Gold: మనం నగలు కోసం.. మరి బ్యాంకులు బంగారం ఎందుకు కొంటాయో తెలుసా?
Gold: కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది బంగారం కొనడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, సాధారణ ప్రజలతో పాటు బ్యాంకులు సైతం బంగారం కొంటున్నాయి. మనం నగలు కోసం.. మరి బ్యాంకులు బంగారం ఎందుకు కొంటాయి?

బ్యాంకులు బంగారాన్ని ఎందుకు కొంటాయి?
సాధారణ ప్రజలు నగలు, పొదుపు లేదా పెట్టుబడి కోసం బంగారం కొంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐI), అమెరికా ఫెడరల్ రిజర్వ్, చైనా పీపుల్స్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొంటున్నాయి. పూర్తిగా భిన్నమైన కారణాలతో టన్నుల కొద్దీ బంగారాన్ని బ్యాంకులు కొనుగోలు చేస్తాయి.
వీటికి బంగారం అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వ్యూహాత్మక భద్రతా కవచం. ఒక రకంగా చెప్పాలంటే, ప్రజలు తమ వ్యక్తిగత సంపదను కాపాడుకోవడానికి బంగారం కొంటే, సెంట్రల్ బ్యాంకులు తమ దేశ ఆర్థిక బలాన్ని రక్షించుకోవడానికి నేషనల్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ లాగా బంగారాన్ని నిల్వ చేస్తాయి.
ద్రవ్యోల్బణం నుంచి రక్షణ, కరెన్సీ విలువ కాపాడుకోవడం
కాలక్రమేణా పేపర్ కరెన్సీని ఎంతైనా ముద్రించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి, డబ్బు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కానీ భూమి నుంచి తవ్వే బంగారం సరఫరా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం వల్ల కరెన్సీ విలువ పడిపోయినప్పుడు కూడా, బంగారం తన అసలు విలువను దీర్ఘకాలంలో నిలబెట్టుకుంటుంది. అందుకే తమ నిల్వల కొనుగోలు శక్తి తగ్గిపోకుండా ఉండేందుకు బ్యాంకులు దశాబ్దాల ప్రణాళికతో బంగారాన్ని హోల్డ్ చేస్తాయి.
డాలర్‌పై ఆధారపడటం తగ్గించడం
చాలా దేశాలు తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఎక్కువ భాగాన్ని అమెరికా డాలర్లు, యూరోలు, యూఎస్ ట్రెజరీ బాండ్ల రూపంలో ఉంచుకుంటాయి. ఒకే విదేశీ కరెన్సీపై ఎక్కువగా ఆధారపడితే, ఆ దేశ ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్ల మార్పుల వల్ల మన నిల్వలపై ప్రభావం పడుతుంది. స్టాక్ మార్కెట్లు, పేపర్ కరెన్సీలతో సంబంధం లేకుండా బంగారం విలువ కదులుతుంది. కాబట్టి డాలర్ రిస్క్ తగ్గించుకోవడానికి బంగారం ఒక అదనపు ఆస్తిగా ఉపయోగపడుతుంది.
డిఫాల్ట్ రిస్క్ లేకపోవడం, ఆంక్షల నుంచి రక్షణ
నగదు, ప్రభుత్వ బాండ్లు లేదా విదేశీ బ్యాంకు డిపాజిట్లు అన్నీ ఒక ప్రభుత్వం లేదా సంస్థ ఇచ్చే హామీపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆ దేశం అప్పులు తీర్చలేక చేతులెత్తేస్తే వాటి విలువ పడిపోతుంది. కానీ భౌతిక బంగారానికి ఎలాంటి ఇష్యూయర్ ఉండరు. ఇది ఎవరికీ బాధ్యత కాదు. అంతేకాకుండా, అంతర్జాతీయ యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో విదేశీ బ్యాంకుల్లో డిజిటల్ రూపంలో ఉండే నిధులను ఇతర దేశాలు ఫ్రీజ్ చేసే ప్రమాదం ఉంది.
గతంలో రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులపై ఆంక్షలు విధించిన తర్వాత ఈ విషయం మరింత స్పష్టమైంది. సొంత దేశంలోని లాకర్లలో భద్రపరిచిన బంగారాన్ని ఏ విదేశీ శక్తి డిజిటల్‌గా బ్లాక్ చేయలేదు. అందుకే ఇటీవల పలు సెంట్రల్ బ్యాంకులు విదేశాల్లో ఉన్న తమ బంగారాన్ని వెనక్కి తెచ్చుకుంటున్నాయి.
ఆర్థిక సంక్షోభాల్లో అండ
యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. ఒక దేశం వద్ద భారీగా బంగారు నిల్వలు ఉన్నాయంటే, ఆ దేశ కరెన్సీకి, ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది ఉందని ప్రపంచ ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు నమ్ముతాయి. బంగారం ఒక్కటే బలమైన ఆర్థిక వ్యవస్థకు గ్యారెంటీ కాకపోయినా, ఆర్థిక అస్థిరత సమయంలో దేశీయ కరెన్సీ విలువను స్థిరంగా ఉంచడానికి, అంతర్జాతీయ భాగస్వాములలో నమ్మకాన్ని పెంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
ఆర్‌బీఐ, కమర్షియల్ బ్యాంకుల పాత్ర
భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బంగారాన్ని నిల్వ చేస్తుంది. కరెన్సీ రిస్క్ తగ్గించి దేశానికి ఆర్థిక భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. మరోవైపు, సాధారణ ప్రజలు, వ్యాపారులు వాడే కమర్షియల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొంటాయి. అయితే వాటి అవసరాలు వేరుగా ఉంటాయి.
గోల్డ్ లోన్లు ఇవ్వడానికి, సావరిన్ గోల్డ్ బాండ్లు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌ల వంటి ఉత్పత్తులకు సపోర్టుగా నిలవడానికి, ఆభరణాల వ్యాపారులు, రిటైల్ ఇన్వెస్టర్లకు బంగారు నాణేలు, కడ్డీలు సరఫరా చేయడానికి కమర్షియల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అలాగే తమ బ్యాలెన్స్ షీట్‌లను మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కాపాడుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తాయి.











