YouTube : యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించవచ్చు ! ఈ 5 టిప్స్ పాటిస్తే సక్సెస్ పక్కా !
YouTube Monetization Tips and Tricks: యూట్యూబ్‌లో కెరీర్ మొదలుపెట్టాలనుకుంటున్నారా? ఛానల్ మానిటైజ్ కావడం లేదా? అయితే, సక్సెస్ కావడానికి, డబ్బు సంపాదించడానికి పాటించాల్సిన నియమాలు, టిప్స్ మీకోసం.

షార్ట్స్ vs లాంగ్ వీడియోస్: యూట్యూబ్‌లో దేనివల్ల ఎక్కువ డబ్బు వస్తుంది?
ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ (YouTube) అనేది కేవలం వినోద సాధనంగా మాత్రమే కాకుండా, ఆదాయ వనరుగా కూడా మారింది. యూట్యూబ్‌లో కెరీర్ మొదలుపెట్టాలని, తద్వారా మంచి గుర్తింపుతో పాటు డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే, అందరికీ ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.
కొందరు యూట్యూబర్లు తమ వీడియోల ద్వారా కోట్లలో సంపాదిస్తుంటే, మరికొందరు ఏళ్ల తరబడి కష్టపడుతున్నా కనీసం ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోతున్నారు. ఎంతో శ్రమించి వీడియోలు చేస్తున్నా, చాలా మంది ఛానెల్స్ కనీసం మానిటైజ్ కూడా కావడం లేదు. అసలు ఈ వ్యత్యాసం ఎందుకు ఉంది? సక్సెస్ అయిన వారికి తెలిసిన ఆ సీక్రెట్ ఏంటి?
యూట్యూబ్ ద్వారా చాలా మంది భారీగా ఆర్జిస్తున్నారు. వీరిని చూసి స్ఫూర్తి పొందిన సామాన్యులు కూడా ఉత్సాహంగా ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. కానీ, వీడియోలు అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాక, సబ్‌స్క్రైబర్లు పెరగక నిరాశ చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం మీ కంటెంట్ ఎంపిక, ఛానల్ నిర్వహణలో చేసే చిన్న చిన్న పొరపాట్లే. మీరు కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నా, లేదా ఇప్పటికే ఛానల్ ఉన్నా.. ఈ కింద పేర్కొన్న అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి..
YouTube Tips : సరైన టాపిక్ ఎంపిక
యూట్యూబ్‌లో సక్సెస్ కావడానికి అత్యంత ముఖ్యమైనది టాపిక్ సెలెక్షన్. మీకు ఏ కంటెంట్ చేయడం ఇష్టం అనే దానికంటే, ప్రేక్షకులు ప్రస్తుతం ఏది చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు అనేది చాలా ముఖ్యం.
మీరు ఎంచుకునే టాపిక్ ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉండాలి. అలాగే దానికి యాడ్ వాల్యూ ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు, మన దేశంలో టెక్నాలజీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి అంశాలకు సంబంధించిన వీడియోలపై ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మిగతా అంశాలతో పోలిస్తే ఈ కేటగిరీలలో యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ట్రెండింగ్, హై-వాల్యూ కంటెంట్‌పై దృష్టి పెట్టడం మంచిది.
YouTube Tips : మానిటైజేషన్ నిబంధనలు
ఛానల్ గ్రోత్ కోసం ఒకే నిష్‌లో కంటెంట్ చేయడం ముఖ్యం. ఒకే ఛానల్‌లో అనేక రకాల అంశాలను పోస్ట్ చేయడం వల్ల యూజర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఛానల్ గ్రోత్‌ను దెబ్బతీస్తుంది. ఇక మానిటైజేషన్ విషయానికి వస్తే, యూట్యూబ్ కొన్ని నిర్దిష్టమైన షరతులను విధించింది.
మీ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలంటే కనీసం 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. అలాగే, గత 12 నెలల్లో 3000 గంటల వాచ్ టైమ్ పూర్తి కావాలి. ఒకవేళ మీరు షార్ట్స్ వీడియోలు ఎక్కువగా చేస్తుంటే, గత 90 రోజుల్లో మీ షార్ట్స్ వీడియోలకు 30 లక్షల వ్యూస్ వచ్చి ఉండాలి. ఈ మైలురాళ్లను దాటితేనే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది.
