గుడ్ న్యూస్.. బంగారం పైనే కాదు వెండి పై కూడా బ్యాంకు లోన్స్
RBI Silver Loans : బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటివరకు మీకు బంగారం పైనే బ్యాంకులు రుణాలు ఇచ్చేవి, ఇకపై వెండి పై కూడా రుణాలు పొందవచ్చు. ఈ లోన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

వెండిపై కూడా బ్యాంకుల్లో రుణాలు.. ఆర్బీఐ కీలక నిర్ణయం
మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). వెండిపై కూడా రుణాలు ఇవ్వనుంది. బంగారం మాదిరిగానే వెండి పై కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫైనాన్స్ కంపెనీలు వెండిని హామీ ఆస్తిగా స్వీకరించేందుకు నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.
ఆర్బీఐ జూన్‌లో విడుదల చేసిన Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025 ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ నియమాలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం వెండిని రుణం కోసం స్వీకరించడం లేదు. అయితే, ఆర్బీఐ కొత్త నిర్ణయాలతో బ్యాంకులు ఇప్పుడు వెండి పై కూడా రుణాలు ఇవ్వనున్నాయి.
రైతులకు, చిన్న కంపెనీలకు రుణాలు
వెండి రుణాలపై ఆర్బీఐ ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం వ్యవసాయం, MSME రంగాల్లో రూ.2లక్షల వరకు కలెక్టర్-ఫ్రీ రుణాలు పొందే అర్హత ఉన్నవారు స్వచ్ఛందంగా బంగారం లేదా వెండిని హామీగా పెట్టొచ్చు. ఈ విషయంలో బ్యాంకులు ఒత్తిడి చేయరాదని పేర్కొంది.
ఆర్బీఐ ప్రకారం.. “బ్యాంకుల ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా హామీగా పెట్టిన బంగారం, వెండిని స్వీకరించడం నిబంధనలకు వ్యతిరేకం కాదు” అని స్పష్టం చేసింది. డిసెంబర్ 2024లో రైతులకు కలెక్టర్-ఫ్రీ రుణ పరిమితిని రూ.1.6లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. జనవరి 1, 2025 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
వెండి పై ఎంతవరకు బ్యాంకుల్లో రుణాలు ఇస్తారు?
వెండిపై బ్యాంకుల్లో రుణ పరిమాణం ఆధారంగా Loan-to-Value (LTV) వివరాలను కూడా ఆర్బీఐ వెల్లడించింది. దాని ప్రకారం.. రూ.2.5లక్షల వరకు వెండి రుణం పై 85% వరకు ఇస్తారు. రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు 80%, రూ.5లక్షల పైగా వుంటే 75% వరకు రుణం ఇస్తారు. ఈ LTV నిష్పత్తి రుణ కాలమంతా అమల్లో ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది. ఒక వ్యక్తి గరిష్ఠంగా 10 కిలోల వెండి ఆభరణాలు లేదా నగలు హామీగా పెట్టి రుణాలు తీసుకోవచ్చు. నాణేల విషయంలో గరిష్ఠ పరిమితి 500 గ్రాములుగా పేర్కొన్నారు.
బులియన్‌కు రుణాలు లేవు
వెండి బార్స్, ETFs, మ్యూచువల్ ఫండ్స్‌కు రుణాలు ఇవ్వరు. నగలు, ఆభరణాలు, నాణేలకే రుణ అనుమతి వుంటుంది. ప్రాథమిక వెండి కొనుగోలుకు రుణం ఇవ్వరు. కానీ పరిశ్రమలు, తయారీ రంగానికి పనిచేసే పెట్టుబడుల కోసం వెండిని హామీగా పెట్టుకొని రుణం పొందొచ్చు. టైర్ 3, టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులూ ఈ రుణాలు ఇవ్వొచ్చు.
వెండి నిల్వ, వేలం, పారదర్శకతపై కఠిన నియంత్రణ
- తనిఖీ సమయంలో రుణగ్రహీత హాజరు తప్పనిసరి
- బంగారం లేదా వెండి విలువ, నికర బరువును రికార్డు చేయాలి
- రుణం తీరకపోతే వేలం నివేదిక, ప్రక్రియను ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనాలి
- నష్టం జరిగితే పరిహారం చెల్లించాలి
- రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత 7 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారు.
- ఆలస్యానికి రోజుకు రూ.5,000 పరిహారం కూడా ఉంది.
వెండి ధరలు పెరుగుదల నేపథ్యంలో కీలక మార్పులు
2025లో వెండి ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌లో కిలో వెండి ధర రూ.1.9లక్షలు దాటింది. దీంతో పెట్టుబడిదారులు, సంస్థలు వెండిని రుణ సూచికగా ఉపయోగించుకునే అవకాశముందా అనే సందేహాలకు ఆర్బీఐ తన కొత్త నిర్ణయాలతో స్వస్తి చెప్పింది.
ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, రిస్క్ నియంత్రణ, రుణగ్రహీతలకు ప్రయోజనం కలిగేలా రూపొందించినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 1, 2026 తర్వాత వెండిని ప్రధాన హామీ ఆస్తిగా భావించి రుణాలు ఇచ్చే వ్యవస్థ అమల్లోకి రానుంది.