Minimum Balance: మీకు తెలుసా.? ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉండాలనే విషయం తెలిసిందే. సరిపడ నిల్వ లేకపోతే బ్యాంకులు పెనాల్టీలు వేస్తుంటాయి. అయితే కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు ఊతమిచ్చేలా మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేశాయి. ఇంతకీ ఆ బ్యాంకులు ఏంటంటే.?

బ్యాంక్ ఆఫ్ బరోడా
ఈ బ్యాంకు ఖాతాదారులు ఇకపై కనీస నిల్వల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. అన్ని సేవింగ్స్ ఖాతాలకూ ఈ ప్రయోజనం వర్తించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 2న ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
కెనరా బ్యాంక్
ఈ ఏడాది మే నెలలోనే కెనరా బ్యాంక్ ఈ విషయంలో ముందడుగు వేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్నారైలు, వృద్ధులు ఇలా అందరికీ మినిమమ్ బ్యాలెన్స్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది.
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ కూడా జూలై 7వ తేదీ నుంచి మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది సేవింగ్స్ ఖాతాదారులందరికీ వర్తించనుంది. దీంతో మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన పనిలేదు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పీఎన్‌బీ తాము అందించే అన్ని సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. మహిళలు, రైతులు, సామాన్య ఆదాయ వర్గాల కుటుంబాల కోసం ఈ రాయితీను ప్రకటించినట్టు బ్యాంకు ఎండీ అశోక్ చంద్ర వెల్లడించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చాలా కాలం క్రితమే మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది. 2020 నుంచే ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాదారులపై ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఫీజులు వర్తించట్లేదు.