Jio Platforms IPO: జియో ఐపీఓపై ఎందుకింత క్రేజ్? అసలు కారణాలు ఏంటో తెలుసా?
Jio Platforms IPO: భారతదేశంలోనే అతిపెద్ద రూ.30,213 కోట్ల జియో ఐపీఓ ప్రారంభంలోనే సంచలనం సృష్టిస్తోంది. కేవలం 100 ఉన్న షేర్ల కంటే ఎక్కువ బిడ్లు వచ్చాయి. మార్కెట్ విశ్లేషణల ప్రకారం ఈ ఐపీఓకు ఉన్న విపరీతమైన డిమాండ్‌కు ప్రధాన 5 కారణాలు ఏంటో తెలుసుకుందాం.

జియో ఐపీఓ: అసలు ఇన్వెస్టర్ల నమ్మకానికి అసలు కారణం ఏంటి?
దేశంలోనే తిరుగులేని టెలికాం ఆధిపత్యం సాగిస్తోంది జియో. జియో ఐపీఓ పై ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపించడానికి మొదటి కారణం దాని బలమైన కస్టమర్ బేస్. దాదాపు 52.4 కోట్ల మంది చందాదారులతో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా జియో నిలిచింది.
దేశవ్యాప్తంగా వ్యాపించిన మొబైల్ డేటా ట్రాఫిక్‌లో సుమారు 60% భాగం జియో నెట్‌వర్క్ గుండానే వెళుతోంది. నష్టాల్లో ఉన్న స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి భయపడే ఇన్వెస్టర్లకు, ఇప్పటికే మార్కెట్ లీడర్‌గా ఉండి స్థిరమైన క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీ లభించడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది.
మెరుగైన ఆపరేటింగ్ మార్జిన్లు, భారీ లాభాలు
జియో ప్లాట్‌ఫామ్స్ కేవలం కస్టమర్ల సంఖ్యలోనే కాదు, ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంది. రిపోర్టుల ప్రకారం ఆర్థిక సంవత్సరం FY26 నాటికి కంపెనీ రూ.1,46,885 కోట్ల ఆదాయం, రూ.30,049 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కంపెనీ ఎబిట్డా మార్జిన్ 51.9% పైన కొనసాగుతోంది. అంటే ప్రతీ 100 రూపాయల ఆదాయంలో సగానికి పైగా నిర్వహణ లాభంగా మిగులుతోంది. ఈ విధమైన లాభదాయకత భారతీయ కార్పొరేట్ రంగంలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
యాంకర్ బుక్ దెబ్బకు పెరిగిన విశ్వాసం
ఐపీఓ సాధారణ ప్రజలకు తెరుచుకోవడానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల విభాగానికి వచ్చిన రెస్పాన్స్ మార్కెట్ మైండ్ సెట్‌ను మార్చేసింది. రూ.8,110 కోట్ల విలువైన యాంకర్ షేర్ల కోసం అంతర్జాతీయ, దేశీయ ఇన్వెస్టర్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు పైగా డిమాండ్ నమోదైంది. అంటే లభ్యమైన షేర్ల కంటే దాదాపు 30 రెట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. గ్లోబల్ సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ చూపించిన ఈ ఆసక్తి, సాధారణ ఇన్వెస్టర్లకు ఐపీఓ విశ్వసనీయతపై పూర్తి నమ్మకాన్ని ఇచ్చింది.
అప్పుల భారం తగ్గింపు.. క్లీన్ బ్యాలెన్స్ షీట్
ఐపీఓ ద్వారా సమీకరించే మొత్తం రూ.30,213 కోట్లలో రూ.27,500 కోట్లను తన టెలికాం అనుబంధ సంస్థ 'రిలయన్స్ జియో ఇన్ఫోకామ్' రుణాలను చెల్లించడానికి ఉపయోగించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 4G, 5G నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల కోసం చేసిన భారీ వ్యయాల వల్ల పేరుకుపోయిన అప్పులను ఈ డబ్బుతో తీర్చనున్నారు. అప్పు తగ్గడం వల్ల భవిష్యత్తులో వడ్డీ ఖర్చులు తగ్గి, నికర లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవ్వడం అనేది ఇన్వెస్టర్లను ఆకట్టుకునే మరో ప్రధాన అంశం.
కేవలం టెలికాం కాదు.. డిజిటల్, ఏఐ ఎకోసిస్టమ్ ప్లాన్స్
జియోను ఇన్వెస్టర్లు కేవలం ఒక ఫోన్/డేటా కంపెనీగా చూడటం లేదు. దీని కింద బ్రాడ్‌బ్యాండ్, క్లౌడ్ సర్వీసెస్, డిజిటల్ యాప్‌లు, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, ఏఐ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి యూజర్ నుండి వచ్చే సగటు ఆదాయం పెంచేందుకు, 5G ప్రీమియం ప్లాన్లు, ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఇప్పటికే ఇందులో వాటాదారులుగా ఉండటం కంపెనీ భవిష్యత్ డిజిటల్ సామర్థ్యానికి నిదర్శనం.

