- Home
- Careers
- మీ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్... రోజులో ఎంత టైమ్ వృధా చేస్తున్నాయో తెలుసా? : రోచే డిజిటల్ సెంటర్ సర్వేలో బైటపడ్డ అసలునిజాలు
మీ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్... రోజులో ఎంత టైమ్ వృధా చేస్తున్నాయో తెలుసా? : రోచే డిజిటల్ సెంటర్ సర్వేలో బైటపడ్డ అసలునిజాలు
అతిగా స్మార్ట్ ఫోన్ వాడకం మన పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో రోచే డిజిటల్ సెంటర్ సర్వే బైటపెట్టింది. మనం చూసే కొన్ని సెకన్ల నోటిఫికేషన్ రోజులో ఎంత టైమ్ ను వృధా చేస్తుందట తెలుసా?

స్మార్ట్ ఫోన్ యూజర్స్.. తస్మాత్ జాగ్రత్త
phone notifications distract :ఈ టెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే చాలు... ప్రపంచమే మన చేతిలో ఉన్నట్లే. మనిషి బ్రతికేందుకు కనీస అవసరాలైన కూడు, గూడు జాబితాలోకి ఈ సెల్ ఫోన్ చేరిపోయింది... ఇంకా చెప్పాలంటే వీటికంటే ఇదే ముఖ్యమైందని భావించేవాళ్ళే చాలామంది ఉంటారు. మనం తినే అహారం దగ్గర్నుండి ప్రభుత్వ పథకాల వరకు ఫోన్ తోనే లింక్ అయి వుంటున్నాయి… ఫోన్ లేదంటే ఇవి దక్కడం కష్టమైపోయింది. ఇలా అవసరాలకోసమే కాదు సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్స్ వంటి సరదాల కోసం స్మార్ట్ ఫోన్ వాడేవారి సంఖ్య మరీ ఎక్కువ. నేటితరం ఈ స్మార్ట్ ఫోన్ కు ఎంతలా అలవాటు పడ్డారంటే ఇది లేకుంటే పిచ్చోళ్ళు అయిపోయేలా ఉన్నారు.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత లాభముందో అంతకంటే ఎక్కువ నష్టం ఉంది. సెల్ ఫోన్స్ వల్ల శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు రావడమే కాదు సైబర్ మోసాలతో ఆర్థిక నష్టాలు, మితిమీరిన సోషల్ మీడియా వాడకంతో యువత దారితప్పడం, విద్యార్థుల చదువు దెబ్బతినడం... ఇలా చెప్పుకుంటే పోతే సెల్ ఫోన్ అనర్దాల చిట్టా చాంతాడంత అవుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మనిషి పనితీరు కూడా దెబ్బతింటోందని... మన ఏకాగ్రతను ఇది దెబ్బతీస్తోందని ఓ సర్వే గుర్తించింది. ఈ సర్వే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
స్మార్ట్ ఫోన్ మన పనితీరును ఎంతలా దెబ్బతీస్తోందంటే...
మితిమీరిన స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ వాడకం మనిషి పని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని రోచే డిజిటల్ సెంటర్ (GCC) హెడ్ రాజా జమలమడక గుర్తించారు. ఆయన స్వీయ అనుభవంతో పాటు ప్రత్యేక సర్వే ద్వారా స్మార్ట్ ఫోన్ ఏ స్థాయిలో మనిషి పనితీరును దెబ్బతీస్తుందో గుర్తించారు. ముఖ్యంగా ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్లు శ్రద్దగా పనిచేసే సమయంలో ఏకాగ్రతను దెబ్బతీస్తాయని... అలాగే వీటివల్ల రీడింగ్ అలవాటు కూడా దెబ్బతింటోందని వెల్లడించారు. మొత్తంగా మన పనితీరుపై ఈ నోటిఫికేషన్స్, మల్టిటాస్కింగ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని జమలమడక తెలిపారు.
గత కొన్ని నెలలుగా స్మార్ట్ వల్ల తన పనితీరు ఎలా మారిందో రాజా జమలమడక గమనించారు. ఈ క్రమంలో తన రీడింగ్ స్పీడ్, ఏకాగ్రత 50 శాతం తగ్గిందని... చదివే సమయం 33 శాతం తగ్గిందని గుర్తించారు. అనారోగ్య సమస్యలేమీ లేకున్నా, అతిగా సోషల్ మీడియా వాడకున్నా తన జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించానని తెలిపారు. ఇలా తరచూ డిజిటల్ ఆటంకాల వల్ల తన సమయం వృధా అవుతుందని రాజ జమలమడక వెల్లడించారు.
రోచె డిజిటల్ సెంటర్ సర్వే...
