Trapit Bansal: రూ. 800 కోట్ల బోనస్‌తో ఉద్యోగం.. ఏం పని చేస్తావు సామీ..
సాధారణంగా కోటి రూపాయల ప్యాకేజీ అంటేనే వామ్మో అనుకుంటాం. అలాంటిది ఓ ఉద్యోగికి మాత్రం ఏకంగా రూ. 800 కోట్ల బోనస్‌తో ఉద్యోగం లభించింది. ఇంతకీ అతను ఎవరు.? ఆయనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మెటా బంపరారఫర్
భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ నిపుణుడు త్రపిత్ బన్సల్‌కు మెటా బంపరాఫర్ ఇచ్చింది. ఓపెన్ఏఐ సంస్థలో పనిచేస్తున్న త్రపిత్‌కు మెటా ఏకంగా రూ. 800 కోట్ల బోనస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఐటీ కాన్‌పూర్‌లో గణితం, గణాంక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసి, తరువాత అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు త్రపిత్.
అక్కడే డీప్ లెర్నింగ్, మెషీన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) లో స్పెషలైజేషన్ చేశారు. అసెంచర్‌లో అనలిస్ట్‌గా మొదలైన త్రపిత్ ప్రయాణం.. IISc బెంగళూరులో రీసెర్చ్ అసిస్టెంట్‌గా కొనసాగింది. తర్వాత ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ సంస్థలతో కలిసి పని చేశారు.
ఓపెన్‌ఏఐలో కీలక పాత్ర
2022లో త్రపిత్ బన్సల్ ఓపెన్‌ఏఐలో పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరారు. అక్కడ అతను “O1” అనే మొదటి రీజనింగ్ మోడల్ రూపకల్పనలో ఓపెన్‌ఏఐ సహస్థాపకుడు ఇల్యా సుట్స్కెవర్‌తో కలిసి పని చేశారు. అంతేకాదు, చాట్‌జిపిటీలో వినియోగించే అంతర్గత రీజనింగ్ మోడళ్ల రూపకల్పనలోనూ ఆయన పని చేశారు.
మెటా కొత్తగా ప్రారంభించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్
తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ "Meta Super Intelligence Labs" పేరిట కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్ (AGI)పై పనిచేస్తున్న పరిశోధన విభాగం. ఈ ల్యాబ్‌కు ప్రముఖులు అలెగ్జాండర్ వాంగ్ (Scale AI మాజీ సీఈఓ), నాట్ ఫ్రైడ్మాన్ (GitHub మాజీ సీఈఓ) నేతృత్వం వహిస్తున్నారు.
ఉద్యోగులకు భారీ వేతన ప్యాకేజీలు
మెటా కంపెనీ, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు 4 ఏళ్లకు 30 కోట్ల డాలర్ల (రూ. 2,500 కోట్లు) వేతన ప్యాకేజీని ప్రతిపాదిస్తోందని తెలుస్తోంది. ఈ వేతనంతో పాటు $10 కోట్లు (రూ. 852 కోట్లు) వరకు జాయినింగ్ బోనస్, స్టాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. త్రపిత్ బన్సల్‌కు కూడా ఇదే స్థాయిలో ప్యాకేజీ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఓపెన్ ఏఐ స్పందన ఏంటంటే.?
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, “మెటా ఉద్యోగులను తీసుకుంటున్న విధానం మంచిది కాదు” అని వ్యాఖ్యానించారు. మెటా ఇప్పటివరకు పది మంది ఓపెన్‌ఏఐ ఉద్యోగులకు ఆఫర్లు ఇచ్చిందని చెప్పారు. అయితే, “వీరిలో మెజారిటీ జూనియర్ స్థాయి ఉద్యోగులే, మెటాకు టాప్ టాలెంట్‌ను కాప్చర్ చేయడం సాధ్యపడలేదు” అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఏఐ రంగంలో పెరుగుతోన్న ఈ పోటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.