- Home
- Business
- Gold Wholesale Market: బంగారాన్ని తక్కువ ధరకు కొనాలా? మన దేశంలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్ కు వెళ్ళండి
Gold Wholesale Market: బంగారాన్ని తక్కువ ధరకు కొనాలా? మన దేశంలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్ కు వెళ్ళండి
Gold Wholesale Market: బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ధర తగ్గుతుందా? అని ఎదురుచూసే వారు ఎక్కువైపోయారు. మనదేశంలో బంగారం అమ్మే హోల్ సేల్ మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. అదే ముంబైలోని జవేరి బజార్.

బంగారం హోల్ సేల్ మార్కెట్ ఇదిగో
బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న రోజులు ఇవి. మన దేశంలో బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు. పూజలు కూడా చేస్తారు. ఇతర దేశాల నుంచి బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా మనదే. అయితే మన దేశంలోనే అతిపెద్ద బంగారు హోల్ సేల్ మార్కెట్ ఒకటి ఉంది. మీకు అతి తక్కువ ధరకు బంగారం కావాలనుకుంటే ఆ మార్కెట్ కు వెళ్లవచ్చు. అదే ముంబైలోని జవేరి బజార్. మనదేశంలోని ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుంచే బంగారం సరఫరా అవుతూ ఉంటుంది.
ఎప్పుడు ప్రారంభమైంది?
ముంబైలో జవేరి బజారుకు ఎంతో డిమాండ్ ఉంది. దీని చరిత్ర కూడా ఎక్కువే. ఈ మార్కెట్ గత 160 సంవత్సరాలుగా నడుస్తోంది. తొలిసారి 1864లో దీన్ని ప్రారంభించారు. అప్పటి బంగారు వ్యాపారి త్రిభువన్ దాస్ జవేరి ఈ మార్కెట్ ను ఆరంభించినట్లు చెబుతారు. అందుకే అతని ఇంటిపేరు ఈ బజారుకు పెట్టారు. జవేరి బజార్లో బంగారం నాణ్యతలోను, ధరలోనూ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం దొరుకుతుంది. జవేరి బజార్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆభరణాల రూపంలో బంగారం సరఫరా అవుతుంది.
తక్కువ ధరకే బంగారం
ఈ బజార్లో స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు దొరుకుతాయని ఎంతో మందికి నమ్మకం. ఇక్కడ కేవలం బంగారం మాత్రమే కాదు వజ్రాలు కూడా లభిస్తాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జవేరి బజార్లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది. మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొంటే జవేరి బజారుకు వెళితే మంచిది. మీరు అనుకున్న దానికంటే తక్కువ ధరకే ఇక్కడ బంగారు ఆభరణాలు దొరికే అవకాశం ఉంది. భారత దేశంలో అతిపెద్ద బంగారు మార్కెట్ గా ఈ జవేరి బజార్ నే చెప్పుకుంటారు. కానీ బంగారు రాజధానిగా మాత్రం కేరళలోని త్రిసూర్ పేరు చెబుతారు.
కేరళలో ఉన్న త్రిసూర్ నగరంలో బంగారు ఆభరణాలు అధికంగా తయారవుతాయి. కర్మాగారాలు, చేతి వృత్తుల వారు ఇక్కడ పెద్ద సంఖ్యలో బంగారు ఆభరణాలను తయారు చేస్తూ ఉంటారు. ఇక మహారాష్ట్రలోని జలగావ్ నగరం, మధ్యప్రదేశ్లో ఉన్న రత్లాం, ఢిల్లీలోనే ఢిల్లీ బులియన్ మార్కెట్ కూడా బంగారు మార్కెట్లుగా పేరుపొందాయి. కానీ జవేరి బజార్ తో పోలిస్తే అవి చాలా చిన్నవనే చెప్పాలి. మీరు జవేరి బజారుకెళ్లారంటే కిరాణా దుకాణాల్లాగా బంగారు దుకాణాలు నిండిపోయి సందడిగా కనిపిస్తాయి. కొనకపోయినా కనీసం కళ్ళారా చూసేందుకైనా మీరు ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే.
బంగారం నేటి ధరలు
బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతూనే ఉన్నాయి...కానీ తగ్గే సూచనలు కనిపించట్లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.1,32,000 నుంచి రూ.1,40,000 మధ్య ఉంది. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ. 1,28,000 నుంచి రూ.1,32,000 మధ్య దొరుకుతుంది. ఇక ఆభరణాల రూపంలో తీసుకుంటే దీని ధర మరింత ఎక్కువగా ఉంటుంది. కేవలం తులం బంగారు వస్తువు కోసమే లక్షా ఎనభై వేల రూపాయలు దాకా ఖర్చు పెట్టాల్సి రావచ్.చు ఈ ఏడాది బంగారం ధరలు మరింతగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. 2026లో తులం బంగారం వస్తువు కొనాలంటే రెండు లక్షల రూపాయలు దాటిపోయే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం అంటే అందులో 99.9% బంగారమే ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6% బంగారం మిగతాది ఇతర లోహాలు ఉంటాయి.

