రోహిత్ శర్మకు బిగ్ షాక్.. కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా దూరం కానుందా?
Rohit Sharma: గత కొన్ని టెస్టుల నుంచి భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఇప్పుడు కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితిలోకి జారుకున్నాడు.
Rohit Sharma
Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. అందరి విమర్శలకు టార్గెట్ గా నిలిచాడు. మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ లవర్స్ నుంచి టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకోవాలంటూ సలహాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఆసీస్ తో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతోంది. నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. భారత్ రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ను డ్రా చేసుకుంది.
భారత కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా
మొదటి మ్యాచ్ భారత జట్టు కు బుమ్రా కెప్టెన్ గా కొనసాగాడు. ఈ మ్యాచ్ ను భారత్ గెలుచుకుంది. రెండో మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ తిరిగి రావడంతో మళ్లీ నాయకత్వ పగ్గాలు హిట్ మ్యాన్ తీసుకున్నాడు. అయితే, రోహిత్ వచ్చిన తర్వాత జరిగిన మూడు మ్యాచ్ లలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్ లో చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ లను ఆడలేకపోయాడు.
రోహిత్ శర్మకు బిగ్ షాక్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగలనుంది. జట్టు ప్రదర్శన గొప్పగా లేకపోవడం, బ్యాటింగ్ లో రోహిత్ శర్మ రాణించకపోవడంతో అతను జట్టులో స్థానంలో కోల్పోయే అవకాశముంది. పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ దూరం అయ్యే అవకాశముంది. ప్లేయింగ్ XI నుండి భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలు పంపాడు.
Virat Kohli-Rohit Sharma
ఆందోళన కలిగిస్తున్న రోహిత్ ఫామ్
రోహిత్ ఇటీవలి ఫామ్ ఒక పెద్ద ఆందోళన కలిగిస్తుంది. కెప్టెన్ గా జట్టు ప్రదర్శన గొప్పగా లేదు. అదే సమయంలో బ్యాట్స్‌మన్ గా మంచి ఇన్నింగ్స్ లను కూడా ఆడలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 6.20 సగటుతో 31 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే, మొత్తం 14 మ్యాచ్‌లలో 24.76 సగటుతో 619 పరుగులతో 2024లో అతని మొత్తం ప్రదర్శన ఘోరంగా ఉంది. దీంతో రోహిత్ శర్మ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి.
Rohit Sharma-Rishabh Pant
చివరి టెస్టుకు దూరంగా రోహిత్?
ఐదో టెస్టుకు ముందు ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్‌ను చేర్చుకోవడంపై భారత కోచ్ గౌతమ్ గంభీర్ పెదవి విప్పాడు. మీడియా సమావేశానికి రోహిత్ శర్మ రాకుండా కోచ్ గౌత్ గంభీర్ ఒక్కడే వచ్చాడు. దీంతో రోహిత్ గురించి మీడియా ప్రశ్నించగా, వ్యక్తిగత ప్రదర్శనల కంటే రాబోయే టెస్టులో విజయం సాధించడంపైనే జట్టు దృష్టి సారించిందని గంభీర్ ఉద్ఘాటించాడు. ‘‘తదుపరి టెస్టు మ్యాచ్‌లో ఎలా గెలవాలనేది జట్టులో ఉన్న ఏకైక లక్ష్యమని’’ అని గంభీర్ అన్నాడు. ఈ టెస్టు ఎంత కీలకమో మనందరికీ తెలుసు నంటూ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ గురించి ప్రస్తావించారు.
అలాగే, రోహిత్‌తో అంతా బాగానే ఉందా అనే మరో ప్రశ్నకు గంభీర్ సమాధానమిస్తూ.. "రోహిత్‌తో అంతా బాగానే ఉంది. మీడియా సమావేశానికి రావాలనే సాంప్రదాయం ఏమీ లేదు. ప్లేయింగ్ 11ను ఎంపిక చేసేముందు జట్టు ఆటతీరును కూడా చూడాలి" అని పేర్కొన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటారా?
మార్చి 2024లో ఇంగ్లండ్‌పై సెంచరీ చేసినప్పటి నుండి రోహిత్ ఫామ్ కోసం కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన 15 ఇన్నింగ్స్‌లలో అతను 10.26 సగటుతో కేవలం 154 పరుగులు చేయగలిగాడు, బెంగళూరులో న్యూజిలాండ్‌పై చేసిన 52 పరుగులు వ్యక్తిగత అత్యధికం. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ పరంపర కొనసాగుతోంది. ఈ సిరీస్ లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతనిపై విమర్శల దాడి పెరిగింది. అతని వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టు కూడా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వకపోవడంతో కెప్టెన్సీపై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది.
కీలకమైన సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మకు చోటు దక్కకపోవచ్చునని సమాచారం. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటానని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. గంభీర్-రోహిత్ కు చెడిందనీ, టీమ్ లో చీలిక వచ్చిదని కూడా పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇలా అన్ని దిక్కుల నుంచి విమర్శలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ సిడ్ని టెస్టు తర్వాత టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉందని సంబంధిత కథనాలు పేర్కొంటున్నాయి. మరీ రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.. !