Hyderabad: అప్పు చేసి భూమి కొనడం లాభమా.. నష్టమా? క్లారిటీ ఇదిగో..!
పల్లెటూరు, సిటీ అనే తేడా లేకుండా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. డబ్బులున్నవారు ఎప్పుడైనా, ఎక్కడైనా భూమి కొనగలరు. కానీ పేద, మధ్య తరగతి వాళ్ల పరిస్థితి ఏంటీ? వారు అప్పుచేసి భూమి కొనచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

అప్పు చేసి భూమి కొనడం లాభమా.. నష్టమా..
భూమి ఆర్థిక భద్రతనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది భూమిపై పెట్టుబడులు పెడుతుంటారు. భూమి మీద పెట్టుబడి పెట్టినవాడు ఎప్పుడూ నష్టపోడని పెద్దలు ఊరికే అనలేదు. ఒకప్పుడు వేలు, లక్షలు పెట్టి కొన్న భూములు.. ఇప్పుడు కోట్లట్లో పలికే పరిస్థితి వచ్చింది. ఇక హైదరాబాద్ చుట్టు పక్కల అయితే మాటల్లో చెప్పలేము.
హైదరాబాద్ లో సొంత ఇల్లుంటే చాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. డబ్బులున్న వాళ్ల సంగతి పక్కన పెడితే పేద, మధ్యతరగతి వారు.. అమాంతం పెరిగిన భూముల ధరలతో అటువైపు తొంగిచూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
నిపుణుల ప్రకారం సిటీల్లోనే కాదు.. పల్లెటూర్లలోనూ రాబోయే రోజుల్లో భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు సొంతింటి కలను ఎలా నెరవేర్చుకోవాలి. ఉన్న కాస్తో కూస్తో డబ్బులకు తోడుగా.. కొంత అప్పు చేసి భూమి కొనచ్చా? దానివల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పు చేసి భూమి కొనడం వల్ల కలిగే లాభాలు!
నిపుణుల ప్రకారం.. భవిష్యత్తులో భూముల విలువ బాగా పెరుగుతుంది. మంచి ప్రదేశంలో భూమిని కొంటే.. కొద్ది సంవత్సరాల్లోనే ఆ భూమి విలువ రెట్టింపు అవుతుంది. మీ సంపాదన ఆధారంగా అప్పు నెమ్మదిగా తీర్చుకోవచ్చు. ఒకవేళ తీర్చుకోలేకపోయినా.. కొన్న భూమిని తిరిగి అమ్మినప్పుడు లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.
నిజానికి భూమి భద్రతతో కూడుకున్న పెట్టుబడి. స్టాక్ మార్కెట్, బిజినెస్‌లతో పోలిస్తే భూమి మీద పెట్టుబడి ఎక్కువగా ప్రమాద రహితమని నిపుణులు చెబుతున్నారు.
అప్పు తీసుకొని కొన్నా సరే.. మీ పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి అది మీ ఆస్తిగా మారుతుంది.
అప్పు చేసి భూమి కొనడం వల్ల కలిగే నష్టాలు!
నిపుణుల ప్రకారం అప్పు చేసి భూమి కొనడ వల్ల కొన్ని నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బ్యాంక్ లోన్ పై వడ్డీలు ఎక్కువగా ఉంటే.. మీరు నష్టపోవాల్సి వస్తుంది. భూమి విలువ కంటే అప్పే ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది.
అంతేకాదు మీరు కొనుగోలు చేసిన భూమి నుంచి రెంటల్ ఇన్‌కమ్ లేదా సాగు లాభం వచ్చే అవకాశం లేకపోతే.. లోన్ చెల్లించడం కష్టం అవుతుంది. ఇటు భూమి ఖాళీగా ఉంటుంది. మరోవైపు వడ్డీ భారం పెరుగుతుంది.
ఫైనల్ గా..
నిపుణుల ప్రకారం అప్పు తీసుకుని భూమి కొనడం లాభదాయకమే. కానీ ఆర్థిక స్థితిని, భవిష్యత్ విలువను, వడ్డీ రేట్లను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆస్తి విషయంలో తొందరపాటు మంచిది కాదు. మీకు అందుబాటు ధరల్లో భూమి కొనే అవకాశం వస్తే.. మీ దగ్గర కొంత మొత్తం ఉంటే.. మిగతా దానికోసం తక్కువ వడ్డీ ఉన్న లోన్ మాత్రమే తీసుకోండి. భవిష్యత్ లో అభివృద్ధి చెందుతుంది అనుకున్న ప్రాంతంలో భూమి కొనడం మంచిది. లాంగ్ టర్మ్ ప్లాన్‌తో భూమి కొనడం ద్వారా లాభాలు పొందవచ్చు.
ఇది గుర్తుంచుకోండి!
ఈ సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు పలువురు నిపుణుల సూచనల ఆధారంగా అందించింది మాత్రమే. భూమి కొనేముందు ఆ రంగంలో నిపుణుల నుంచి నేరుగా సలహా తీసుకోవడం మంచిది.