Indian Railway: ఇకపై రైళ్లలో లగేజ్‌కి ఛార్జీలు.. కీలక ప్రకటన చేసిన రైల్వే మంత్రి
Indian Railway: విమానాశ్రయాల్లో లగేజీ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇకపై ఈ నిబంధనలు రైల్వేలో కూడా అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా తెలిపారు.

రైలు ప్రయాణికులకు లగేజీపై రైల్వే కఠిన నిబంధనలు
రైలులో ప్రయాణించే వారు నిర్ణీత పరిమితికి మించి సామాను తీసుకువస్తే ఇక తప్పనిసరిగా అదనపు చార్జీలు చెల్లించాల్సిందేనని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయాల్లో ఉన్నట్టే రైల్వేలో కూడా లగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.
క్లాస్‌ను బట్టి ఉచిత లగేజీ పరిమితి
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణించే కోచ్‌ను బట్టి ఉచితంగా తీసుకెళ్లే లగేజీ బరువు మారుతుంది.
* సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
* స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోల వరకు అనుమతి ఉంటుంది.
* ఏసీ 3 టైర్, చైర్ కార్‌లో కూడా 40 కిలోలే గరిష్ఠ ఉచిత పరిమితి.
* ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
* ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు అత్యధికంగా 70 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఉంది.
ఛార్జీలు చెల్లిస్తే గరిష్ఠంగా ఎంత వరకు?
ఉచిత పరిమితి దాటిన లగేజీకి రుసుము చెల్లిస్తే కొంత వరకు అనుమతిస్తారు. సెకండ్ క్లాస్‌లో 70 కిలోల వరకు, స్లీపర్ క్లాస్‌లో 80 కిలోల వరకు, ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్‌లో 100 కిలోల వరకు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 150 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లొచ్చు. ఈ గరిష్ఠ పరిమితిలో ఉచిత లగేజీ కూడా కలిపి లెక్కిస్తారని రైల్వే స్పష్టం చేసింది.
పరిమితి మించితే భారీ జరిమానా
నిర్ణీత పరిమితికి మించి లగేజీతో కోచ్‌లోకి వెళ్తే రైల్వే చట్టం ప్రకారం అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. తనిఖీల్లో అదనపు లగేజీ బయటపడితే, సాధారణ పార్శిల్ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ముందుగా బుక్ చేసుకోకుండా నేరుగా కోచ్‌లోకి తీసుకువెళ్లడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
లగేజీ పరిమాణంపై కూడా ఆంక్షలు
బరువుతో పాటు లగేజీ పరిమాణంపైనా రైల్వే స్పష్టమైన నిబంధనలు పెట్టింది. ట్రంక్, సూట్‌కేస్, బాక్స్ లాంటి వాటి పరిమాణం 100 సెం.మీ × 60 సెం.మీ × 25 సెం.మీ లోపు ఉండాలి. ఈ కొలతలు మించిన లగేజీని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతించరు. అటువంటి వస్తువులను తప్పనిసరిగా బ్రేక్ వ్యాన్ లేదా పార్శిల్ వ్యాన్‌లో బుక్ చేయాలి.
ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సూచనలు
తమ వద్ద లగేజీ ఎక్కువగా ఉందని అనిపిస్తే, రైలు ఎక్కే ముందు స్టేషన్‌లో లగేజీ బుకింగ్ కౌంటర్ వద్ద నమోదు చేసుకోవడం ఉత్తమం. అలా చేస్తే జరిమానాలు తప్పుతాయి. ప్రయాణంలో అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ముందే బ్యాగుల బరువు కొలిచి చూసుకోవాలని రైల్వే మంత్రి సూచించారు. నిబంధనలు పాటిస్తే రైలు ప్రయాణం సురక్షితంగా, సులభంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

