రోబోలతోనే పని.. టాప్ 5 దేశాలు.. భారత్ స్థానం ఎంత?
Robot Technology: ప్రపంచంలో వర్క్ ఫోర్స్ లో అత్యధిక రోబోల వినియోగం ఉన్న టాప్ 5 దేశాల్లో దక్షిణ కొరియా టాప్ లో ఉంది. ఈ లిస్టులో అమెరికా లేకపోవడం గమనార్హం. మరి భారత్ స్థానం ఏంత?

మనుషులు సైతం చేయలేని పనులు చేస్తున్నరోబోలు
5 Countries With Most Robot Workers: సాంకేతిక రంగంలో కొత్త విప్లవాత్మక మార్పులు, పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పరిశ్రమల్లో రోబోట్ల వినియోగం అతి ముఖ్యమైన భాగంగా మారింది.
ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, ఖర్చులు తగ్గించడం, పనులను వేగంగా పూర్తి చేయడం వంటి అనేక కారణాలతో ఆటోమేషన్ వైపు దేశాలు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధికంగా రోబోట్లు ఉపయోగిస్తున్న టాప్ 5 దేశాలను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ (IFR) తాజాగా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. సౌత్ కొరియా టాప్ లో ఉంది.
KNOW
దక్షిణ కొరియా
ప్రపంచంలో అత్యధిక రోబోట్ వినియోగం కలిగిన దేశం దక్షిణ కొరియా. ప్రతి 10,000 మంది కార్మికులకు 1,012 రోబోలు వినియోగంలో ఉన్నాయి. 2018 నుంచి ప్రతి ఏడాది సగటున 5 శాతం పెరుగుదల నమోదు అవుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల అభివృద్ధితో ఇది సాధ్యం అయింది.
సింగపూర్
సౌతా కొరియా తర్వాత స్థానంలో సింగపూర్ ఉంది. ప్రతి 10,000 మంది కార్మికులకు 770 రోబోలు ఉన్నాయి. చిన్న స్థాయి వర్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ, అధిక సాంకేతిక ఆధారిత తయారీ రంగం కారణంగా రోబోట్ డెన్సిటీ (Robot Density) చాలా ఎక్కువగా ఉంది.
చైనా
2022లో వర్క్ ఫోర్స్ లో 402 రోబోలు మాత్రమే కలిగి ఉన్న చైనా, 2023 నాటికి ఈ సంఖ్యను 470కి పెంచుకుంది. దీంతో జర్మనీ, జపాన్‌లను వెనక్కి నెట్టి మూడో స్థానానికి వచ్చింది. చైనా ఆటోమేషన్ వైపు చాలా వేగంగా అడుగులు వేస్తూ ప్రపంచంలో తయారీ శక్తిగా తన స్థానాన్ని బలపరుచుకుంటోంది.
జర్మనీ
ప్రతి 10,000 మందికి 429 రోబోల వర్క్ ఫోర్స్ ను కలిగిన జర్మనీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇది యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. 2018 నుంచి నిరంతరం 5 శాతం వృద్ధితో రోబోట్ వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా కార్ల తయారీ పరిశ్రమ జర్మనీ ఆటోమేషన్ వైపు దూసుకెళ్లడానికి ప్రధాన కారణం.
జపాన్
జపాన్ ప్రపంచంలో అతిపెద్ద రోబోట్ ఉత్పత్తి దేశం అయినప్పటికీ, వినియోగంలో మాత్రం ఐదో స్థానంలో ఉంది. ప్రతి 10,000 మంది కార్మికులకు 419 రోబోలు ఉన్నాయి. 2018 నుంచి 2023 మధ్య 7 శాతం వృద్ధి నమోదు చేసింది.
వర్క్ ఫోర్స్ విషయంలో భారత్ ఈ లిస్టులో టాప్ 10లో లేదు కానీ, ప్రపంచంలో కొత్త రోబోలను ఉపయోగిస్తున్న దేశాల్లో 9వ స్థానంలో ఉంది. భారతదేశం ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఇతర తయారీ రంగాల్లో రోబోల వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. మేక్ ఇన్ ఇండియా, ఆటోమేషన్ వంటి కార్యక్రమాలు దీనికి ఊతమిస్తున్నాయి.
2023లో కొత్త పారిశ్రామిక రోబోల వినియోగంలో ప్రపంచంలోని 5 దేశాలు
- చైనా
- జపాన్
- అమెరికా
- దక్షిణ కొరియా
- జర్మనీ
కొత్త పారిశ్రామిక రోబోల వినియోగంలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. 2023లో, భారతదేశంలో 8,510 కొత్త రోబోలు ఉన్నాయి.