- Home
- Sports
- Cricket
- క్రికెట్ నా క్లాస్‌రూం.. బ్రియాన్ లారా పాఠాలే నన్ను మార్చాయి.. బైజూస్ రవీంద్రన్ ఇన్స్పైరింగ్ స్టోరీ
క్రికెట్ నా క్లాస్‌రూం.. బ్రియాన్ లారా పాఠాలే నన్ను మార్చాయి.. బైజూస్ రవీంద్రన్ ఇన్స్పైరింగ్ స్టోరీ
Byju Raveendran Inspiring Story: బైజూ రవీంద్రన్ టీచర్స్ డే సందర్బంగా లింక్డ్ ఇన్‌లో లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా నుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. లారా నేర్పిన పాఠాలు తన జీవితాన్ని మార్చాయని బైజూ రవీంద్రన్ తెలిపారు.

క్రికెటే నా క్లాస్‌రూం.. బైజూ రవీంద్రన్
అందరూ ఉపాధ్యాయులు తరగతి గదిలోనే ఉండరు.. కొందరు బ్యాట్ చేతపట్టి గ్రౌండ్ నుంచి కూడా మనకు పాఠాలు నేర్పుతారు. మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తారు. కేరళలోని ఒక పల్లెటూరి కుర్రాడికి క్రికెట్ కేవలం ఒక ఆట కాదు. అది అతని పాఠశాల. సాధారణ కుటుంబం నుంచి క్రికెట్ కామెంటరీ వింటూ ఇంగ్లీష్ భాషతో పాటు జీవిత పాఠాలు నేర్చుకున్నారు. నేడు గురువుగా మారి ఎంతో మందికి అదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే బైజూ రవీంద్రన్.
KNOW
బ్రియాన్ చార్లెస్ లారా నా మొదటి హీరో.. బైజూ రవీంద్రన్
బైజూస్ వ్యవస్థాపకుడైన బైజూ రవీంద్రన్ టీచర్స్ డే సందర్భంగా తన LinkedIn అకౌంట్‌లో ఒక ప్రత్యేక కథనాన్ని పంచుకున్నారు. తరగతి గదుల్లోనే కాదు, క్రికెట్ మైదానంలో కూడా నిజమైన గురువులు ఉంటారని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు.
తన చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకున్న బైజూ రవీంద్రన్ కేరళ గ్రామంలో మొదలైన తన ప్రయాణంలో క్రికెట్ తనకు క్లాస్‌రూం అని పేర్కొన్నారు. ఆ ఆట ద్వారానే ఆయన ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో తన తొలి క్రికెట్ హీరోగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ చార్ల్స్ లారా పేరును ప్రస్తావించారు. ఆ సమయంలో టెలివిజన్‌లో వినిపించే క్రికెట్ కామెంటరీనే తన పాఠ్యపుస్తకమని చెప్పారు.
లారా కేవలం వినోదం కాదు అంతకు మించి ఇచ్చారు: బైజూ
చాలా మంది ఆటగాళ్లలో మొదటగా తనను ఎక్కువగా ప్రభావితం చేసిన హీరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ చార్లెస్ లారా అని బైజూ రవీంద్రన్ చెప్పారు. అంతలా అభిమానం, గౌరవం పెరిగింది కాబట్టే తన తొలి ఈమెయిల్ ఐడీ కూడా ByjuLara@yahoo.com గా క్రియేట్ చేసుకన్నానని చెప్పారు. లారా ఇచ్చింది వినోదం మాత్రమే కాదు, జీవితాన్ని మలిచే పాఠాలూ అని చెప్పారు.
“నేను చూసిన ఆటగాళ్లందరిలో బ్రియాన్ చార్లెస్ లారా నా మొదటి హీరో. అందుకే నా మొదటి ఈమెయిల్ ఐడి ByjuLara@yahoo.com. లారా నాకు వినోదం కంటే ఎక్కువే ఇచ్చారు. నా జీవితాన్ని మలిచిన ఎన్నో పాఠాలు నేర్పారు” అని రవీంద్రన్ తెలిపారు.
లారా నేర్పిన పట్టుదలతోనే..
