DA Hike: ఉద్యోగులకు దీపావళి కానుక.. 3 శాతం డిఏ పెంపు.. జీతాలు ఎంత పెరుగుతాయంటే?
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పండగ వేల తీపి కబురు అందిస్తూ 3% డిఏ పెంపును ప్రకటించింది. దీనివల్ల 1.17 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

పండగ వేళ మోదీ సర్కార్ బిగ్ గిఫ్ట్.. ఏకంగా 63 శాతానికి చేరిన డిఏ!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి పండగ ముందే వచ్చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉద్యోగుల కరవు భత్యం (డీఏ), పెన్షనర్ల కరవు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ ఈ పెంపుతో 63 శాతానికి చేరింది. పెరిగిన డీఏ జూలై 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. పండగ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపింది.
కోటికి పైగా కుటుంబాలకు లబ్ధి: ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత?
కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారు. మొత్తంగా 1.17 కోట్లకు పైగా కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది.
ఈ డీఏ, డీఆర్ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి ₹10,016.10 కోట్ల అదనపు భారం పడనుంది. 7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) సిఫార్సుల ప్రకారం, నిర్ణీత ఫార్ములా ఆధారంగానే ఈ పెంపును ఖరారు చేశారు.
లెవెల్ 1 నుంచి 10 వరకు జీతాలు ఎంత పెరుగుతాయి?
డీఏ 3 శాతం పెరగడం వల్ల పే లెవెల్స్ ఆధారంగా ఉద్యోగుల నెలవారీ వేతనాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రాథమిక వేతనం ఆధారంగా ఎవరికి ఎంత పెరుగుతుందో ఇక్కడ వివరంగా చూడవచ్చు..
• లేబర్ లెవెల్ 1 (కనీస బేసిక్ ₹18,000): డీఏ గతంలో ₹10,800 ఉండగా, ఇప్పుడు ₹11,340 అవుతుంది. నెలవారీ జీతం ₹540 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 2 (కనీస బేసిక్ ₹19,900): డీఏ ₹11,940 నుండి ₹12,537 అవుతుంది. జీతం ₹597 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 3 (కనీస బేసిక్ ₹21,700): డీఏ ₹13,020 నుండి ₹13,671 అవుతుంది. జీతం ₹651 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 4 (కనీస బేసిక్ ₹25,500): డీఏ ₹15,300 నుండి ₹16,065 అవుతుంది. జీతం ₹765 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 5 (కనీస బేసిక్ ₹29,200): డీఏ ₹17,520 నుండి ₹18,396 అవుతుంది. జీతం ₹876 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 6 (కనీస బేసిక్ ₹35,400): డీఏ ₹21,240 నుండి ₹22,302 అవుతుంది. జీతం ₹1,062 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 7 (కనీస బేసిక్ ₹44,900): డీఏ ₹26,940 నుండి ₹28,287 అవుతుంది. జీతం ₹1,347 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 8 (కనీస బేసిక్ ₹47,600): డీఏ ₹28,560 నుండి ₹29,988 అవుతుంది. జీతం ₹1,428 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 9 (కనీస బేసిక్ ₹53,100): డీఏ ₹31,860 నుండి ₹33,453 అవుతుంది. జీతం ₹1,593 పెరుగుతుంది.
• లేబర్ లెవెల్ 10 (కనీస బేసిక్ ₹56,100): డీఏ ₹33,660 నుండి ₹35,343 అవుతుంది. జీతం ₹1,683 పెరుగుతుంది.
ఏఐసీపీఐ సూచీ ఆధారంగానే డీఏ లెక్కింపు
ఉద్యోగులకు డీఏ ఎలా లెక్కిస్తారంటే.. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) ఆధారంగా నమోదయ్యే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని బట్టి కేంద్రం డీఏను సవరిస్తుంది. జూలై 2025 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో AICPI సూచీ వివరాలు ఇలా ఉన్నాయి:
• జూలై 2025: 146.5
• ఆగస్టు 2025: 147.1
• సెప్టెంబర్ 2025: 147.3
• అక్టోబర్ 2025: 147.7
• నవంబర్ 2025: 148.2
• డిసెంబర్ 2025: 148.2
• జనవరి 2026: 148.6
• ఫిబ్రవరి 2026: 148.5
• మార్చి 2026: 149.1
• ఏప్రిల్ 2026: 149.9
• మే 2026: 150.8
• జూన్ 2026: 151.9
ఈ 12 నెలల సగటు సూచీ విలువ 148.65 గా తేలింది. దీని ఆధారంగా లెక్కిస్తే డీఏ 63.76% వచ్చింది. నిబంధనల ప్రకారం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 63% గా ఖరారు చేశారు.
అకౌంట్లలోకి బకాయిలు ఎప్పుడు వస్తాయి?
ఈ డీఏ పెంపు జూలై 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ప్రకటన ఆలస్యంగా రావడంతో ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా జీతం లెక్కలు ఒక నెల 15 నుండి మరుసటి నెల 15 వరకు పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి, నవంబర్ చివరిలో ఇచ్చే జీతంతో పాటు ఈ నాలుగు నెలల డీఏ బకాయిలను ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలైలలో) కేంద్ర ప్రభుత్వం డీఏను సవరిస్తున్న సంగతి తెలిసిందే.





