- Home
- Telangana
- Weather Report: తీవ్ర గాలులు, భారీ వర్షాలు.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో ఆకాశం అల్లకల్లోలమే.
Weather Report: తీవ్ర గాలులు, భారీ వర్షాలు.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో ఆకాశం అల్లకల్లోలమే.
Weather Report: సెప్టెంబర్ చివరిలో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అల్పపీడనంగా మారనున్న వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం త్వరలో అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశలో కదులుతున్నట్టు అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు దూసుకెళ్లి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాలు, గాలుల తీవ్రత
ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.
వచ్చే రోజుల్లో వర్ష సూచన
అక్టోబర్ 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశముందని హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు
విశాఖపట్నం వాతావరణ శాఖ ప్రకారం, బంగాళాఖాత తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరంపై మరింత తీవ్రంగా కనిపించనుంది. రాబోయే 24 గంటల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో గంటకు 40–45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు.
ప్రజలకు హెచ్చరికలు
తీవ్ర గాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలాస, మందసలో 17 సెం.మీ., టెక్కలి, గరివిడి, పాతపట్నంలో 9 సెం.మీ., కురుపాం, కలింగపట్నం, సోంపేట, చీపురుపల్లి, పాలకొండలో 7 సెం.మీ. వర్షం కురిసింది. విశాఖపట్నంలో గురువారం అత్యధికంగా గంటకు 66 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలు, గాలుల కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.