Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే అంతే..
Gold Loan: అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు ముందుగా గుర్తొచ్చేది బ్యాంకులే. వేగంగా, తక్కువ వడ్డీతో లోన్ పొందాలంటే మాత్రం గోల్డ్ లోన్ తీసుకుంటారు. అయితే, గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో?

కష్టకాలంలో బంగారం అండ .. కానీ జాగ్రత్త
బంగారు ఆభరణాలు మనకు అందాన్ని ఇవ్వడమే కాదు.. కష్టకాలంలో ఆర్థికంగా అండగా నిలుస్తాయి. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు లేదా డబ్బు తాత్కాలికంగా అవసరమైనప్పుడు చాలామంది తమ బంగారు నగలను తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. అయితే..ఈ సమయంలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. బంగారు ఋణం ఎక్కడ తీసుకోవాలి? ఏ బ్యాంక్‌లో వడ్డీ తక్కువగా ఉంటుంది? ప్రభుత్వ రంగ బ్యాంక్ మంచిదా? ప్రైవేట్ సంస్థల సర్వీస్ ఎలా ఉంటుంది? మన బంగారం సురక్షితంగా ఉంటుందా? ఇలాంటి అనేక సందేహాలు సహజం. అందుకే గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గోల్డ్ లోన్ ఎక్కడ తీసుకుంటే బెటర్ ?
బంగారు నగలపై లోన్ తీసుకునే సమయంలో వడ్డీ రేటు చాలా కీలక అంశం. ఇది బ్యాంకు లేదా ఆర్థిక సంస్థపై ఆధారపడి ఉంటుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకుల్లో వడ్డీ రేటు సుమారు 7.25% నుండి 9% వరకు ఉంటుంది. దీనివల్ల తక్కువ వడ్డీతో లోన్ పొందే అవకాశం ఉంటుంది.
ఇక ప్రైవేట్ బ్యాంకులు ఉదాహరణకు HDFC, ICICI, Axis Bank వంటివి. ఈ బ్యాంకుల్లో గోల్డ్ లోన్‌పై 10% నుండి 14% వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అయితే వీటి సేవలు వేగం ఎక్కువగా ఉంటాయి.
.మరోవైపు.. ముతూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేటు 12% నుండి 24% వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, తక్కువ వడ్డీతో భద్రతగా లోన్ తీసుకోవాలనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి.
అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి
ఎంత డబ్బు అవసరమో దాని బట్టి బంగారు నగలపై లోన్ ఎక్కడ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమయ్యే సందర్భాల్లో.. ప్రైవేట్ బ్యాంకులు లేదా సంస్థలను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే, ఇవి బంగారపు విలువలో 75% వరకు లోన్ అందిస్తాయి. అయితే, వీటికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల రీపేమెంట్ ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. ఋణాన్ని సకాలంలో తీర్చలేకపోతే, ఆ బంగారు నగలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ప్రత్యామ్నాయంగా తక్కువ మొత్తంలో డబ్బు అవసరమైతే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంతో నమ్మకమైనవి. ఇవి తక్కువ వడ్డీ రేటుతో పాటు, సురక్షిత విధానాలను పాటిస్తాయి. అంతేకాదు, రుణముప్పు తక్కువగా ఉండేలా చాలా తక్కువ షరతులతో వాయిదా చెల్లించే అవకాశం కూడా కల్పిస్తాయి. అయితే, ఇక్కడ బంగారపు విలువలో 60% నుండి 70% వరకు మాత్రమే రుణం పొందే అవకాశముంటుంది. కాబట్టి, అవసరాన్ని బట్టి సరైన సంస్థను ఎంచుకోవడం ఎంతో అవసరం.
త్వరగా రుణం కావాలంటే?
తక్కువ కాలంలో తిరిగి చెల్లించాలనుకునేవారు ఆర్థిక సంస్థల (NBFC) వద్ద బంగారం తాకట్టు పెట్టవచ్చు. ఇవి 1 గంటలో లోన్ ఇచ్చే సౌలభ్యం కలిగిస్తాయి. అయితే, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా, RBI గుర్తింపు ఉన్న సంస్థలవేనా అనే విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలి.
ఇలా చెల్లిస్తే వడ్డీ రేటు తగ్గుతుంది
బంగారు నగలపై తీసుకున్న ఋణాన్ని సులభంగా తీర్చేందుకు కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. పర్సనల్ లోన్‌లా భావించి నెల నెలా వాయిదాగా చెల్లిస్తే వడ్డీ రేటు తగ్గుతుంది. ఒక్కసారిగా మొత్తం చెల్లించలేకపోయినా, అందుబాటులో ఉన్నప్పుడు కొద్దిగా చెల్లించడం ద్వారా ఋణాన్ని త్వరగా పూర్తిచేయొచ్చు. ఈ విధానం ద్వారా నగలను కోల్పోకుండా భద్రంగా కాపాడుకోవచ్చు.
ఆ విషయంలో జాగ్రత్త!
బంగారు లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజు, మూల్యాంకన రుసుము, స్టోరేజ్ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులను గమనించాలి. బ్యాంకులు, NBFCలు ఈ రుసుముల్లో తేడాలు ఉంటాయి. కాబట్టి, లోన్ తీసుకునే ముందు అన్ని ఖర్చుల వివరాలు సేకరించి, వాటిని పోల్చి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
తాకట్టు వేయండి.. కానీ తడబాటు వద్దు!
కష్టసమయంలో బంగారు నగలపై లోన్ తీసుకోవడం సరైన నిర్ణయమే. అయితే, దీన్ని సురక్షితంగా ఉపయోగించాలి. తక్కువ వడ్డీ రేటు, నమ్మకమైన బ్యాంక్ ఎంపిక చేసుకొని, ముందుగా తిరిగి చెల్లించే ప్రణాళిక తయారు చేసుకోవాలి. అలా అయితేనే నగలు కోల్పోకుండా, ఋణం భారంపైన పడకుండా ఉంటుంది. లోన్ తీసుకునే ముందు బ్యాంక్‌ను ప్రత్యక్షంగా సంప్రదించడం లేదా వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తాజా వడ్డీ రేట్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం.