- Home
- Business
- Money: చెట్లకు డబ్బులు కాస్తాయో లేదో కానీ.. ఇలా చేస్తే డబ్బులకు, డబ్బులు కాయడం మాత్రం ఖాయం
Money: చెట్లకు డబ్బులు కాస్తాయో లేదో కానీ.. ఇలా చేస్తే డబ్బులకు, డబ్బులు కాయడం మాత్రం ఖాయం
Money: ‘ఏమైనా చెట్లకు డబ్బులు కాస్తున్నాయా’.? ఇది మనం చాలా సార్లు వినే ఉంటాం. అయితే చెట్లకు డబ్బులు ఖాయవని తెలిసిందే. కానీ మంచి పొదుపు పథకాలను సెలక్ట్ చేసుకుంటే డబ్బులకు డబ్బులు కాయడం మాత్రం ఖాయం. అలాంటి వాటిలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం అంటే ఏమిటి?
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అనేది ఒక రకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. పెట్టుబడిదారు ఒక నిర్దిష్ట కాలానికి ఒకసారి డబ్బు జమ చేస్తారు. ఆ కాలం పూర్తయ్యే సరికి వడ్డీతో పాటు మొత్తం డబ్బు తిరిగి లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ భరోసా, స్థిరమైన వడ్డీ రేట్లు, చిన్న మొత్తంతో కూడా ప్రారంభించే అవకాశం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా అందుబాటులో ఉండడం వంటివి ఈ పథకం ప్రత్యేకతగా చెప్పొచ్చు. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే వారికి ఈ పథకం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేట్లు
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయి. ప్రభుత్వం ప్రకటించిన తాజా రేట్ల ప్రకారం 1 సంవత్సరం డిపాజిట్ చేస్తే 6.9 శాతం వడ్డీ పొందొచ్చు. అదే రెండేళ్లకు డిపాజిట్ చేస్తే 7.0 శాతం వడ్డీ, 3 సంవత్సరాలకు 7.1 శాతం వడ్డీ, అదే ఐదేళ్లకు అయితే గరిష్ఠంగా 7.5 శాతం వడ్డీ పొందొచ్చు. 5 ఏళ్లకు ఎక్కువ వడ్డీ లభిస్తుండడంతో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టేవారికి మంచి రాబడి దక్కే అవకాశం ఉంటుంది.
రూ.5 లక్షలు పెట్టితే ఎంత రిటర్న్ వస్తుందంటే.?
ఒక పెట్టుబడిదారు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 సంవత్సరాల కాలాన్ని సెలక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తుంది కాబట్టి ఈ లెక్క ప్రకారం మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ. 5 లక్షలకు 5 ఏళ్ల తర్వాత మీ చేతికి రూ. 7,24,974 వస్తాయి. అంటే 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ. 2.3 లక్షలు వస్తాయన్నమాట.
బ్యాంక్ FDలతో పోలిస్తే..
ప్రస్తుతం చాలా బ్యాంకులు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఇది 6.5 నుంచి 7 శాతం మధ్యలోనే ఉంటుంది. కానీ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కారణాల వల్ల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే పెట్టుబడిదారులు పోస్టాఫీస్ పథకాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
ఈ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది.?
రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల్లో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉన్నా వాటిలో రిస్క్ కూడా ఉంటుంది. కానీ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టేవారికి స్థిరమైన వడ్డీతో భద్రమైన రాబడి లభిస్తుంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, స్థిరమైన ఆదాయం కోరుకునేవారు, రిస్క్ తీసుకోవాలనుకోని పెట్టుబడిదారులకు ఈ పథకం ఒక సురక్షిత పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న విషయాలను ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.

