జీఎస్టీ 2.0: సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇకపై జీఎస్టీలో రెండే స్లాబ్‌లు
New Tax Slabs: సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు అమలు కానున్నాయి. 12%, 28% రేట్లు రద్దు చేసి 5%, 18% స్లాబ్‌లు తీసుకొచ్చారు. అయితే, లగ్జరీ వస్తువులపై ప్రత్యేక 40% రేటు అమలు కానుంది.

జీఎస్టీ 2.0: ఇకపై రెండే ప్రధాన స్లాబ్‌లు
భారత జీఎస్టీ వ్యవస్థలో ప్రధాన మార్పులు జరిగాయి. ఇకపై జీఎస్టీలో రెండు ప్రధాన స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. సెప్టెంబర్ 22 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు ప్రధాన స్లాబ్‌ల స్థానంలో ఇప్పుడు రెండు స్లాబ్‌లు ఉంటాయి. అవి 5%, 18%.
అయితే, ప్రత్యేక స్లాబ్ కింద లగ్జరీ వస్తువులపై 40% ఉండనుంది. ఢిల్లీ లో బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు.
GST 12%, 28% రేట్లు రద్దు
తాజా నిర్ణయం ప్రకారం 12%, 28% పన్ను రేట్లు రద్దు అయ్యాయి. వీటిలో ఉన్న 99% వస్తువులు 5% స్లాబ్‌లోకి, 90% వస్తువులు 18% స్లాబ్‌లోకి మార్చారు. అయితే మద్యం, గుట్కా, సిగరెట్లు, పాన్ మసాలా, జర్దా వంటి సిన్ ఉత్పత్తులు, లగ్జరీ వస్తువులు మాత్రం కొత్త 40% స్లాబ్ కింద పన్ను చెల్లించాలి. ఈ నిర్ణయం పూర్తిగా అమలు అయ్యే వరకు టొబాకో ఉత్పత్తులపై ఉన్న ప్రస్తుత పన్ను రేట్లు, కాంపెన్సేషన్ సెస్స్ అలాగే కొనసాగుతుంది.
GST కౌన్సిల్ సభ్యుల ఏమన్నారు?
పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా మాట్లాడుతూ, “ఇప్పటి నుంచి రెండింటితో పాటు మరో ప్రత్యేక జీఎస్టీ స్లాబ్ ఉంటుంది. 5%, 18% తో పాటు 40% ప్రత్యేక స్లాబ్. మేము కాంపెన్సేషన్ సెస్స్ పెంచాలని సూచించాం, కానీ కేంద్రం అంగీకరించలేదు” అని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేష్ ధర్మాని మాట్లాడుతూ, “అందరూ ఏకగ్రీవంగా స్లాబ్ రేషనలైజేషన్‌కి మద్దతు ఇచ్చారు. 12%, 28% స్లాబ్‌లు రద్దు అయ్యాయి. ఇప్పుడు లగ్జరీ వస్తువులకు 40% రేటు ఉంటుంది” అన్నారు.
సాధారణ ప్రజలకు లాభం: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఈ రేషనలైజేషన్ సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, రైతులు, మధ్య తరగతి ప్రజలకు ఈ మార్పులు ఉపయోగకరమని పేర్కొంది.
ప్రస్తుతం 12% రేటు ఉన్న వస్తువులు ఎక్కువగా 5% స్లాబ్‌లోకి వస్తాయి. 28% రేటులో ఉన్న వస్తువులు ప్రధానంగా 18% లోకి మారతాయి. దీంతో పన్ను భారం తగ్గి, సాధారణ అవసర వస్తువులు మరింత చౌకగా లభిస్తాయని కేంద్రం చెబుతోంది.
రాష్ట్రాల ఆందోళనలు
అయితే కొన్ని రాష్ట్రాలు పన్ను ఆదాయం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రులు ఢిల్లీలో సమావేశమై తమ ఆందోళనలు వ్యక్తం చేశారు. వారు కేంద్రం రాష్ట్రాలకు ఆదాయం రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ కేంద్ర ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, “జీఎస్టీ రేషనలైజేషన్ సాధారణ ప్రజలకు లాభదాయకం. కాబట్టి మేము ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాం” అన్నారు.

