D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
D Mart: డీమార్ట్‌లో కొనడమే కాదు.. మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మవచ్చు కూడా. దీని కోసం మీరు ఏం చేయాలి? ఎలాంటి అర్హతలు కావాలి? డాక్యుమెంట్లు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

డీమార్ట్‌లో కొనడమే కాదు అమ్మవచ్చు కూడా
డీమార్ట్‌లోనే ఎక్కువ మంది నెలవారీ సరుకులు కొంటూ ఉంటారు. అయితే కేవలం ఉత్పత్తులు కొనడమే కాదు.. తిరిగి అమ్మవచ్చు కూడా. అయితే దీనికి కొన్ని అర్హతలు ఉండాలి. డీమార్ట్ ఎవరికీ ఫ్రాంచైజీ ఇవ్వదు. అంటే మీరు డీ మార్ట్ స్టోర్ తెరవలేరు. కానీ మీ వస్తువులను మాత్రం డీమార్ట్ లో అమ్మవచ్చు. అంటే మీరు డీమార్ట్ కు వెండర్ గా మారవచ్చు.
మీకు ఎలాంటి అర్హతలు ఉండాలి?
మీరు తయారు చేసిన ఉత్పత్తులను డీమార్ట్ లో అమ్మాలనుకుంటే కొన్ని విషయాలు ముందుగా తెలుసుకోవాలి. మీరు తయారు చేసే ఉత్పత్తి క్వాలిటీ చాలా బాగుండాలి. ధర కూడా నచ్చినంత పెట్టడానికి వీలు లేదు. మార్కెట్‌లోని ఇతర ప్రొడక్టులతో పోటీపడేలా ధర ఉండాలి. ఇక ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉండాలి. అలాగే డిమార్ట్ కు నిరంతరం ఎప్పుడైనా సరఫరా చేసేలా ఉండాలి. కొరత రాకూడదు. ఇవన్నీ చెక్ చేశాకే డిమార్ట్ మీ ఉత్పత్తులను అమ్మడానికి ఒప్పుకుంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు, డబ్బు
మీరు డిమార్ట్ లో ఎలాంటి వస్తువులను అమ్మాలనుకుంటున్నారో దాన్ని బట్టి డాక్యుమెంట్లను సమర్పించాలి. ఎవరైనా సరే GST, PAN నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక అమ్మేది ఆహార ఉత్పత్తి అయితే, FSSAI లైసెన్స్ కూడా ఉండాలి. కొన్ని రకాల ఉత్పత్తులకు BIS లాంటి ప్రభుత్వ సర్టిఫికెట్లు కూడా అవసరం పడతాయి. ఇవన్నీ ఉంటేనే డిమార్ట్ మీ ఉత్పత్తులను అమ్మేందుకు ఒప్పుకుంటుంది.
డిమార్ట్ కొన్నిసార్లు స్టోర్‌లోని షెల్ఫ్‌లో మీ వస్తువులను పెట్టి అమ్మడానికి కొంత ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది. నెలకి ఎంత లాభం వస్తుంది? అనేది మాత్రం మీ ప్రొడక్ట్ నాణ్యత, దానికి ఉన్న డిమాండ్, అమ్మకాలు, డీమార్ట్‌తో మీరు చేసుకున్న ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
డిమార్ట్ లో సరుకులు అమ్మడానికి ముందుగా డీమార్ట్ అధికారిక వెబ్‌సైట్ (Avenue Supermarts Ltd - Partner With Us)లోకి వెళ్లి 'Vendor Registration' ఫారమ్ పూర్తి చేసి అప్లై చేయాలి. మీరు చిన్న లేదా మధ్య తరహా పరిశ్రమ అయితే, కేంద్ర ప్రభుత్వ Udyam / MSME సర్టిఫికెట్ ఉంటే ప్రాధాన్యత లభించడంతో పాటు, వ్యాపారానికి రక్షణగా ఉంటుంది.డీమార్ట్ సాధారణంగా సరుకు తీసుకున్న 30 నుంచి 60 రోజుల్లోపు పేమెంట్ చేస్తుంది. అమ్ముడుపోని లేదా డ్యామేజ్ అయిన వస్తువులను వెనక్కి తీసుకునే (RTV - Return to Vendor) నిబంధనలకు మీరు ఒప్పుకోవాలి. మీ ప్రతి ఉత్పత్తిపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన GS1 బార్‌కోడ్ తప్పనిసరిగా ఉండాలి. మీ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుండి, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉండి, అడిగినప్పుడు సప్లై చేసే సామర్థ్యం ఉంటే.. డీమార్ట్ మీ వస్తువులను చక్కగా అమ్మి పెడుతుంది.

