Rent vs EMI: అద్దె చెల్లించడమా? EMI కట్టడమా.? రెండింటిలో ఏది బెటర్.?
Rent vs EMI: సొంతిల్లు ప్రతీ ఒక్కరి కల. ఇందుకోసం జీవితమంతా ఓ పోరాటమే చేస్తుంటారు. అయితే ఇల్లు కొనుగోలు విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఉండే సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పటికీ జరిగే చర్చ
వంశపారపర్యంగా వచ్చిన ఆదాయం ఉంటే, లేదా ఏదైనా ల్యాండ్ ఉంటే వాటితో ఇంటిని కొనుగోలు చేయడం పెద్ద సమస్య కాదు. కానీ కేవలం జీతంపై ఆధారపడి ఇంటిని కొనుగోలు చేయడం సాహసోపేత చర్య అని చెప్పడంలో సందేహం లేదు. ఇల్లు కొనుగోలు చేసి EMI కట్టడం, లేక అద్దెకి ఉండటం అనే విషయంపై ఎప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకవైపు, “ప్రతి నెల అద్దె కట్టడానికి బదులు EMI కడితే.. చివరికి ఇల్లు మీ సొంతమవుతుంది.” అనే వాదన ఉంది. కానీ, మరోవైపు, “ఒకవేళ మీరు ఉద్యోగం కోల్పోతే లేదా ఆదాయం తగ్గితే EMI భారంగా మారుతుంది” అనే వాదనను కూడా ఉండనే ఉంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, EMI, పన్ను, భవిష్యత్తు ఖర్చులు, రుణ వడ్డీ, ఇంటి ధర పెరుగుదల వంటి అంశాలు లెక్కలోకి తీసుకోవాలి. అద్దె విషయానికొస్తే.. ప్రతి సంవత్సరం అద్దె పెరుగుతుంది, కానీ EMI స్థిరంగా ఉంటుంది. అయితే, ఉద్యోగం లేకపోతే EMI కట్టడం సవాలుగా మారుతుంది.
ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి.?
ఉదాహరణకు రూ. లక్ష జీతం వచ్చే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ. 60 లక్షలతో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. దీనికి అతను నెలకు సుమారు రూ. 60 వేల ఈఎమ్ఐ చెల్లిస్తూ వచ్చాడు. ఉన్నట్లుండి ఉద్యోగం కోల్పోయాడు దీంతో అతనికి ఈఎమ్ఐ చెల్లించడం భారంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఈఎమ్ఐ కంటే అద్దెకు ఉండడమే మంచిదనే భావన వస్తుంది. రూ. 60 వేలతో పోల్చితే ఉద్యోగం పోయినా రూ. 20 వేల అద్దె ఇంట్లో ఉండొచ్చు.
EMI, అద్దె: లాభాలు, నష్టాలు
అద్దె కట్టడం:
* చిన్న వేతన ఉద్యోగులకు తక్షణ ఆర్థిక భారం తక్కువగా ఉంటుంది.
* జీతం కోల్పోయినా, పెద్ద రుణ బాధ ఉండదు.
* లొకేషన్ మార్పు సులభం, అవసరానికి అనుగుణంగా చిన్న లేదా పెద్ద అద్దె ఇంటికి వెళ్లవచ్చు.
* కానీ, ప్రతి నెల అద్దె పెరుగుతుంది. ప్రతీ నెల మీ జేబులో నుంచ, చివరకు డబ్బు వెళ్ళిపోతుంది, ఇల్లు మీ సొంతం కాదు.
EMI కట్టడం:
* ప్రతీ నెల ఈఎమ్ఐ చెల్లిస్తూ వెళ్తే చివరికి ఇల్లు మీ సొంతమవుతుంది.
* EMI స్థిరంగా ఉంటుంది. మీ జీతంలో పెరుగుదల కనిపిస్తుంది కానీ ఈఎమ్ఐ మాత్రం అలాగే ఉంటుంది.
* రియల్ ఎస్టేట్ విలువ పెరిగితే, ఇల్లు పెట్టుబడిగా మారుతుంది. రీసేల్‌లో భారీగా లాభం పొందొచ్చు.
* అయితే ఉద్యోగం లేదా ఆదాయం నిలకడగా లేకపోతే EMI పెద్ద బరువుగా మారుతుంది.
ఉద్యోగి కోణంలో చూస్తే.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం పూర్తిగా వ్యక్తిగత పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఐటీ ఉద్యోగి జాబ్ సెక్యూరిటీ ఉన్న కంపెనీలో పని చేస్తే ఈఎమ్ఐ కట్టడం సులభం. కానీ స్టార్టప్ లేదా సెక్యూరిటీ లేని ఉద్యోగంలో పనిచేస్తే అద్దెకు ఉండడమే మంచిది.
ఆర్థికంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి.?
ఇంటి కలను సొంతం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ క్రమంలో ఆర్థిక ఊబిలోకి చిక్కుకోకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. లోన్ తీసుకునే ముందే మీ ఆర్థిక పరిస్థతి ఎలా ఉందో బేరీజు వేసుకోవాలి. కనీసం ఆరు నెలల ఈఎమ్ఐకి సరపడే అమౌంట్ మీ సేవింగ్స్ ఖాతాలో ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఖర్చులు, పిల్లల విద్య, ఆహార, ఆరోగ్యం ఖర్చులు EMI నుంచి వేరుగా ప్లాన్ చేయాలి. రిజర్వ్ ఫండ్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నపలంగా ఉద్యోగం కోల్పోయినా ఈఎమ్ఐ చెల్లించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి.
ఈఎమ్ఐ చెల్లించడంలో ఇబ్బంది ఉంటే ఏం చేయాలి.?
ఒకవేళ మీకు ఈఎమ్ఐ చెల్లించడంలో ఇబ్బందులు ఉంటే మీరు అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అవ్వొచ్చు. మీ సొంతింటిని ఎక్కువ అద్దెకు ఇచ్చి, మీరు తక్కువ అద్దె ఉన్న ఇంట్లోకి మూవ్ అవ్వొచ్చు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల పాటు మీ ఈఎమ్ఐ సమస్య తీరుతుంది. EMI, అద్దె కంటే తక్కువ ఉంటే, ఇల్లు కొనడం ఆర్థికంగా కొంత లాభదాయకంగా చెప్పొచ్చు. EMIs కోసం ప్రాథమిక ఫండ్ లేకపోతే, అద్దె మంచిది.
ఈ విషయాలు కూడా గుర్తుంచుకోవాలి.
భవిష్యత్తు అవసరాలు: పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్యం, రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నీ ప్లాన్ చేయాలి.
లాంగ్ టర్మ్ ప్లాన్: ఇల్లు కొనడం ఒక పెట్టుబడి. ఫ్లాట్ విలువ పెరగడం, రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా ఉండడం వంటి అంశాలు చూసుకోవాలి.
ఒక ఉద్యోగి కోణంలో అద్దె EMI రెండింటినీ బలాలు, బలహీనతలు పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం అవసరం.