- Home
- Business
- వ్యాపారం చేసే వారికి ఈ వాహనం వరం లాంటిది.. డీజిల్ కొట్టించాలన్న టెన్షనే అవసరం లేదు
వ్యాపారం చేసే వారికి ఈ వాహనం వరం లాంటిది.. డీజిల్ కొట్టించాలన్న టెన్షనే అవసరం లేదు
Tata Intra EV: వ్యాపారం ప్రారంభించాలని భావించే వారికి, ముఖ్యంగా డెలివరీ లేదా సరుకుల రవాణా చేసే వారికి టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ పికప్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. టాటా ఇన్‌ట్రా ఈవీ పికప్ పేరుతో తీసుకొచ్చిన ఈ వెహికిల్ పూర్తి వివరాలు.

టాటా ఇన్‌ట్రా ఈవీ పికప్ ధర
టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ పికప్ ప్రారంభ ధర సుమారు రూ. 11.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సాధారణంగా ఆన్ రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సుమారుగా రూ. 11 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య ఉండొచ్చు. టాటా కమర్షియల్ వాహన డీలర్ల ద్వారా ఈ వాహనం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
వ్యాపారానికి ఉపయోగం
ఈ వాహనాన్ని ముఖ్యంగా లాస్ట్ మైల్ డెలివరీ కోసం రూపొందించారు. ఒకసారి లోడ్ చేస్తే గరిష్ఠంగా 1,750 కిలోల వరకు సరుకులు తీసుకెళ్లగలదు. దీని లోడ్ బాడీ పొడవు 10 అడుగులకుపైగా ఉంటుంది. అందువల్ల ఈ వాహనం ఈ కామర్స్ డెలివరీలు, FMCG సరుకుల పంపిణీ, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ వంటి పనులకు చాలా ఉపయోగపడుతుంది. చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
బ్యాటరీ, రేంజ్, పనితీరు
టాటా ఇన్‌ట్రా ఈవీ పికప్‌లో 72 kW ఎలక్ట్రిక్ మోటర్ ఉంటుంది. ఇది 230 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనానికి 28.2 kWh బ్యాటరీ అందించారు. ఈ బ్యాటరీకి IP67 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము, నీటి నుంచి రక్షణ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఈ వాహనం సుమారు 211 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. సరుకులు లోడ్ చేసి కూడా సుమారు 23 శాతం ఎత్తైన రోడ్లపై కూడా నడిచే సామర్థ్యం ఉంది.
ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు ఇతర ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ పికప్‌లో CCS2 ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కంపెనీ ప్రకారం 10% నుంచి 80% వరకు బ్యాటరీ చార్జ్ కావడానికి కేవలం 55 నిమిషాలు మాత్రమే పడుతుంది. బ్యాటరీపై 6 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. అదనంగా ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, మూడు స్థాయిల రీజెనరేటివ్ బ్రేకింగ్, పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, వాక్ త్రూ క్యాబిన్ డిజైన్ లాంటివి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 25,000 కంటే ఎక్కువ చార్జింగ్ పాయింట్లు, 200 కంటే ఎక్కువ EV సర్వీస్ సెంటర్లు కూడా టాటా అందుబాటులో ఉంచుతోంది.
నెలకు EMI ఎంత?
ఈ వాహనం ధరను సుమారుగా రూ.11,00,000గా తీసుకుంటే, సాధారణంగా బ్యాంకులు 10% డౌన్ పేమెంట్ తీసుకుంటాయి. అలా డౌన్ పేమెంట్ రూ. 1,10,000 పెట్టి వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. మిగతా రూ. 9,90,000 లోన్ తీసుకోవచ్చు. 10 శాతం వడ్డీ 5 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే నెలకు సుమారు రూ. 21,000 నుంచి రూ. 22,000 వరకు ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది.

