ఆసియా కప్ 2025: భారత జట్టు నుంచి షమీని ఎందుకు తప్పించారు?
Mohammed Shami: స్టార్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కలేదు. అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టే షమీకి టీమిండియాలో ఎందుకు చోటుదక్కలేదో ఇప్పుడు తెలుసుకుందాం.

షమీ పుట్టినరోజు: కెరీర్ హైలైట్స్
భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ సెప్టెంబర్ 3, 1990న జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 35 సంవత్సరాలు. టీమిండియాకు వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్‌లలో అనేక విజయాలు అందించారు. అయినప్పటికీ, షమీకి ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు 15 మందిలో చోటు దక్కలేదు. ఈ నిర్ణయంపై అభిమానుల్లో నిరాశ కనిపించింది.
షమీ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నేను దులీప్ ట్రోఫీ ఆడగలిగితే, ఈ టోర్నమెంట్ ను ఎందుకు ఆడకూడదు?" అంటూ కామెంట్స్ చేశారు. జట్టులో చోటుదక్కకపోవడం పై నిరాశను వ్యక్తం చేశారు. అయితే, ఎందుకు షమీని భారత జట్టులోకి తీసుకోలేదు?
KNOW
షమీ: ఫిట్‌నెస్ సమస్యలు ప్రధాన కారణం
బీసీసీఐ సెలెక్టర్లు షమీని జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఫిట్‌నెస్. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆయన కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. రికవరీ తర్వాత 2025 జనవరిలో ఇంగ్లాండ్‌పై జరిగిన టీ20 సిరీస్‌లో ఆడినా ప్రభావం చూపలేకపోయారు.
ఆ మ్యాచ్‌ల్లో పూర్తి స్పెల్ వేసే స్థితిలో లేరు. బంతి వేగం కూడా తగ్గినట్లు గమనించారు. అందువల్ల ఆసియా కప్ వంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌కు ఆయన సిద్ధం కాదని భావించారు.
మహ్మద్ షమీ: పెద్ద టోర్నమెంట్‌కు సడెన్ ఎంట్రీ కష్టం
షమీ చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ 2025 జనవరిలో ఆడారు. తరువాత ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగారు. అయితే అక్కడ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లతో పోరాడే ఆసియా కప్‌లో సడెన్‌గా షమీకి అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయం కాదని భారత సెలెక్టర్లు భావించారు.
షమీ స్థానంలో యంగ్ బౌలర్లకు ఛాన్స్
ఈసారి భారత స్క్వాడ్ యువ ఆటగాళ్లతో నిండిపోయింది. జస్ప్రిత్ బుమ్రా తప్పితే 50కి పైగా టీ20లు ఆడిన బౌలర్ జట్టులో లేడు. బీసీసీఐ వ్యూహం ప్రకారం షమీ స్థానంలో యువ బౌలర్లకు అవకాశమిచ్చారు.
హర్షిత్ రాణా (కేవలం ఒక టీ20I అనుభవం), అర్షదీప్ సింగ్ (ఎడమచేతి పేసర్) జట్టులో ఉన్నారు. నాలుగో పేసర్‌గా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంపికగా ఉంటారు.
షమీ అభిమానుల్లో నిరాశ
షమీ లాంటి సీనియర్ బౌలర్ జట్టులో లేని కారణంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గత ప్రదర్శనను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేశారు. అయినప్పటికీ, బీసీసీఐ ఎంపికలు స్పష్టంగా ఫిట్‌నెస్, ఫామ్, యువతకు అవకాశం అనే అంశాలపై ఆధారపడి ఉన్నాయని తేలింది.
మొత్తానికి, షమీకి ఆసియా కప్ 2025 జట్టులో చోటు రాకపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఫిట్‌నెస్ సమస్యలు, ఐపీఎల్ తో పాటు ఇటీవల ఆడిన ఇంటర్నేషనల్ స్థాయి మ్యాచ్ లలో ప్రభావం చూపలేకపోవడం, యువ బౌలర్లకు అవకాశం ఇవ్వడం ఉన్నాయి.