లారా ఆటగాడిగా చూపించిన ఓర్పు, సాధనపై నమ్మకం ఒక తరం అభిమానులను ప్రభావితం చేసింది. అతని హై బ్యాక్‌లిఫ్ట్‌ను చాలామంది రిస్క్‌గా భావించారు. కానీ అదే బాటలో ఆయన ముందుకు సాగుతూ చరిత్ర మర్చిపోలేని రికార్డులు సాధించారు. 375, 400 నాట్ అవుట్, 501 రన్స్ లాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు.
1994లో ఇంగ్లండ్‌పై 766 నిమిషాలు క్రీజులో నిలబడి 375 పరుగులు సాధించారు. అది ప్రపంచ రికార్డు. దాదాపు దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్ 380 పరుగులతో అతనిని అధిగమించాడు. చాలామంది ఆ రికార్డు సంవత్సరాల పాటు నిలుస్తుందని అనుకున్నారు.
కానీ కేవలం ఆరు నెలలకే లారా మళ్లీ రికార్డు బద్దలు కొట్టాడు. అదే మైదానం, అదే ప్రత్యర్థి జట్టు పై 400 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును సాధించాడు.
వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలే నన్ను ఇలా నిలబెట్టాయి : బైజూ
ఆరంభంలో లారా ఆటలో లోపాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు అతని ఫార్మ్ అస్థిరంగా ఉండేది. కెప్టెన్సీ కూడా గొప్పగా లేదని చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి సమయంలో కూడా ధైర్యంగా ఎదురునిలిచి మనకు మరో పాఠం నేర్పారు. గొప్పతనం అంటే తప్పులేని వ్యక్తిత్వం కాదు. విఫలమైన చోటే పడిలేచిన కెరటంలా లేచి మరింత అద్భుతంగా రాణించారు. లారా ఆటతీరు కేవలం రన్స్ సాధించడమే కాదు, బ్యాటింగ్‌ను అందంగా.. అద్భుతంగా మార్చింది. విద్య కూడా భయం కలిగించకుండా ప్రేరణ కలిగించాలి అనే పాఠం ఆయన నేర్పారు అని బైజూ రవీంద్రన్ తెలిపారు.
“క్లాస్‌రూంలలోనైనా, క్రికెట్ మైదానంలోనైనా, నిజమైన గురువు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుతారు. ఈ Teachers Day సందర్భంగా మనకు ధైర్యం ఇచ్చే.. అలాంటి దారిలో ముందుకు నడిపించే గురువులందరికీ కృతజ్ఞతలు. హ్యాపీ టీచర్స్ డే” అని బైజూ రవీంద్రన్ తెలిపారు.
బైజూ రవీంద్రన్ ఎడ్ టెక్ సంచలనం
కేరళ తీరప్రాంతంలోని చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన బైజూ రవీంద్రన్ ప్రయాణం ఈ రోజు ప్రపంచంలో టాప్ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ రూపకల్పనగా మారింది. క్రికెట్ నుంచి జట్టు భావన, ఒత్తిడిలో ప్రదర్శన, నాయకత్వం వంటి పాఠాలు నేర్చుకున్న ఆయన.. విద్యార్థి దశలోనే స్వీయ అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో కొంతకాలం పనిచేసి.. భారత్ వచ్చి CAT పరీక్ష రాసి వరుసగా రెండు సార్లు 100 పర్సెంటైల్ సాధించారు. స్నేహితుల ప్రోత్సాహంతో ప్రారంభించిన CAT శిక్షణ తరగతులు కొద్ది కాలంలోనే వందల నుంచి వేలమందిని ఆకర్షించాయి. స్టేడియంలో క్లాసులు నిర్వహించేంత గుర్తింపు వచ్చింది.
2011లో Think & Learn Pvt Ltd స్థాపించి, 2015లో BYJU’S The Learning App విడుదల చేశారు. మూడు నెలల్లోనే 2 మిలియన్ డౌన్‌లోడ్స్ సాధించిన ఈ యాప్ ప్రస్తుతం 100 మిలియన్ పైగా డౌన్‌లోడ్స్, 6.5 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఉచిత కంటెంట్, లైవ్ క్లాసులు, ప్రాంతీయ భాషా కోర్సులతో దేశవ్యాప్తంగా 50 మిలియన్ కొత్త విద్యార్థులు బైజూస్ లో చేరారు. 2020లో ప్రారంభించిన Education for All ద్వారా 2025 నాటికి 5 మిలియన్ విద్యార్థులకు విద్య అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.