IND vs SL: టీమిండియాకు మరో షాక్.. జట్టుకు ఎంపికవుతున్నా దురదృష్టం అంటే అతడిదే..
Ruturaj Gaikwad: శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే లక్నోలో ముగిసిన తొలి టీ20లో గెలిచి.. శనివారం నాటి రెండో టీ20కి సిద్ధమవుతున్న రోహిత్ సేనకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే..

లంకతో సిరీస్ కు ఎంపికైన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టీ20లో చోటు దక్కకపోయినా బెంచ్ కే పరిమితమైన రుతరాజ్.. గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు.
రెండో టీ20లో రుతురాజ్ కు తప్పక స్థానం దక్కుతుందని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్న నేపథ్యంలో గతంలో అతడి కుడిచేతి మణికట్టుకు అయిన గాయం తిరగబెట్టిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
దీంతో అతడు మిగతా రెండు టీ20 లకు అందుబాటులో ఉండటం లేదు. బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా రుతురాజ్ ఇబ్బందులు ఎదుర్కోవడంతో అతడికి విశ్రాంతి కల్పించారు.
ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న రుతురాజ్... గాయం తీవ్రత ఏ మేరకు ఉందని ఇంకా తేలాల్సి ఉంది. రుతురాజ్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను తుది జట్టులోకి ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం.
చండీగఢ్ లో తొలి టెస్టు కోసం క్వారంటైన్ లో ఉన్న మయాంక్.. ఆగమేఘాల మీద రెండో టీ20 జరిగే ధర్మశాలకు చేరుకున్నాడు. అతడు జట్టుతో కలిసినప్పటికీ.. మయాంక్ ను ఆడిస్తారా..? లేదా..? అనేది అనుమానంగానే ఉంది.
ఇదిలాఉండగా.. టీమిండియాను గాయా బెడద వేధిస్తున్నది. ఈ సిరీస్ కు ముందే పనిభారం కారణంగా విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ లు లంకతో సిరీస్ కు దూరమయ్యారు.
ఇక తొడ కండరాల గాయంతో దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ కూడా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. రుతురాజ్ కూడా గాయంతో వైదొలగడం గమనార్హం.
కాగా.. రుతురాజ్ కు దురదృష్టం వెంటాడుతున్నది. వరుస సిరీస్ లకు ఎంపికవుతున్నా అతడికి తుది జట్టులో స్థానం దక్కడం లేదు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లకు ఎంపికైనా అతడు బెంచ్ కే పరిమితమయ్యాడు.
ఇక విండీస్ తో టీ20లకు ఎంపికైనా.. చివరి మ్యాచులో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచులో అతడు నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక లంకతో తొలి టీ20లో అతడికి ఆడే అవకాశమే దక్కలేదు.
గతేడాది ముగిసిన ఐపీఎల్ లో అదరగొట్టి.. సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కిన రుతురాజ్.. తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోపీలో కూడా ఇరగదీశాడు. దీంతో అతడికి టీమిండియాలో చోటు దక్కింది. కానీ తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రావడం లేదు. లంకతో మిగిలిన మ్యాచులకు అతడికి అవకాశమిస్తారని ఆశించినా.. అతడు గాయంతో ఏకంగా సిరీస్ నుంచే వైదొలగడం గమనార్హం.