మొబైల్ నోటిఫికేషన్లు, మల్టీ టాస్కింగ్స్ వల్ల తన ఒక్కడి పనితీరే కాదు అందరి పనితీరులో మార్పులు వస్తున్నాయని రాజ జమలమడక గుర్తించారు. ఇందుకోసం ఆయన 576 మంది ప్రొఫెషనల్స్ పై ప్రత్యేక సర్వే నిర్వహించారు. తన సర్వే కోసం వివిధ హోదాల్లో పనిచేసేవారిని ఎంచుకున్నారు... ఇలా 203 మంది సీనియర్ లీడర్స్, 146 మంది మిడిల్ స్థాయి మేనేజర్లు, 227 మంది సాధారణ ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. అయితే పనివేళలో అందరికీ ఈ నోటిఫికేషన్లు ఆటంకం కలిగిస్తున్నాయని... తద్వారా పనితీరు దెబ్బతింటోందని గుర్తించినట్లు తెలిపారు.
''ఫోన్ నోటిఫికేషన్లకు చాలా సమయం వృధా అవుతుంది. ఫోన్ కి వచ్చే మేసేజ్ లు, సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్లు, ప్రమోషన్స్ సందేశాలు పనివేళల్లో ఆటంకం కలిగిస్తాయి. చాలామందికి ఫోన్ లో ఏమయినా మిస్సయేమోనని తరచూ అన్ లాక్ చేసి చూడటం అలవాటయ్యింది. ఇలా ఒక్కసారి పనిపై ఫోకస్ పోయిందంటే తిరిగి ఏకాగ్రతతో పనిలో లీనం కావడానికి దాదాపు 10 నిమిషాలైనా పడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇలా నోటిఫికేషన్లు, ప్రమోషనల్ మెసేజ్ లు కలిగించే 10-20 సెకన్ల ఆటంకం వల్ల 10-20 నిమిషాలు వృధా అవుతుంది. ఇలా రోజులో ఓ 20 నోటిఫికేషన్లు వస్తే... వర్కింగ్ టైమ్ నాశనం అయినట్లే'' అని రాజ జమలమడక పేర్కొన్నారు.
స్మార్ట్ పరికరాలన్ని ఏకాగ్రతను దెబ్బతీసేవే...
ఇప్పటి ప్రొఫెషనల్ చేతిలో నిత్యం స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి స్మార్ట్ పరికరాల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇవి ఉత్పాదకత సాధనాల్లా కనిపించినా వాస్తవానికి ఇవి ఏకాగ్రతను దెబ్బతీసి మన పని సామర్థ్యాన్ని తగ్గించేవేనని రాజా జమలమడక పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏఐ సమయాన్ని ఆదా చేసినా ఆ సమయాన్ని మనం మరిన్ని డిస్ట్రాక్షన్స్ కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఏఐ పైన అధికంగా ఆధారపడటం వల్ల మానవ మేధోశక్తి తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు.
స్మార్ట్ ఫోన్ సమస్యకు పరిష్కారం
స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు, ఈ టెక్నాలజీ మన పనితీరును దెబ్బతీయకుండా ఉండేలా రాజ జమలమడక కొన్ని పరిష్కాలను సూచించారు. అవేమిటో ఇక్కడ చూద్దాం.
1. టెక్నాలజీ వాడకాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. అవసరం అయితే వాడాలి.. అవసరం లేకుంటే వాటి జోలికి పోవద్దు.
2. మల్టీటాస్కింగ్‌ను మానుకోవాలి. ఓ సమయంలో ఓకే పనిపై దృష్టిపెట్టాలి.
3. పనివేళల్లో ఫోకస్ సమయాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం నోటిఫికేషన్ ఆపేయాలి, ట్యాబ్స్ మూసేయాలి. మెదడును మాత్రమే వాడాలి.
4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఓ సాధనంగా మాత్రమే వాడాలి... పూర్తిగా ఆధారపడకూడదు.
5. మన మేధస్సునే ఎక్కువగా ఉపయోగించాలి.
అంతిమంగా రాజా జమలమడక పీటర్ డ్రక్కర్ ప్రసిద్ధ కోటేషన్‌ను ప్రస్తావించారు… “కల్చర్ స్ట్రాటజీని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఈ టెక్నాలజీ మాత్రం మానవ మేధస్సును బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లా తింటోంది” అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీపై పట్టు సాధించడం అంటే కొత్తకొత్త వస్తువులను ఎలా వాడాలో తెలిసివుండటం కాదు... వాటిపై అవగాహన పెంచుకుని మన మెదడును దానికి అనుగునంగా ఎలా పనిచేయాలో ట్రెయిన్ చేయడమని రాజ జమలమడక వెల్లడించారు.