- Home
- Business
- Money Rules: ఈ ఐదు విషయాలు పాటిస్తే.. జీవితంలో మీరు పేద వారు కారు. ఆర్థిక సమస్యలు రానే రావు.
Money Rules: ఈ ఐదు విషయాలు పాటిస్తే.. జీవితంలో మీరు పేద వారు కారు. ఆర్థిక సమస్యలు రానే రావు.
ఆర్థికంగా ఎదగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందరూ ఇందులో సక్సెస్ కాలేరు. ప్రముఖ ఆర్థిక నిపుణులు వారెన్ బఫెట్ చెప్పిన ఈ ఐదు ఆర్థిక సూత్రాలు పాటిస్తే జీవితంలో కష్టం రాదు.

ఎంత సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు
ఇప్పటి యువత ఎక్కువ జీతాలు సంపాదిస్తున్నా, ఖర్చుల్లో నియంత్రణ లేకపోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. నెలకు లక్షల్లో వచ్చే జీతం చూసి వెంటనే కార్లు, బైకులు కొనడం, క్రెడిట్ కార్డుతో అవసరం లేని ఖర్చులు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది. ఈ అలవాటు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. అయితే అమెరికన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పిన ఆర్థిక సూత్రాలు పాటిస్తే ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
KNOW
క్రెడిట్ కార్డు జాగ్రత్తగా వాడాలి
ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలో క్రెడిట్ కార్డు ఉంటోంది. ఆర్థిక అవసరాలను తీర్చే క్రెడిట్ కార్డును సరిగ్గా వాడకపోతే అప్పుల ఊబిలో పడేస్తుంది.
బఫెట్ సూచన ప్రకారం, కార్డు వాడుతున్నా పూర్తి బిల్లును సమయానికి చెల్లించాలి. మినిమమ్ పేమెంట్ చేస్తూ వెళితే వడ్డీ భారం పెరిగి అప్పు పెరుగుతుంది. అవసరం ఉన్నప్పుడే వాడాలి, కార్డు ఉంది కదా అని అనవసర ఖర్చులు చేయకూడదు అనేది ఆయన సలహా.
కార్లు – విలువ తగ్గే ఆస్తి
కొత్త కారు కొనడం అంటే చాలా మందికి కల. కానీ షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాని విలువ పడిపోతుందని బఫెట్ హెచ్చరిస్తారు. ఐదేళ్లలో సుమారు 60 శాతం విలువ తగ్గుతుంది. కాబట్టి పెట్టుబడులు విలువ పెరిగే ఆస్తుల్లో పెట్టాలి కానీ విలువ తగ్గే వాటిలో కాదు. బఫెట్ స్వయంగా సాధారణ కార్లనే వాడతారు. 2014లో కొనుగోలు చేసిన క్యాడిలాక్ ఎక్స్‌టీఎస్‌ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
ఇల్లు – అవసరానికి సరిపడేంత మాత్రమే
సొంతిల్లు అన్నది అందరికీ కల. కానీ అవసరానికి మించి పెద్ద ఇల్లు కొనడం అనవసరం అని బఫెట్ చెబుతారు. పెద్ద ఇల్లు కొంటే కేవలం కొనుగోలు ధర మాత్రమే కాదు, మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఈఎంఐల భారమూ పెరుగుతాయి. బఫెట్ స్వయంగా 1958లో కొనుగోలు చేసిన సాధారణ ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నారు. అంటే ఇల్లు మన అవసరానికి సరిపోవాలి కానీ ఆడంబార కోసం కాదని చెబుతారు.
లాటరీలు, బెట్టింగ్‌లకు దూరంగా
లాటరీలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అదృష్ట ఆధారిత మార్గాలు తాత్కాలిక లాభం ఇవ్వొచ్చు కానీ దీర్ఘకాలంలో నష్టమే ఎక్కువ. అలాగే తమకు అర్థం కాని పెట్టుబడి పథకాలలో డబ్బు పెట్టరాదు. ఎవరో చెప్పారని పెట్టుబడి పెడితే రిస్క్ పెరుగుతుంది. అధిక లాభం అనే పేరుతో వచ్చే పథకాలలో అధిక ప్రమాదం కూడా దాగి ఉంటుందని బఫెట్ హెచ్చరిస్తారు.
ముందు పొదుపు, ఆ తర్వాతే ఖర్చు
బఫెట్ చెప్పే ముఖ్యమైన ఆర్థిక సలహాల్లో పొదుపు ప్రధానమైంది. బఫెట్ సలహా ప్రకారం మీరు సంపాదిస్తున్న దాంట్లో ముందు పొదుపు పెట్టి మిగతా మొత్తాన్ని ఖర్చు చేయాలి. అవసరాలకు సరిపడా ఖర్చు చేసుకోవడం బాగానే ఉన్నా, ఆడంబరాల కోసం ఖర్చు చేస్తే భవిష్యత్తు కష్టాల్లో పడుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.