ఐటీ ఉద్యోగుల కంటే డెలివరీ భాయ్స్ కే ఎక్కువ జీతాలు... ఎవరికెంత వస్తుందో తెలుసా?
ఐటీ రంగం అంటే హై సాలరీలు, హై లైఫ్ అనుకునే రోజులు అయిపోయాయి... ఇప్పుడు వీరికంటే డెలివరీ భాయ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఓసారి వీరిద్దరి సంపాదనను పోల్చిచూద్దాం.

ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇలా తయారయ్యిందేంటి..!
Hyderabad : సాప్ట్ వేర్ ఇంజనీర్ ... వినడానికి ఈ పేరు చాలా బాగుంటుంది... కానీ చేయడానికే ఈ ఉద్యోగం చాలా కష్టం. సాప్ట్ వేర్ జాబ్ అంటేనే తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదని ఆ రంగంలో పనిచేసే ఎవరినడిగినా చెబుతారు. జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు. కానీ ఈ రంగంలో మంచి సాలరీలు ఉంటాయనే చాలామంది యువత ఇంజనీరింగ్ పూర్తిచేయగానే ఐటీ కంపెనీల్లో అడుగుపెడుతున్నారు.
ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం రావడం అదృష్టం… కానీ ఇప్పుడు ఈ రంగంలో ఉద్యోగాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. పెద్దపెద్ద మల్టీనేషనల్ ఐటీ కంపెనీలే మాస్ లేఆఫ్స్ చేస్తున్నాయి... ఇక చిన్నాచితక సంస్థల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే మైక్రోసాప్ట్ 9వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మొత్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే లక్షమంది ఐటీ ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఓవైపు ఉద్యోగులను తొలగిస్తూనే మరోవైపు కొత్తగా నియమించుకునేవారిని అతి తక్కువ సాలరీలను ఆఫర్ చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. దీంతో ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కంటే క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ భాయ్స్ అధికంగా సంపాదిస్తున్నారు. ఇలా 'పేరు గొప్ప.. ఊరు దిబ్బ' అన్నట్లుగా తయారయ్యింది సాప్ట్ వేర్ల పరిస్థితి. ఇంజనీర్లమంటూ గొప్పగా చెప్పుకోవడమే తప్ప చాలిచాలని జీతాలతో సరిపెట్టుకుంటున్నట్లు సాప్ట్ వేర్లు వాపోతున్నారు.
టెకీల కంటే ఫుడ్ డెలివరీ భాయ్సే ఎక్కువ సంపాదిస్తున్నారా?
ఐటీ రంగంలో ప్రెషర్స్ గా జాయిన్ అయ్యే ఇంజనీర్ల కంటే ఫుడ్ డెలివరీ భాయ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు... వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే నిజం. ఇంకా చెప్పాలంటే ఐటీలో టీమ్ లీడర్ స్థాయిలో ఉన్నవారికంటే కూడా ఫుడ్ డెలివరీ సంస్థల్లో సిన్సియర్ గా పనిచేసే డెలివరీ భాయ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల సాలరీలు, ఫుడ్ డెలివరీ భాయ్స్ కు వచ్చే ఆదాయాన్ని ఓసారి పోల్చిచూద్దాం.
చాలామంది ఐటీ ఉద్యోగులకు ఇదే సాలరీ...
చాలా ఐటీ కంపెనీలు కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు ఏడాదికి రూ.3 నుండి 5 లక్షల లోపు చెల్లిస్తున్నాయి. దాదాపు 60శాతం మంది ఐటీ ప్రెషర్స్ సాలరీలు ఇలాగే ఉన్నాయి. అంటే వీళ్ల నెలజీతం రూ.25,000 నుండి రూ.35,000 లోపు ఉంటుంది. కొందరికి ఇందులోంచే పీఎఫ్ వంటి అలవెన్సులు కూడా కట్ అవుతాయి,
ఇదే సమయంలో ఫుడ్ డెలివరీ సంస్ధల్లో పనిచేసే డెలివరీ భాయ్స్ నెలకు ఈజీగా రూ.30,000 వేలు సంపాదిస్తున్నారు. ఇక మంచి రేటింగ్ కలిగి ఎక్కువ సమయం పనిచేసే డెలివరీ భాయ్స్ అయితే నెలకు ఏకంగా రూ.50,000 నుండి రూ.60,000 కూడా సంపాదిస్తున్నారు.
ఫుడ్ డెలివరీ భాయ్స్ కి ఇంత ఆదాయం ఎలా?
ఫీక్ అవర్స్ అంటే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాలు, బాగా ఎండ, వర్షం కురిసే సమయాలు, రాత్రులు ఫుడ్ డెలివరీ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి... ఇలాంటి సమయాల్లోనే కొందరు ఫుడ్ డెలివరీ చేయడానకి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా స్మార్ట్ గా ఆలోచించే ఫుడ్ డెలివరీ భాయ్స్ ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
ఐటీ ఉద్యోగానికి డిగ్రీ పట్టా ఉండాలి... వివిధ కంప్యూటర్ కోర్సులు చేసుండాలి... అయితేనే ఉద్యోగం. కానీ ఫుడ్ డెలివరీ భాయ్ గా పనిచేసేందుకు ఇవేమీ అవసరం లేదు... ఓ బైక్, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. కానీ ఐటీ ఉద్యోగుల కంటే ఫుడ్ డెలివరీ భాయ్స్ సంపాదనే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది.
ఈ విషయంలో ఇంజనీరింగ్ ఉద్యోగాలే బెస్ట్
ఫుడ్ డెలివరీ భాయ్స్ జాబ్ రిస్క్ తో కూడుకున్నది. నిత్యం వాహనంపై ట్రాఫిక్ లో తిరుగుతుండాలి... కాబట్టి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. కానీ ఫుడ్ డెలివరీ సంస్థలు వీరికి ఎలాంటి ఇన్సూరెన్స్ కల్పించవు. అలాగే పిఎఫ్ వంటి ఇతర అలవెన్సులు కూడా ఉండవు... జాబ్ సెక్యూరిటీ ఉండదు. శారీరకంగా అధిక శ్రమ ఉంటుంది. ప్రతినెలా ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండదు... అంటే స్థిరమైన ఆదాయం ఉండదన్నమాట.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కంపెనీలు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పిస్తాయి... వీరికి శారీరక శ్రమ ఉండదు. ఏసీలో కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని చేసే పనే.. కానీ మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. నెలనెలా స్థిరమైన సాలరీ వస్తుంది... కాబట్టి ఇందుకు తగినట్లు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.

