- Home
- Careers
- Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Indias Best Law Colleges 2026 : మీ పిల్లలు ఏ సుప్రీం కోర్టులోనో లేదంటే ఏదైనా హైకోర్టు స్థాయిలో కేసులు వాదించే స్థాయి లాయర్లుగా ఎదగాలనుకుంటున్నారా..? అయితే వెంటనే ఈ లా కాలేజీల్లో జాయిన్ చేయండి.

ఇండియాలో టాప్ 10 లా కాలేజీలు
Top 10 Law Colleges in India : లా కోర్సుల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష CLAT 2026 (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సులలో చేరడానికి పోటీ మొదలైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ న్యాయ కళాశాలలు ఏవి? ఎక్కడ చదివితే మంచి ఉద్యోగం వస్తుంది? అనే గందరగోళంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఎన్.ఐ.ఆర్.ఎఫ్ (NIRF Ranking 2025) ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశంలోని టాప్ 10 న్యాయ విశ్వవిద్యాలయాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
1. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగళూరు
భారతదేశంలో నంబర్ 1 లా కాలేజీగా ప్రసిద్ధి చెందింది బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ (NLSIU). ఇక్కడి విద్యా వాతావరణం చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. దేశంలోని ఉత్తమ న్యాయ నిపుణులు ఇక్కడ బోధిస్తారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు అనేకమంది సుప్రీంకోర్టు, హైకోర్టులు, అంతర్జాతీయ సంస్థలలో పనిచేస్తున్నారు. ఇక్కడ చేరడానికి CLAT పరీక్షలో అధిక మార్కులు (కటాఫ్) సాధించడం అవసరం.
2. నేషనల్ లా యూనివర్సిటీ (NLU), ఢిల్లీ
రెండో స్థానంలో ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఉంది. దేశ రాజధానిలో ఉండటం వల్ల విద్యార్థులకు కోర్టులు, న్యాయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం సులభంగా లభిస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ CLAT పరీక్ష ద్వారా అడ్మిషన్లు జరగవు... బదులుగా NLAT అనే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
3. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (NALSAR), హైదరాబాద్
హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ (NALSAR) విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పరిశోధనలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చదువుతున్నప్పుడే విద్యార్థులను మూట్ కోర్ట్, కేస్ స్టడీస్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. ఇది వారి ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచుతుంది. ఇక్కడ CLAT పరీక్ష మార్కుల ఆధారంగా ఆల్ ఇండియా స్థాయిలో సీట్లు కేటాయిస్తారు.
4. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (NUJS), కోల్‌కతా
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని NUJS యూనివర్సిటీ కార్పొరేట్ లా, అంతర్జాతీయ న్యాయశాస్త్ర కోర్సులకు పేరుగాంచింది. దీని పూర్వ విద్యార్థులు చాలా ముఖ్యమైన పదవులలో ఉండటం వల్ల, ఇక్కడ చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఇక్కడ కూడా CLAT పరీక్ష ద్వారానే అడ్మిషన్లు జరుగుతాయి.
5. గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ (GNLU), గాంధీనగర్
ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాలలో గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ ఒకటి. ఆధునిక మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు దీని బలం. కొన్ని ప్రత్యేక కోర్సులకు ఇంటర్వ్యూలు నిర్వహించినా, సాధారణ అడ్మిషన్లు CLAT పరీక్ష ద్వారానే జరుగుతాయి.
6. ఐఐటీ ఖరగ్‌పూర్ - రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఐపీ లా
ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఈ లా కాలేజ్ టెక్నాలజీ, చట్టానికి సంబంధించిన కోర్సులకు, ముఖ్యంగా మేథొ సంపత్తి హక్కుల (IP Law) చట్టానికి ఉత్తమమైనది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక మంచి ఎంపిక. ఇక్కడ CLAT, JAM లేదా సంస్థ సొంత పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు.
7. సింబయాసిస్ లా కాలేజ్, పుణె
ప్రైవేట్ లా కాలేజీలలో పుణె సింబయాసిస్ (Symbiosis) చాలా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చదువుతో పాటు వృత్తి అనుభవం, ఉద్యోగ అవకాశాలకు (ప్లేస్‌మెంట్స్) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చాలా పెద్ద న్యాయ సంస్థలు ఇక్కడికి వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. ఇక్కడ SLAT ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి.
8. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
తక్కువ ఫీజుతో నాణ్యమైన న్యాయ విద్య కోసం జామియా మిలియా ఇస్లామియా ఒక మంచి ఎంపిక. ఢిల్లీలో ఉండటం వల్ల కోర్టు ప్రాక్టీస్ అవకాశాలు ఎక్కువ. ఇక్కడ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్ష, మెరిట్ ఆధారంగా విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతాయి.
9. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (AMU), అలీఘర్
చాలా పురాతనమైన, ప్రసిద్ధమైన లా ఫ్యాకల్టీని AMU కలిగి ఉంది. ఇక్కడ చదివిన చాలా మంది న్యాయవ్యవస్థలో పెద్ద ప్రముఖులుగా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించే లా ఎంట్రన్స్ పరీక్ష ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ఇతర చోట్ల కంటే ఇక్కడ ఫీజు చాలా తక్కువ. అందుకే మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు ఈ కాలేజీలో లా చేయవచ్చు.
10. శిక్షా 'ఓ' అనుసంధాన్ (SOA), భువనేశ్వర్
అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో భువనేశ్వర్ SOA ముఖ్యమైనది. ఆధునిక సౌకర్యాలు, వృత్తి ఆధారిత శిక్షణకు ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష లేదా మార్కుల ఆధారంగా ఇక్కడ అడ్మిషన్లు ఇస్తారు.
న్యాయ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు, తమ భవిష్యత్ లక్ష్యానికి అనుగుణంగా (కార్పొరేట్ లా, జ్యుడీషియరీ, రీసెర్చ్) సరైన కాలేజీని ఎంచుకోవడం అవసరం.

