- Home
- Sports
- Cricket
- Duleep Trophy: భారత్ కు ఎన్నో విజయాలు అందించిన ఈ ఇద్దరు స్టార్ల కెరీర్ ముగిసినట్టేనా?
Duleep Trophy: భారత్ కు ఎన్నో విజయాలు అందించిన ఈ ఇద్దరు స్టార్ల కెరీర్ ముగిసినట్టేనా?
Duleep Trophy: టీమిండియా టెస్టు స్పెషలిస్టులుగా గుర్తింపు పొందిన చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే దులీప్ ట్రోఫీ వెస్ట్ జోన్ జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో వీరి కెరీర్ కు ముంగింపు కార్డు పడిందనే చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే కెరీర్ ముగిసినట్టేనా?
భారత టెస్టు క్రికెట్‌కు గత దశాబ్దంలో ఎన్నో విజయాలు అందించి.. జట్టు బలమైన మద్దతుగా నిలిచిన చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు 2025-26 దులీప్ ట్రోఫీ వెస్ట్ జోన్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో మరోసారి వారి కెరీర్ ముగిసిందనే కొత్త చర్చ మొదలైంది. ముంబైలో జరిగిన తాజా సెలెక్షన్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వెస్ట్రన్ జోన్ సెలెక్షన్ కమిటీ ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అభయ్ హడప్ నేతృత్వంలో భేటీ కాగా, ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ నేతృత్వంలో జట్టును ప్రకటించారు. ముంబైకి చెందిన టెస్ట్ ఆల్‌రౌండర్ షార్దూల్ ఠాకూర్‌కు కెప్టెన్సీ అప్పగించారు.
దులీప్ ట్రోఫీ ఫార్మాట్ మార్పుపై బీసీసీఐ కీలక నిర్ణయం
దులీప్ ట్రోఫీ 2025-26 సీజన్ నుండి మళ్లీ జోన్ ఆధారిత ఫార్మాట్‌ను అమలులోకి తీసుకొచ్చింది. గత సీజన్‌లో ఇండియా A, B, C, D పేర్లతో నాలుగు జట్ల మధ్య నిర్వహించారు. అయితే, బీసీసీఐ తాజా వార్షిక సమావేశంలో ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతూ.. మళ్లీ ప్రాంతీయ జట్ల ఆధారంగా టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈసారి టోర్నీలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్‌ఈస్ట్ జట్లు పాల్గొంటున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న వెస్ట్ జోన్ సెమీఫైనల్లో నేరుగా ప్రవేశించింది. సెమీ ఫైనల్స్ సెప్టెంబర్ 4-7 మధ్య జరుగుతాయి. ఫైనల్ సెప్టెంబర్ 11న ప్రారంభమవుతుంది.
పుజారా, రహానే క్రికెట్ కెరీర్ ఇదే
చేతేశ్వర్ పుజారా భారత జట్టు తరఫున 103 టెస్టుల్లో 7195 పరుగులు చేసిన సీనియర్ బ్యాట్స్‌మెన్. ఆయన చివరి టెస్ట్ 2023 జూన్‌లో వన్డే ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడారు. అజింక్య రహానే 85 టెస్టుల్లో 5077 పరుగులు చేశారు. 2023 జూన్‌లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ను ఆడారు.
ఇద్దరూ 2024-25 రంజీ ట్రోఫీలో మంచి ఫామ్ లోనే కనిపించారు. కానీ, పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. రహానే ముంబై తరఫున 9 మ్యాచ్‌ల్లో 467 పరుగులు చేశాడు. పుజారా 7 మ్యాచ్‌ల్లో 402 పరుగులు చేశారు.
ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడాలని ఉంది.. : అజింక్య రహానే
అజింక్య రహానే ఇటీవల స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "నాకు ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తి ఉంది. ఎప్పటికీ రెడ్ బాల్ క్రికెట్‌నే ఇష్టపడతాను" అని అన్నారు. కానీ సెలెక్టర్లతో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని తెలిపారు. "నాకు సాధ్యమైనంత వరకూ నా ఆటను కొనసాగిస్తూ, టెస్ట్ క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఉంటాను. అదే నా ప్యాషన్" అని రహానే అన్నారు.
ఐతే, ఈసారి వెస్ట్ జోన్ జట్టులో చోటు దక్కకపోవడం రహానే ఆశలపై గట్టి ప్రభావం చూపింది. పుజారా ప్రస్తుతం వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు. రహానే తన యూట్యూబ్ ఛానెల్ కెరీర్ పై దృష్టి పెడుతున్నాడు.
వెస్ట్ జోన్ జట్టులో యంగ్ ప్లేయర్లకు చోటు
ఈసారి ఎంపికైన వెస్ట్ జోన్ జట్టులో యువతకే ప్రాధాన్యం ఇచ్చారు. జట్టులో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
జట్టులో రవీంద్ర జడేజా లేకపోవడం గమనార్హం. ఇటీవల ఐదు టెస్టుల్లోనూ ఆడుతున్న క్రమంలో అతనికి విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, షంస్ ములానీ, హార్విక్ దేశాయ్, అర్జన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు.
దులీప్ ట్రోఫీ 2025 వెస్ట్ జోన్ జట్టు
కెప్టెన్: షార్దూల్ ఠాకూర్ (ముంబై)
బ్యాట్స్‌మెన్: యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్
ఆల్‌రౌండర్స్: ములానీ, తనుష్ కొటియన్
బౌలర్లు: తుషార్ దేశ్‌పాండే, అర్జన్, ధర్మేంద్ర జడేజా
వికెట్ కీపర్లు: హార్విక్ దేశాయ్, సౌరభ్ నవలే
ఇతరులు: ఆర్య దేశాయ్, జయ్ ముత్ పటేల్
ప్రస్తుతం యంగ్ ప్లేయర్లతో పోటీ క్రమంలో పుజారా, రహానేలు తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు పదేళ్లుగా భారత టెస్టులకు బలంగా ఉన్న ఈ ఇద్దరికి, ఇప్పుడు ప్రాధాన్యత తగ్గిపోవడం జాతీయ స్థాయిలో వారి ప్రస్థానానికి చివరి పేజీ కావచ్చనే చర్చ మొదలైంది.