COD: క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు ఛార్జీలు ఎందుకు.?
COD: ఈకామర్స్ రంగం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సమయంలో ముందుగా పేమెంట్ చేసే దానికంటే క్యాష్ ఆన్ డెలివరీకి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారని తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కేంద్ర మంత్రి ఘాటుగా స్పందించారు.

చార్జీలపై కఠిన చర్యలు
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రభలాద్ జోశి ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లు కస్టమర్లను మోసం చేసి అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా క్యాష్-ఆన్-డెలివరీ (COD) కోసం చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధం అని చెప్పారు. ఈ విధమైన చార్జీలు వినియోగదారులను ఎక్స్‌ప్లోయిట్ చేసే “డార్క్ ప్యాటర్న్‌లు” కింద వస్తాయని చెప్పారు. ఇవి న్యాయసమ్మతమైన వ్యాపార పద్ధతులకు విరుద్ధంగా ఉంటాయి.
సోషల్ మీడియాలో చర్చ
సోషల్ మీడియా వేదిక Xలో ఒక యూజర్ ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు “ఆఫర్ హాండ్లింగ్ ఫీ”, “పేమెంట్ హాండ్లింగ్ ఫీ”, “ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ” వంటి హిడెన్ చార్జీలను వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విధానాన్ని “రెయిన్ ఫీ” వంటి ఇతర ఆహార డెలివరీ చార్జీలతో పోల్చారు.
కఠిన చర్యలు తప్పవంటూ
వినియోగదారుల చార్జీలపై ఫిర్యాదులు ఇప్పటికే తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ (DCA) పూర్తిగా విచారణ చేపట్టిందని, ఏవైనా హక్కులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పారదర్శకత, న్యాయసమ్మత వ్యాపార పద్ధతులను కాపాడే ప్రయత్నంలో ఉన్నామని ఆయన చెప్పారు.
GST లాభాలు, ఫిర్యాదుల పరిష్కారం
GST లాభాలు వినియోగదారులకు సరిగ్గా చేరుతున్నాయా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ద్వారా ఇప్పటికే 3,981 GST ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. FMCG వస్తువులపై GST తగ్గింపులు వినియోగదారులకు సరిగ్గా చేరుతున్నాయా అని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ చర్యల వల్ల వినియోగదారులు మోసపోకుండా, ఈ-కామర్స్ రంగం న్యాయసమ్మతంగా కొనసాగుతుందని మంత్రి వివరించారు.