Tax-Free: మీకు తెలియకుండానే ట్యాక్స్ కడుతున్నారా?
2026లో అమల్లో ఉన్న ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ప్రభుత్వం కొన్ని ఆదాయాలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తోంది. అయితే షరతులు, లిమిట్స్ పాటించకపోతే ఈ లాభం కోల్పోయే ప్రమాదం ఉంది. 2026లో ట్యాక్స్ ఫ్రీగా పరిగణించే 10 కీలక ఆదాయలేంటో తెలుసా?

2026లో పూర్తిగా పన్ను మినహాయింపు పొందే 10 ఆదాయాలు
ఆదాయపు పన్ను నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు అమలులో ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని ఆదాయ వర్గాలకు పూర్తిగా పన్ను మినహాయింపులు ఇచ్చింది. అయితే ఈ ప్రయోజనాలను పొందాలంటే నిర్దిష్ట షరతులు, లిమిట్స్ పాటించడం తప్పనిసరి. అనేకమంది పన్ను చెల్లింపుదారులు సరైన అవగాహన లేకపోవడం, నియమాలు మినహాయించిన పరిస్థితుల్లో కూడా ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ సహకారంతో 2026లో పూర్తిగా పన్ను మినహాయింపు అమలయ్యే 10 ప్రధానమైన ఆదాయాలేంటో, వాటికి సంబంధించిన షరతులేంటీ అన్నది పూర్తిగా తెలుసుకుందాం.
వ్యవసాయ ఆదాయంపై పన్ను నిబంధనలు
వ్యవసాయ ఆదాయం: పన్ను మినహాయింపుల్లో మొదటిది వ్యవసాయ ఆదాయం. వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందాలంటే ఈ షరతులు తప్పనిసరి. సాగు భూమి భారతదేశంలోనే ఉండాలి. అలాగే ఆదాయం కూడా వ్యవసాయ కార్యకలాపాల నుంచే రావాలి. పంటల సాగు, పంట ఉత్పత్తికి సంబంధించిన పనుల వరకు మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్, అత్యధిక ప్రాసెసింగ్ ద్వారా వచ్చే ఆదాయానికి ఈ మినహాయింపు వర్తించదు. మరో ముఖ్యమైన అంశం..వ్యవసాయ ఆదాయం పూర్తిగా పన్ను మినహాయింపులో ఉన్నప్పటికీ, అది అధికంగా ఉంటే ఇతర ఆదాయాలపై వర్తించే Tax Rateపై ప్రభావం పడుతుంది.
ఎల్ ఎల్ పీ ప్రాఫిట్: పార్టనర్ షిప్ లేదా LLP నుంచి వచ్చే లాభాలపై పన్ను విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. LLP తన లాభాలపై ఇప్పటికే ఆదాయపు పన్ను చెల్లించి ఉండాలి. అలా పన్ను చెల్లించిన లాభాల్లో నుంచి పార్ట్‌నర్‌కు వచ్చే లాభ వాటాపై మళ్లీ పన్ను విధించరు. పార్ట్‌నర్‌కు వచ్చే జీతం , వడ్డీ లేదా కమిషన్ మాత్రం పన్ను పరిధిలోకి వస్తాయి. పార్ట్‌నర్ వ్యక్తిగత ఆదాయంగా పరిగణించి పన్ను వసూలు చేస్తారు.
సేవింగ్స్ అకౌంట్: బ్యాంక్‌లో డబ్బు ఉంచితే వచ్చే వడ్డీ అంతా పన్ను మినహాయింపే అనుకోవడం చాలా మందిలో ఉన్న అపోహ. సేవింగ్స్ అకౌంట్‌పై వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. అది కూడా ఏడాదికి రూ.10వేల వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ సడలింపు బ్యాంకులు, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆ పరిమితి దాటితే పన్ను తప్పదు. ఇక FDలు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి అసలు పన్ను మినహాయింపే ఉండదు. ఈ విషయం చాలా మంది మర్చిపోతారు.
