- Home
- Business
- SBI Data Breach: ఎస్‌బీఐ డేటా లీక్.. డార్క్ వెబ్‌లో 3,897 మంది కస్టమర్ల వివరాలు.. రంగంలోకి ఎమర్జెన్సీ టీమ్స్
SBI Data Breach: ఎస్‌బీఐ డేటా లీక్.. డార్క్ వెబ్‌లో 3,897 మంది కస్టమర్ల వివరాలు.. రంగంలోకి ఎమర్జెన్సీ టీమ్స్
State Bank of India Data Breach: ఎస్‌బీఐ కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3,897 మంది వ్యక్తిగత వివరాల లీక్‌పై బ్యాంక్ విచారణ ప్రారంభించింది.

ఎస్‌బీఐ ఖాతాదారులకు బిగ్ షాక్.. డార్క్ వెబ్‌లోకి మీ పర్సనల్ డేటా?
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు సైబర్ ముప్పు పొంచి ఉందనే వార్త తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 3,897 మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బ్యాంక్ వెంటనే అలర్ట్ అయి పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. కస్టమర్ల సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
సైబర్ ఏజెన్సీల అలర్ట్‌తో రంగంలోకి ఎస్‌బీఐ
ఈ డేటా లీక్ వ్యవహారానికి సంబంధించి అక్టోబర్ 16న ఎస్‌బీఐకి ముఖ్యమైన హెచ్చరికలు వచ్చాయి. బ్యాంక్ త్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, అలాగే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి ఎస్‌బీఐకి సమాచారం అందింది. డార్క్ వెబ్‌లో ఎస్‌బీఐ కస్టమర్ల సమాచారం ఉందనే అలర్ట్ రావడంతో బ్యాంక్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
డార్క్ వెబ్‌లో లీక్ అయిన వివరాలేంటి?
డార్క్ వెబ్‌లో లభ్యమైన సుమారు 3,75,000 రికార్డులను ఎస్‌బీఐ ప్రాథమికంగా పరిశీలించింది. ఈ విశ్లేషణలో 3,897 మంది ఎస్‌బీఐ కస్టమర్లకు చెందిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కస్టమర్ల పేర్లు, జెండర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ ఐడీలు, నివాస చిరునామాలు ఉన్నాయి. వీటితో పాటు బ్రాంచ్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (CIF) ఐడెంటిఫైయర్లు, లీడ్ ఐడీలు, లోన్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన మెటాడేటా కూడా ఉన్నట్లు సమాచారం.
సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్.. స్వతంత్ర ఏజెన్సీ విచారణ
డేటా లీక్ వార్తలు రాగానే ఎస్‌బీఐ వెంటనే సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రోటోకాల్స్‌ను యాక్టివేట్ చేసింది. లీక్ ప్రభావం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి CERT-In జాబితాలో ఉన్న ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించింది. ఈ ఏజెన్సీ లీక్ అయిన డేటా నిజమైనదా కాదా, అసలు ఈ డేటా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, దీనివల్ల కస్టమర్లకు, బ్యాంక్‌కు ఎలాంటి ముప్పు ఉందనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. తగిన నివారణ చర్యలు కూడా వేగంగా అమలు చేస్తున్నారు.
బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి భంగం లేదు
ఈ అనుమానిత డేటా లీక్ వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలకు లేదా ఆర్థిక పనితీరుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఎస్‌బీఐ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల దాఖలు చేసిన రిపోర్టులో స్పష్టం చేసింది. బ్యాంక్ కోర్ బిజినెస్ నార్మల్‌గా పనిచేస్తోందని, కస్టమర్ల సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని పేర్కొంది. ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, దర్యాప్తు ముగిసేవరకు నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐ తెలిపింది.

