- Home
- Business
- Gold Silver Price: ఇవేం రేట్లు రా బాబు.. జనవరి 1న అలా, ఇప్పుడు ఇలా.. చూస్తే దిమ్మతిరగాల్సిందే !
Gold Silver Price: ఇవేం రేట్లు రా బాబు.. జనవరి 1న అలా, ఇప్పుడు ఇలా.. చూస్తే దిమ్మతిరగాల్సిందే !
Gold Silver Price: ఈ ఏడాది జనవరి 1 నుంచి 23 మధ్య బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం 23 రోజుల్లో వెండి కిలోకు రూ.91 వేలు, బంగారం రూ.22 వేలకు పైగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.

బంగారం కొనేవారికి చుక్కలు.. ఒక్క నెలలో రూ.22 వేలు పెరిగిన గోల్డ్ రేట్ !
ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పసిడి, వెండి ధరల తీరు చూస్తుంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు, దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండికి ఉన్న భారీ డిమాండ్ కారణంగా వీటి ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది.
కొత్త సంవత్సరం 2026 ప్రారంభమై ఇంకా ఒక నెల కూడా పూర్తి కాలేదు, కానీ ఈ కొద్ది రోజుల్లోనే బంగారం, వెండి ధరలు సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. జనవరి 1 నుండి 23 వరకు బంగారం ధరలో రూ.22 వేలకు పైగా పెరుగుదల కనిపించింది. అదే సమయంలో వెండి ధర ఏకంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వెండి పెరిగిన తీరు, ఆ గణాంకాలను చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటారు. కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి తమ పెరిగిన ధరలతో నిజంగానే సంచలనం సృష్టిస్తున్నాయి.
గత జనవరి 1 నుంచి 23 వెండి ధరలో రూ.90 వేలకు పైగా పెరుగుదల కనిపించింది. జనవరి 1, 23 తేదీల మధ్య బంగారం, వెండి ధరల వ్యత్యాసం ఎలా ఉందో, రేట్లు ఎంత పెరిగాయనే విషయాలు గమనిస్తే.. శనివారం కావడంతో మార్కెట్లకు సెలవు. ఇక 25న ఆదివారం కూడా ధరల్లో అప్‌డేట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేరుగా వచ్చే వారం అంటే సోమవారం కమోడిటీ మార్కెట్లో కొత్త ధరలు అప్‌డేట్ అవుతాయి. అప్పటి వరకు జనవరి 23 నాటికి నమోదైన అధికారిక గణాంకాలు ఉంటాయి.
జనవరి 1న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ముందుగా మనం కొత్త సంవత్సరం మొదటి రోజు, అంటే జనవరి 1 నాటి బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం. ఆ రోజున మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..
• 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,33,151 గా ఉంది.
• 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,21,966 గా నమోదైంది.
• 18 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 99,863 గా ఉంది.
• వెండి: జనవరి 1, 2026న ఒక కిలో వెండి ధర రూ. 2,27,900 గా ఉంది.
జనవరి 23 నాటికి కొండెక్కిన బంగారం, వెండి ధరలు
మూడు వారాల వ్యవధిలోనే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి 23 నాటికి బంగారం, వెండి ధరలు గమనిస్తే..
• 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,55,428 కి చేరింది.
• 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,42,372 కి పెరిగింది.
• 18 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,16,571 కి చేరింది.
• వెండి: ఇక కిలో వెండి ధర జనవరి 23 నాటికి ఏకంగా రూ. 3,18,960 కి చేరి సంచలనం సృష్టించింది.
జనవరి 1 నుంచి 23 వరకు బంగారం ఎంత పెరిగింది?
జనవరి 1 నుంచి జనవరి 23 మధ్య బంగారం ధరల్లో వచ్చిన వ్యత్యాసాన్ని పరిశీలిస్తే.. కేవలం 23 రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
• 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు గాను రూ. 22,277 పెరుగుదల కనిపించింది.
• 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు గాను రూ. 22,406 మేర ధర పెరిగింది.
• 18 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ. 16,708 పెరుగుదల నమోదైంది.
సామాన్యులకు ఎక్కువగా ఉపయోగపడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇంత భారీగా పెరగడం గమనార్హం.
వెండి ధరలో రూ.91 వేలకు పైగా పెరుగుదల
బంగారం కంటే వెండి ధరల పెరుగుదల మరింత షాకింగ్‌గా ఉంది. జనవరి 01న ఒక కిలో వెండి ధర రూ. 2,27,900 గా ఉండగా, జనవరి 23 నాటికి అది రూ. 3,18,960 కి పెరిగింది. అంటే ఈ స్వల్ప వ్యవధిలో వెండి ధరలో వచ్చిన పెరుగుదల అక్షరాలా రూ. 91,060. కేవలం 21 నుండి 22 రోజుల్లోనే వెండి కిలోపై రూ.91 వేలకు పైగా పెరగడం కమోడిటీ మార్కెట్ చరిత్రలోనే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఒక గ్రాము బంగారం రేటు ఎలా ఉంది?
శుక్రవారం జనవరి 23 నాటికి, ప్రస్తుత మార్కెట్ ముగింపు సమయానికి ఒక గ్రాము బంగారం ధరలు గమనిస్తే..
• 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం: ధర రూ. 15,431.
• 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం: ధర రూ. 14,135.
• 18 క్యారెట్ల ఒక గ్రాము బంగారం: ధర రూ. 11,573.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పైన పేర్కొన్న ధరలలో ఎలాంటి జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కలపలేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ పన్నులు, ఛార్జీలు అదనంగా కలుస్తాయి. ఇవి కలిపిన తర్వాత బంగారం, వెండి ధరల్లో మరింత పెరుగుదల కనిపిస్తుంది.

