Farming: ఈ పంటను ఒక్క ఎకరంలో వేసినా చాలు.. లాభాల వర్షం కురుస్తుంది!
ఏ పంట అయినా సరే.. మంచి లాభాలు తెచ్చినప్పుడే రైతు కష్టం తీరుతుంది. నేల స్వభావం, నీటి వసతి, మార్కెట్ సౌకర్యాలకు అనుగుణంగా రైతులు పంటలను ఎంచుకుంటే లాభాలు పొందవచ్చు. గత కొన్నేళ్లుగా రైతులకు లాభాలు కురిపిస్తున్న ఓ పంట గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పసుపు సాగు
సాధారణంగా రైతులు పత్తి, మొక్కజొన్న, మిరప పంటలను ఎక్కువగా వేస్తుంటారు. కానీ పంట మార్పిడి పద్ధతులను అవలంబించినప్పుడే రైతులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఒకే భూమిలో ఎప్పుడూ ఒకే పంట వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. నేలసారం తగ్గిపోతుంది. దానివల్ల పంట దిగుబడి కూడా పడిపోతుంది.
కాబట్టి అప్పుడప్పుడు పంటలు మార్చుకోవడమే కాదు.. డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలి. గత కొన్నేళ్లుగా పసుపు సాగు రైతులకు లాభాలు కురిపిస్తోందని అనేక నివేదికలు చెబుతున్నాయి. పసుపు సాగు చేయడం ద్వారా.. రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి పసుపు సాగు ఎందుకు లాభదాయకంగా మారిందో ఇక్కడ చూద్దాం.
అధిక డిమాండ్:
పసుపు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైంది. అంతేకాదు ఔషధాలతో పాటు బ్యూటీ ప్రోడక్టుల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. కాబట్టి పసుపు పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
అధిక దిగుబడి:
నిపుణుల ప్రకారం విత్తన పసుపు, ఎరువులు, కూలీలు, ఇతరాలు కలిపి పసుపు సాగుకు ఎకరాకు 50 నుంచి 80వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. 30 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
అధిక ధర:
మార్కెట్లో పసుపు ధర సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. గత కొన్నేళ్లుగా క్వింటాకు రూ. 10 వేల నుంచి 15 వేల మధ్యలో ధర పలుకుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నేల, నీటి వసతి ముఖ్యం
పసుపు సాగు చేసేటప్పుడు రైతులు కొన్ని విషయాలపై కచ్చితంగా శ్రద్ధ వహించాలి. నేల రకం, నీటి వసతి వంటి అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. బంకమట్టి నేల, నల్లరేగడి భూములు, నీరు ఇంకిపోయే నేలలు పసుపు సాగుకు అనువైనవి.
సరియైన వాతావరణం:
పసుపు పంటకు వెచ్చని, తేమతో కూడిన వాతావరణం అవసరం. ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత, వర్షపాతం.. పసుపు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. పసుపు పంటను ఏక పంటగా వేయచ్చు. అంతర పంటగా కూడా వేసుకోవచ్చు.
పెరుగుతున్న ఎగుమతులు:
భారతీయ పసుపు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతోంది. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో దాదాపు 80 శాతం వాటాతో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పసుపు పంటకు దేశీయంగా, అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్నందున రైతులకు మంచి ఆదాయం దక్కుతుంది.