Gold Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ ధరల సెగ..ఇవాళ ఎంత పెరిగాయంటే?
Gold Silver Price: బంగారం ధర తగ్గిందని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కాస్త ఆగాల్సిందే! ఎందుకంటే గత కొన్ని రోజులుగా వరుసగా పడిపోతూ కొనుగోలుదారుల్లో ఆశలు పెంచిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా పైకి ఎగిశాయి.
పసిడి ప్రియులకు మళ్లీ ధరల సెగ
బంగారం, వెండి కొనాలనుకునేవారికి మళ్లీ ధరల సెగ తగులుతోంది. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఈ ర్యాలీకి కారణమవుతున్నాయి.
రూ.1,26,550కు చేరిన పసిడి
నవంబర్ 27న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,750 పెరిగింది. దీంతో ప్రస్తుతం తులం ధర రూ.1,26,550కు చేరింది. గత కొన్ని రోజులుగా తగ్గుదలతో కనిపించిన పసిడి.. ఇప్పుడు మళ్లీ ఈ స్థాయిలో పెరగడం కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తోంది.
అటు ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాములపై రూ.1,600 పెరగడంతో ప్రస్తుతం రూ.1,16,000 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,310 పెరిగి రూ.94,910కు చేరింది.
బంగారం బాటలోనే వెండి
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,70,000కు చేరుకుంది. ఇటీవల వెండి ధరల్లో కనిపించిన ఒడిదుడుకుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగడం మార్కెట్లో ఆసక్తికరంగా మారింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు కూడా పసిడి ధరల కదలికలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ విలువ, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. వీటికి అనుగుణంగా ఫ్యూచర్స్ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి కదులుతున్నాయి.
ఎప్పటికప్పుడు గమనించాలి
అయితే బంగారం ధరలు మళ్లీ పెరిగినంత మాత్రాన ఇదే ధోరణి కొనసాగుతుందని చెప్పలేం. అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధరల్లో మళ్లీ మార్పులు రావచ్చు. అందుకే ఆభరణాల కొనుగోలుకు సిద్ధమవుతున్నవారు రోజువారీ ధరలను గమనించాలి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీతో కలిపి తుది ధరను కూడా పరిశీలించడం మంచిది.













