో ఈ ఐసీసీ టోర్నమెంట్‌కు అతిథ్యం ఇస్తున్న పాక్ టీమ్ టోర్నీలో కొనసాగాలంటే ఈ మ్యాచ్ ను తప్పకుండా గెలవాల్సిందే. ఇదే సమయంలో భారత్ ఈ మ్యాచ్ ను గెలుచుకుని సెమీస్ లో అడుగుపెట్టాలని చూస్తోంది.
Team India
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ సేన ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీని అందుకోలేకపోయింది. అప్పుడు భారత్-పాక్ లు ఫైనల్ లో తలపడ్డాయి. పాకిస్తాన్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని ఈ మ్యాచ్ భారత్‌కు అందిస్తుంది.భారత విజయావకాశాలకు రోహిత్, విరాట్ ల సహకారం కీలకం. 'హిట్‌మ్యాన్' తన సాధారణ 40, 50 పరుగుల కంటే అద్భుతమైన సెంచరీ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే, కింగ్ కోహ్లీకి పాక్ పై మంచి రికార్డులు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఫామ్ ను అందుకుని మంచి ఇన్నింగ్స్ ను ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పాకిస్తాన్ పై కోహ్లీ, రోహిత్ లకు మంచి రికార్డులు ఉన్నాయి. రోహిత్ శర్మ పాకిస్తాన్ పై 19 వన్డేల్లో 873 పరుగులు చేశాడు, సగటున 51.35గా ఉంది. ఇందులో రెండు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 2019 క్రికెట్ ప్రపంచ కప్ లో వచ్చిన 140 పరుగులు.
అలాగే, విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై 16 వన్డేల్లో 52.15 సగటుతో 678 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2012 ఆసియా కప్ లో 183 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. ఈ ఇద్దరు స్టార్ల ఇటీవలి ప్రదర్శనలను గమనిస్తే.. వన్డేల్లో రోహిత్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే, కోహ్లీ పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్నాడు.
పాకిస్థాన్‌పై రోహిత్, విరాట్ అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే:
2012 ఆసియా కప్‌లో విరాట్ 183 పరుగులు:ఈ ఇన్నింగ్స్ కోహ్లీ మాస్టర్ ఛేజర్‌గా అతని ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది. పాకిస్తాన్ బౌలర్లపై భారత్ 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినప్పుడు, కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 183 పరుగులు చేశాడు. కోహ్లీ మాస్టర్ ఇన్నింగ్స్ తో భారత్ భారీ టార్గెట్ ను అందుకుని విజయం సాధించింది.
2015 ప్రపంచ కప్‌లో విరాట్ 107 పరుగులు:
ఈ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పదును మరోసారి చూపించాడు. 126 బంతుల్లో 107 పరుగులు చేశాడు, పాకిస్తాన్‌పై భారతదేశం 300/7 స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో పాక్ పై భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2019 ప్రపంచ కప్‌లో రోహిత్ 140 పరుగులు:
రోహిత్ క్లాసీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. రోహిత్ శర్మ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేయడంతో భారత్ మొత్తం పరుగులు 336/5 చేరాయి. ఈ ఇన్నింగ్స్ పాకిస్తాన్ పై భారత్ ఘన విజయాన్ని అందుకోవడంలో సహాయపడింది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ 91 పరుగులు:
రోహిత్ 119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై శిఖర్ ధావన్‌తో కలిసి రోహిత్ శర్మ భారత్ స్కోర్ బోర్డును 319/3 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో భారత్ 124 పరుగులతో గెలిచింది. రోహిత్ రనౌట్ కావడంతో సెంచరీ కోల్పోయాడు.