YouTube Tips : లాంగ్ ఫార్మాట్ వీడియోల ప్రాముఖ్యత
కేవలం వ్యూస్ వస్తే డబ్బులు రావని గుర్తుంచుకోండి. మంచి ఆదాయం కోసం వాచ్ అవర్స్ చాలా కీలకం. అందుకే షార్ట్ వీడియోల కంటే లాంగ్ ఫార్మాట్ వీడియోలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
సాధారణంగా 6 నుంచి 10 నిమిషాల నిడివి గల వీడియోలు చేయడం వల్ల వాచ్ టైమ్ త్వరగా పెరుగుతుంది. యూట్యూబ్ ప్రధానంగా వాచ్ అవర్స్ ఆధారంగానే డబ్బులు చెల్లిస్తుంది, కేవలం వ్యూస్ ఆధారంగా కాదు. అయితే, షార్ట్స్ వీడియోలను పూర్తిగా పక్కన పెట్టకూడదు. కొత్తగా ఛానల్ రీచ్ పెరగడానికి, సబ్‌స్క్రైబర్లను వేగంగా పెంచుకోవడానికి షార్ట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ముఖ్యం.
YouTube Tips : థంబ్‌నెయిల్, టైటిల్ స్ట్రాటజీ
వీడియో లోపల కంటెంట్ ఎంత బాగున్నా, ఆ వీడియోపై క్లిక్ చేయించేది మాత్రం థంబ్‌నెయిల్. ప్రేక్షకులు మీ వీడియోను క్లిక్ చేసి, ఎక్కువ సేపు చూసేలా చేయడం మీ లక్ష్యం కావాలి.
థంబ్‌నెయిల్ డిజైన్ చేసేటప్పుడు అందులో టెక్స్ట్ తక్కువగా ఉండేలా చూసుకోండి. కేవలం 3 నుండి 4 పదాలు మాత్రమే వాడాలి. అక్షరాల కంటే ఎమోషన్ ఎక్కువగా కనిపించాలి. అలాగే టైటిల్ పెట్టడంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు, మీరు ఒక ఫోన్ గురించి వీడియో చేస్తే.. 'iPhone 15 Review' అని సింపుల్‌గా పెట్టడం కంటే, '80,000 పెట్టి ఐఫోన్ కొంటున్నారా.. ఈ తప్పు అస్సలు చేయకండి' అని పెడితే జనం ఎక్కువగా క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. క్యూరియాసిటీ పెంచేలా టైటిల్స్ ఉండాలి.
YouTube Tips : కన్సిస్టెన్సీ, ఎస్ఈవో
చాలా మందిలో ఉన్న ప్రధాన సమస్య నిలకడ లేకపోవడం. ఉత్సాహంగా ఒకటి రెండు వీడియోలు చేసి, ఆ తర్వాత గ్యాప్ ఇస్తుంటారు. యూట్యూబ్ అల్గారిథమ్ ప్రకారం కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం.
వారానికి కనీసం 2 నుండి 3 వీడియోలు అప్‌లోడ్ చేయాలి. అంతేకాదు, ప్రతిసారీ ఒకే సమయానికి వీడియోను పబ్లిష్ చేయడం అలవాటు చేసుకోవాలి. కొత్త ఛానల్‌ని యూట్యూబ్ మొదట టెస్ట్ చేస్తుంది, ఆ తర్వాతే పుష్ చేస్తుంది. కాబట్టి 60 నుండి 90 రోజుల పాటు క్రమం తప్పకుండా వీడియోలు అప్‌లోడ్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పై దృష్టి పెట్టాలి. టైటిల్, డిస్క్రిప్షన్‌లలో సరైన కీవర్డ్స్ వాడాలి. షార్ట్ వీడియోల కామెంట్ సెక్షన్‌లో మీ లాంగ్ వీడియో లింక్ ఇవ్వడం ద్వారా ట్రాఫిక్ పెంచుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే యూట్యూబ్ సక్సెస్‌కు ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు. సరైన ప్లానింగ్‌తో, 3 నుండి 6 నెలల పాటు కష్టపడితే మీ ఛానల్ కచ్చితంగా మానిటైజ్ అవుతుంది. డబ్బులు వస్తాయి.

