- Home
- Sports
- Cricket
- IND vs SL: నిన్న కపిల్ దేవ్.. నేడు డేల్ స్టెయిన్.. రికార్డుల రారాజు అశ్విన్ ఖాతాలో మరో ఘనత
IND vs SL: నిన్న కపిల్ దేవ్.. నేడు డేల్ స్టెయిన్.. రికార్డుల రారాజు అశ్విన్ ఖాతాలో మరో ఘనత
Ravichandran Ashwin Breaks Dale Steyn Record: భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో రెండో టెస్టు సందర్భంగా అతడు.. సఫారీ దిగ్గజాన్ని అధిగమించాడు.

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు లంకతో సిరీస్ ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మొహాలీలో ముగిసిన తొలి టెస్టులో కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన అతడు.. బెంగళూరు టెస్టులో కూడా అలాంటి మరో ఘనతే సాధించాడు.
లంకతో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్.. దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ ప్టెయిన్ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టెయిన్ ను అధిగమించాడు.
టెస్టు క్రికెట్ లో స్టెయిన్.. తాను ఆడిన 93 టెస్టులలో 439 వికెట్లు సాధించాడు. తాజాగా అశ్విన్ దీనిని అధిగమించాడు. లంకతో రెండో టెస్టు సందర్భంగా.. ధనుంజయ డిసిల్వా వికెట్ తీయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
మొహాలీ టెస్టుకు ముందు 430 వికెట్లతో ఉన్న అశ్విన్.. రెండు టెస్టుల సిరీస్ లో పన్నెండు (తొలి టెస్టులో 6, రెండో టెస్టులో 6.. మొత్తంగా 12 వికెట్లు) వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పుడు 442 వికెట్లతో టెస్టు క్రికెట్ లో అత్యధిక వికట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు.
అశ్విన్ కంటే ముందు.. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ (800) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షేన్ వార్న్ (708), అండర్సన్ (640), అనిల్ కుంబ్లే (619), మెక్గ్రాత్ (563), స్టువర్ట్ బ్రాడ్ (537), కోట్నీ వాల్ష్ (519) ఉన్నారు.
భారత్ తరఫున అయితే అనిల్ కుంబ్లే తర్వాత స్థానం అశ్విన్ దే.. కాగా కపిల్ దేవ్, స్టెయిన్ వికెట్ల రికార్డును బ్రేక్ చేయడంతో అశ్విన్ తదుపరి టార్గెట్ వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కోట్నీ వాల్ష్ (519 వికెట్లు) మీద ఉంది.
ఇక లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్ లో లంకకు భారీ లక్ష్యం (447) నిర్దేశించిన భారత్ ఆ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. మూడో రోజు ఉదయం నుంచే లంక బ్యాటర్ల పని పట్టింది. అశ్విన్ నాలుగు కీలక వికెట్లు తీశాడు.
స్కోరు వివరాలు : ఇండియా తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 303-9 డిక్లేర్డ్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 109 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 208 ఆలౌట్