టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి భారత బౌలర్ గా అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డ్
Arshdeep Singh World Cup records: టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్-8 కు అర్హత సాధించింది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ పిచ్ పై భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరో రికార్డు సృష్టించాడు.
T20 World Cup 2024-Arshdeep Singh : జూన్ 12న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 25వ మ్యాచ్ లో అమెరికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్ లో మరోసారి భారత బౌలర్లలు అద్భుత ప్రదర్శన చేశారు. మరీ ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శనతో మెరిశాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అద్భుతమైన ఓపెనింగ్ ఓవర్ వేసి తొలుత అమెరికాను దెబ్బకొట్టాడు.
అర్ష్‌దీప్ సింగ్ వెసిన తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసుకుని అమెరికాను ఇబ్బందుల్లోకి నెట్టాడు. మొదటి బంతికే, షాయన్ జహంగీర్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ కు పంపాడు. అదే ఓవర్‌లో తన రెండవ బాధితుడు ఆండ్రీస్ గౌస్‌ను ఔట్ చేశాడు. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఆ తర్వాత కూడా అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్ పదును కొనసాగించాడు. మరో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో తన 4 ఓవర్ల బౌలింగ్ తో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ లో అమెరికాపై 4 వికెట్లు తీసుకున్న అర్ష్‌దీప్ సింగ్ మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ గా అర్ష్‌దీప్ సింగ్ ఘనత సాధించాడు.
అంతకుముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఈ రికార్డును అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. అశ్విన్ టీ20 ప్రపంచ కప్ 2014 లో ఆస్ట్రేలియాపై 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అర్ష్‌దీప్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
అశ్విన్ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి వికెట్ తీసిన మెుదటి ఇండియన్ బౌలర్ గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ 2022 లో కూడా ఈ ఘనత సాధించాడు.