Starlink : ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఇక ఉచితం !
Starlink: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనిజులా ప్రజలకు సపోర్టుగా ఫిబ్రవరి 3 వరకు దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

వెనిజులాలో స్టార్‌లింక్ ఫ్రీ: మస్క్ సంచలన నిర్ణయం!
వెనిజులాలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ దేశ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశారు. వెనిజులా ప్రజలకు తమ కంపెనీ స్టార్‌లింక్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా సైనిక చర్యలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అయిన కొన్ని గంటలకే మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ సేవలు పరిమిత కాలం పాటు, అంటే ఫిబ్రవరి 3వ తేదీ వరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌లింక్ తెలిపింది. దేశంలో నెలకొన్న అనిశ్చితి సమయంలో ప్రజలకు నిరంతర కనెక్టివిటీని అందించడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది.
స్టార్‌లింక్ : మస్క్ ఏం చెప్పారంటే?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో స్టార్‌లింక్ చేసిన పోస్ట్‌ను ఎలాన్ మస్క్ రీట్వీట్ చేశారు. వెనిజులా ప్రజలకు సపోర్టుగా అని ఆయన రాసుకొచ్చారు. స్టార్‌లింక్ తన అధికారిక ప్రకటనలో "వచ్చే ఫిబ్రవరి 3 వరకు వెనిజులా ప్రజలకు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నాం. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఎలాంటి అంతరాయం కలగదు" అని స్పష్టం చేసింది.
స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. దీనికి మొబైల్ టవర్లు లేదా సంప్రదాయ కేబుల్స్ అవసరం లేదు. లో ఎర్త్ ఆర్బిట్ లో ఉన్న వేలాది చిన్న ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా ఇది పనిచేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో, మొబైల్ టవర్లు పనిచేయని పరిస్థితుల్లో కూడా స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. దీనికోసం వినియోగదారులు ఒక చిన్న డిష్ లేదా టెర్మినల్‌ను ఇంటి పైకప్పుపై లేదా బహిరంగ ప్రదేశంలో అమర్చుకోవాల్సి ఉంటుంది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్
జనవరి 3న అమెరికా చేపట్టిన ఆకస్మిక సైనిక చర్యలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లు అరెస్టయ్యారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికా అధికారులు విడుదల చేసిన వీడియోలో, మదురో చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
అరెస్ట్ సమయంలో మదురో అక్కడున్న రిపోర్టర్లకు, మాదకద్రవ్యాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏజెంట్లకు హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ నైట్ అని చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. మదురోను, ఆయన భార్యను కరాకస్ నుంచి హెలికాప్టర్‌లో కరేబియన్ సముద్రంలోని యూఎస్ఎస్ ఇవో జిమానౌకకు తరలించారు. మదురోపై మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు 2020 నుంచే ఉన్నాయి. అమెరికా పౌరుల భద్రత కోసమే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
వెనిజులాలో నాయకత్వ మార్పు
మదురో అరెస్ట్ తర్వాత ఏర్పడిన నాయకత్వ శూన్యాన్ని భర్తీ చేయడానికి వెనిజులా సుప్రీంకోర్టు తక్షణమే స్పందించింది. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగెజ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. మదురో తన విధులను నిర్వర్తించలేని స్థితిలో ఉన్నందున, రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షులే ఆ బాధ్యతలు చేపట్టాలని జస్టిస్ తానియా డి అమెలియో తీర్పును చదివి వినిపించారు.
దేశ పరిపాలనలో కొనసాగింపును, దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని రోడ్రిగెజ్‌కు అధ్యక్ష అధికారాలను కట్టబెట్టారు. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, వెనిజులాలో సురక్షితమైన అధికార బదిలీ జరిగే వరకు అమెరికానే ఆ దేశాన్ని నడిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్షురాలు రోడ్రిగెజ్ తమతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, అమెరికాకు కావాల్సిన సహాయం చేస్తామని ఆమె తెలిపినట్లు ట్రంప్ వెల్లడించారు.
మదురోపై మస్క్ ఆగ్రహం
నికోలస్ మదురోపై ఎలాన్ మస్క్ చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మదురో అరెస్ట్‌పై స్పందిస్తూ.. "కంగ్రాట్స్ ప్రెసిడెంట్ ట్రంప్! ఇది ప్రపంచానికి దక్కిన విజయం. దుర్మార్గపు నియంతలకు ఇదొక హెచ్చరిక" అని మస్క్ ట్వీట్ చేశారు. వెనిజులా ఒక క్రూరమైన నియంత చెర నుంచి విముక్తి పొందడాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
2024 ఎన్నికల సమయంలోనే మస్క్ మదురో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మదురోను జోకర్ అని సంబోధిస్తూ, వెనిజులాలో అధికార మార్పు జరగాలని పిలుపునిచ్చారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత, కోరినా మచాడోకు మస్క్ తన సపోర్టును ప్రకటించారు. వెనిజులాలో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, మదురో సోషలిస్టు విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని మస్క్ గతంలో వ్యాఖ్యానించారు.
అమెరికా ప్లాన్.. ఆయిల్ కోణం..
అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఈ వ్యవహారంపై సంచలన విషయాలు బయటపెట్టారు. ట్రంప్ తన మొదటి టర్మ్‌లోనే వెనిజులా ఆయిల్ నిల్వలపై ఆసక్తి చూపారని బోల్టన్ చెప్పారు. అప్పుడే మదురోను గద్దె దించే ప్లాన్ సిద్ధం చేసినా, ట్రంప్ దృష్టిని దానిపై నిలిపి ఉంచలేకపోయామని ఆయన సీఎన్‌ఎన్‌తో అన్నారు. కేవలం ఆర్థిక ఆంక్షల ద్వారానే మదురో పాలనను దెబ్బతీయవచ్చని అప్పట్లో భావించినట్లు ఆయన తెలిపారు.
తాజా పరిణామాల్లో భాగంగా, అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ఈ భారీ సైనిక చర్యకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వెనిజులాలో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించగా, మదురో అరెస్ట్‌ను ఆ దేశ ఉపాధ్యక్షురాలు సైనిక దురాక్రమణగా అభివర్ణించారు.

