రూ. 10 వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్.. ఇక హైదరాబాద్ టూ విజయవాడ ప్రయాణం 2 గంటలే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి ఇప్పుడు మరింత ఆధునిక రూపం సంతరించుకోనుంది. త్వరలోనే భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రం గ్రీన్‌సిగ్నల్
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుపై సుముఖత చూపడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రోడ్లు, ఉపరితల రవాణా శాఖ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివారులోని అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఈ హైవే ప్రారంభమై అమరావతికి చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీరిరి పూర్తిస్థాయి యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా నిర్మించనున్నారు. అంటే పశువులు, సాధారణ వాహనాలు హైవేపైకి రాకుండా ఉండేందుకు కంచెలు, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేస్తారు.
రూ. 10 వేల కోట్ల అంచనాలతో
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 230 నుంచి 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ వ్యయం రూ. 8,800 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సర్వీస్ రోడ్లు లేకుండా, నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ హైవేగా ఇది రూపొందనుంది. ప్రధాన పట్టణాలకు దగ్గరగా మాత్రమే ఎగ్జిట్ రోడ్లు ఏర్పాటవుతాయి. త్వరలోనే DPRకు టెండర్లు పిలవనున్నారు.
తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. రాబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఈ ప్రయాణం 70 కి.మీ తగ్గనుంది. ఫలితంగా అమరావతి–హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 2 నుంచి 3 గంటల్లో పూర్తవుతుంది. దీంతో ఇంధనం, సమయం రెండూ ఆదా అవుతాయి. ముఖ్యంగా పండగల సమయంలో, రద్దీ సమయంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్య పాత్ర పోషించనుంది.
తెలంగాణలో డ్రై పోర్టు
తెలంగాణకు సముద్రతీరం లేకపోవడం వల్ల దిగుమతి–ఎగుమతులకు ఏపీ పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేసే రైలు మార్గం, హైదరాబాద్ శివారులో డ్రైపోర్టు ప్రణాళికలో ఉన్నాయి. కొత్త ఎక్స్‌ప్రెస్‌వే వాణిజ్య రవాణాకు అనువుగా ఉండి, ఎగుమతులు–దిగుమతులు తక్కువ ఖర్చుతో జరగనున్నాయి. అంతేకాకుండా రహదారి వెంబడి పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. చిన్న పట్టణాలు, గ్రామాలు వాణిజ్య కేంద్రాలుగా ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో
ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఈ హైవే ప్రాముఖ్యతను కేంద్రానికి వివరించడంతో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రాజెక్ట్ అమలును ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సామాజిక బంధాలు మరింత బలపడతాయి.