Inspiring Story: అమ్మమ్మ జ్ఞాపకాలతో మొదలైన వ్యాపారం..ఇప్పుడు రూ.580 కోట్ల బ్రాండ్
Inspiring Story: అమ్మమ్మ, నాన్నమ్మ చేతి వంటలు తిన్న జ్ఞాపకాలు చాలా మందికి ఉంటాయి. కానీ అనే మెమోరీస్ ఇప్పుడు ఒక వ్యాపారానికి పునాది అయింది. రూ.580 కోట్ల విలువైన బ్రాండ్ గా ఎదిగింది.

స్వీట్ కారం కాఫీ (Sweet Karam Coffee) కథ
చిన్నప్పుడు అమ్మమ్మ, బామ్మ చేతి వంటలు తిన్న జ్ఞాపకాలు చాలామందికి ఉంటాయి. కానీ ఆ జ్ఞాపకాలే ఒక వ్యాపారానికి పునాది అయితే? దీపావళి పండుగ సమయంలో అమ్మమ్మ చేతి మురుకులు దొరక్కపోవడంతో మొదలైన ఓ ప్రయత్నం.. నేడు రూ.580 కోట్ల విలువైన సామ్రాజ్యంగా మారింది. అదే స్వీట్ కారం కాఫీ (Sweet Karam Coffee) కథ.
రూ.2,000 పెట్టుబడితో మొదలు
2015లో వర్షం కురుస్తున్న దీపావళి సమయంలో ఓ కుటుంబానికి అమ్మమ్మ జానకి పాటి (Janaki Paati) చేతితో చేసిన మురుకులు తినాలనిపించింది. బయట వెతికితే చిరుతిళ్లు మాత్రమే కనిపించాయి. కానీ ఇంటి రుచి, క్వాలిటీ లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో అమ్మమ్మ చేతి వంటకాలనే అందరికీ పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది.
అలా ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు.. శ్రీవత్సన్ సుందరరామన్, వీర రాఘవన్‌లతో కలిసి స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. కేవలం రూ.2,000 పెట్టుబడితో తమ ఇంట్లోని ఓ చిన్న గదిలో స్నాక్స్ తయారీ మొదలుపెట్టారు. తొలినాళ్లలో కస్టమర్లను సంపాదించుకోవడానికి న్యూస్ పేపర్స్ ద్వారా యాడ్స్ వేసేవారు. కుటుంబ సభ్యులే తయారీతో పాటు ఇంటింటికీ డెలివరీ చేసే బాధ్యతలను కూడా తీసుకున్నారు.
అమ్మమ్మ జ్ఞాపకాలే వ్యాపారానికి స్ఫూర్తి
ప్రతి దీపావళికి తమ అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, చిరుతిళ్లను ఎంతో చక్కగా తయారుచేసేవారని నళిని పార్థిబన్ గుర్తుచేసుకున్నారు. వంటలు చేస్తూనే మనవళ్లకు కథలు చెప్పేవారని, చిన్నచిన్న పనులు కూడా చేయించేవారని తెలిపారు. అమ్మమ్మతో కలిసి జాంగ్రీలు తయారుచేసిన ఆ జ్ఞాపకాలే ఉద్యోగాలను వదిలి సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రేరణనిచ్చాయని ఆమె వివరించారు.
ఇంటి వంటలకు పెరిగిన ఆదరణ
కరోనా మహమ్మారి తర్వాత ఆహార పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరగడంతో తమ ఉత్పత్తులకు డిమాండ్ రెండింతలైందని నళిని పేర్కొన్నారు. ఈ వ్యాపారం తమ కుటుంబానికే కాకుండా ఇంటి నుంచే వంటలు చేసే మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తోంది. స్వీట్ కారం కాఫీకి పెరిగిన ఆర్డర్లతో కొందరు మహిళలు తమ రోజువారీ ఉద్యోగాలను వదిలి, సిబ్బందితో కూడిన క్లౌడ్ కిచెన్లను సైతం ఏర్పాటు చేసుకున్నారని ఆమె వెల్లడించారు.
రూ.580 కోట్ల విలువైన బ్రాండ్‌గా..
ఒకప్పుడు కుటుంబ సభ్యుల కోసం అమ్మమ్మ తయారుచేసిన వంటకాలతో మొదలైన ఈ ప్రయాణం.. నేడు పెద్ద వ్యాపారంగా విస్తరించింది. ఈ బ్రాండ్ విలువ రూ.580 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది కస్టమర్లకు తమ ప్రొడక్ట్స్ అందించారు.
మైసూర్ పాక్, మురుకులు, మిక్చర్లు, అరటి చిప్స్, పొడులు, రైస్ మిక్స్‌లు, ఆంధ్రా ఆవకాయ, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ వంటి ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తోంది.
అమ్మమ్మ చేతి వంటల రుచి కోసం మొదలైన చిన్న ప్రయత్నం.. సంప్రదాయ ఆహారానికి ఉన్న ఆదరణతో పెద్ద బ్రాండ్‌గా మారింది. కుటుంబ జ్ఞాపకాలను వ్యాపార ఆలోచనగా మార్చుకుంటే, చిన్న ప్రయత్నం కూడా ఎంత దూరం ప్రయాణించగలదో స్వీట్ కారం కాఫీ ప్రయాణం చెబుతోంది.