ఓపిక ఉంటే ట్యాక్స్ జీరో… లేదంటే ప్రయోజనం లేదు
పీపీఎఫ్: PPFని చాలామంది సాధారణ సేవింగ్స్ స్కీమ్‌లా చూస్తారు. కానీ నిజమేంటంటే ఇది పూర్తి క్రమశిక్షణ కోరే దీర్ఘకాలిక పొదుపు పథకం. ఎవరైనా ఖాతా తెరవచ్చు. ఏడాదికి కనీసం రూ.500 జమ చేయాలి. అదే సమయంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షలకే పరిమితి ఉంటుంది. కానీ డబ్బు ఇష్టమొచ్చినప్పుడు వేసి తీసుకునే వెసులుబాటు లేదు. 15 ఏళ్ల వరకూ ఉంచేందుకు సిద్ధంగా ఉంటేనే ఇందులో అడుగు పెట్టాలి. నియమాలు పాటిస్తే మాత్రం లాభం ఉంటుంది. వడ్డీపై పన్ను లేదు, మెచ్యూరిటీ మొత్తం మీద పన్ను లేదు. అందుకే PPFని ప్రభుత్వం EEE కేటగిరీలో ఉంచింది. క్రమశిక్షణ లేని వారికి ఇది పనికిరాదు. ఓపికుంటే మాత్రం PPF అనేది పన్ను నుంచి రక్షిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన: ఇది ఆడపిల్ల భవిష్యత్ కు సంబంధించింది. ఈ ఖాతా తప్పనిసరిగా ఆడపిల్ల పేరుమీదే తెరవాలి. ఖాతా తెరిచే సమయానికి అమ్మాయి వయసు 10 ఏళ్ల లోపే ఉండాలి. ఏడాదికి కనీసం రూ.250 జమ చేయాలి. అదే సమయంలో గరిష్ఠంగా రూ.1,50,000 లక్షలకే పరిమితి ఉంటుంది. డిపాజిట్లు ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 15 ఏళ్ల వరకే పరిమితి ఉంటుంది.
ఈ మూడు ఆదాయాల్లో చిన్న తప్పు చేసినా ట్యాక్స్ తప్పదు!
స్కాలర్‌షిప్: స్కాలర్‌షిప్ అంటే జీతం కాదు, విద్య కోసం ఇచ్చే సహాయం. అందుకే ప్రభుత్వం దీనిని ఆదాయంగా చూడదు. విద్యా ఖర్చుల కోసం అందే స్కాలర్‌షిప్ మొత్తంపై పన్ను ఉండదు. ఎంత మొత్తం వచ్చినా, అది చదువుకు సంబంధించినదైతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ డబ్బును వేరే అవసరాలకు మళ్లిస్తే చర్యలు తప్పవు.
VPF:వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది పేరులో ఉన్నట్టే స్వచ్ఛందం.జీతం నుంచి ఎంత వేయాలన్నది మీ ఇష్టం, కానీ నియమాలు మాత్రం EPFలాగే కఠినంగా ఉంటాయి. ఐదేళ్లు పూర్తి కాకముందు తీసుకుంటే ప్రయోజనం ఉండదు. 5 సంవత్సరాల తర్వాతే విత్‌డ్రా చేస్తే పన్ను మినహాయింపు ఉంటుంది. లిమిట్స్‌లో ఉంటేనే ఇది EEE కేటగిరీ వర్తిస్తుంది. లిమిట్ దాటితే టాక్స్ తప్పదు.
లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ: లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అంటే వచ్చేసరికి మొత్తం డబ్బు ట్యాక్స్ ఫ్రీ అనుకోవడం పెద్ద పొరపాటు. అది పాలసీ ఎలా తీసుకున్నారో, ఎంత ప్రీమియం చెల్లించారో అన్నదానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
నియమాలు పాటిస్తే పన్ను వర్తించదు. పాటించకపోతే మెచ్యూరిటీ మొత్తం కూడా ఆదాయంగా మారుతుంది. అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ట్యాక్స్ లాభం వస్తే అది బోనస్ మాత్రమే.
నియమాలు తెలుసుకుని ప్లాన్ చేసుకోండి
EPF: EPF అంటే ఉద్యోగం వదిలేసినప్పుడు డబ్బు వచ్చేస్తుంది అన్న భావన చాలామందిలో ఉంది. కానీ నిజం ఏమిటంటే ఐదేళ్ల క్రమశిక్షణ లేకపోతే EPF కూడా ట్యాక్స్ ఫ్రీ కాదు. ఉద్యోగం మారితే డబ్బు తీసేసే అలవాటు ఉంటే, పన్ను మినహాయింపు గురించి మాట్లాడే అర్హతే ఉండదు. కనీసం ఐదేళ్లు కొనసాగితేనే పన్ను ఉండదు. అన్ని షరతులు పాటించినప్పుడే EPFను EEE కేటగిరీగా పరిగణిస్తారు. లేకపోతే అది సేవింగ్స్ కాదు, ఆదాయంగా మారిపోతుంది.
గ్రాట్యుటీ: గ్రాట్యుటీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి గందరగోళం పెట్టలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపు. కానీ మిగతావారికి సడలింపు లేదు. ప్రైవేట్ లేదా ఇతర సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట పరిమితి వరకే ట్యాక్స్ ఫ్రీ. ఆ హద్దు దాటితే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.
సింపుల్‌గా చెప్పాలంటే ట్యాక్స్ ఫ్రీ అనేది అందరికీ కాదు. ప్రభుత్వం కొన్ని ఆదాయాలకు పన్ను మినహాయింపు ఇస్తుంది కానీ..అది నియమాలు పాటిస్తేనే వర్తిస్తుంది. ఒక లిమిట్ దాటినా, ఒక షరతు మిస్సైనా పన్ను కట్టాల్సి వస్తుంది. అందుకే ముందే నియమాలు తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే అనవసరంగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు.

