మే 31 లోపు మీ అకౌంట్‌లో రూ.436 లేకపోతే ఈ పాలసీ క్యాన్సిల్ అవుతుంది
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ బీమా పథకంలో సభ్యులు మే 31 లోపు వారి అకౌంట్ లో రూ.436 ఉంచుకోవాలి. అలా చేయకపోతే పాలసీ రద్దు అవుతుందని అధికారులు ప్రకటించారు. ఆ బీమా పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో సభ్యులుగా ఉన్న ఖాతాదారులు తమ పాలసీని కొనసాగించాలంటే మే 31, 2025లోపు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలో కనీసం రూ.436 ఉండేలా చూసుకోవాలి. ఈ మొత్తం ఆటో డెబిట్ విధానంలో ఖాతా నుండి కట్ అవుతుంది. మే 31 లోపు ఈ అమౌంట్ మెయింటెయిన్ చేయని వారి పాలసీ రద్దు అవుతుందని అధికారులు ప్రకటించారు.
18 ఏళ్లు దాటిన వారికి ఈ పాలసీ
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2015లో ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ఆధారిత జీవిత బీమా పథకం. ఈ పథకం కింద 18 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వ్యక్తులు సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. ఏ కారణంతోనైనా వారు మరణించినప్పుడు రూ.2 లక్షల బీమా నగదు పొందవచ్చు. ఈ పాలసీ ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు అమలులో ఉంటుంది.
ఆటో డెబిట్ అవుతుంది
ఈ పాలసీని తీసుకున్న సభ్యులు పాలసీని కొనసాగించాలంటే మే 25 నుండి మే 31 మధ్యలో ఖాతాలో రూ.436 ఉంచుకోవాలి. ఈ మొత్తం ఆటో డెబిట్ ద్వారా ఖాతా నుండి తీసుకుంటారు. అందువల్ల పాలసీని కొనసాగించాలనుకునే వారు ఈ తేదీల్లో వారి అకౌంట్స్ లో అవసరమైన మొత్తాన్ని ఉంచాలి.
పాలసీ రద్దయితే తిరిగి ప్రారంభించడం ఇబ్బందే..
పాలసీ రద్దు కాకుండా ఉండాలంటే ఖాతాదారులు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేయకపోతే పాలసీ రద్దు అవుతుంది. ఒకవేళ పాలసీ రద్దు అయితే తిరిగి చేరడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే అధికారులకు మెడికల్ సర్టిఫికేట్, ఆధార్, బ్యాంకు పాస్ బుక్ లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
బీమా నగదు రూ.2 లక్షలు
ఈ పథకంలో చేరిన పాలసీదారులు అనుకోకుండా మరణిస్తే వారి నామినీకి రూ.2 లక్షల బీమా సొమ్ము ఇస్తారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవిత బీమా సౌకర్యం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తోంది.
ఖాతాదారులు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. పాలసీని కొనసాగించాలంటే, మే 31లోపు ఖాతాలో రూ.436 ఉండేలా చూసుకోవాలి.