Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? ఇలా అయితే అప్పు తీర్చేయచ్చు
Credit Card Bill: క్రెడిట్ కార్డులు వాడేవారి సంఖ్య ఇప్పుడు అధికంగా ఉంది. కానీ ఒక్కోసారి బిల్లు కట్టలేక ఇబ్బందిపడుతున్నారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. ఆ అప్పు నుంచి త్వరగా బయటపడతారు.

క్రెడిట్ కార్డు బిల్లులు
క్రెడిట్ కార్డ్ వాడకం పెరిగిన కొద్దీ బిల్లులు కూడా భారంగా మారుతున్నాయి. ఈ నెల బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కుదరకపోయే పరిస్థితుల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా బిల్లు పెండింగ్‌లో ఉండిపోతే లేట్ ఫీలు, భారీ వడ్డీలు పడడమే కాదు, సిబిల్ స్కోర్ కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో లోన్లు తీసుకోవడం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ఏమి చేయాలి? ఏ ఆప్షన్లు ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం.
బిల్లు కట్టకపోతే ఇదే జరుగుతుంది
క్రెడిట్ కార్డ్ బిల్.. డ్యూ డేట్ దాటితే బ్యాంకులు ముందుగా లేట్ పేమెంట్ ఛార్జీలు విధిస్తాయి. తర్వాత చెల్లించని మొత్తం మీద 36 శాతం నుంచి 42 శాతం వరకు అధిక వడ్డీ పడుతుంది. ఇది రోజురోజుకీ మొత్తం బకాయిని మరింత పెంచుతుంది. అలాగే 30 రోజులు బిల్ పెండింగ్‌లో ఉండగానే బ్యాంకులు ఆ వివరాలు సిబిల్, ఎక్విఫ్యాక్స్ వంటి క్రెడిట్ బ్యూరోలకు పంపుతాయి. దీని వల్ల వినియోగదారుడి క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. స్కోర్ తగ్గిపోతే భవిష్యత్తులో కార్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవడం కూడా కష్టసాధ్యం అవుతుంది. అందుకే బిల్లులు చెల్లించలేని పరిస్థితి వచ్చిన వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈఎమ్ఐలుగా మార్చుకోండి
ఈ పరిస్థితిలో వినియోగదారులకు ఉన్న ప్రధాన ఆప్షన్ మినిమం డ్యూ అయినా చెల్లించడం. పూర్తి బకాయి కుదరకపోయినా కనీస మొత్తాన్ని చెల్లిస్తే లేట్ పేమెంట్ ఫీ మాత్రం ఉండదు. కానీ మిగిలిన మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. మరో మార్గం బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి పరిస్థితిని వివరించడం. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు వినియోగదారులకు అదనపు సమయం ఇస్తాయి లేదా రీపేమెంట్ ప్లాన్ సూచిస్తాయి. ఇక ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగించే ఆప్షన్ బిల్‌ను EMIగా మార్చుకోవడం. నెలకు చిన్న మొత్తంలోనే చెల్లించేందుకు ఇది సహాయపడుతుంది. EMI వడ్డీ కూడా సాధారణంగా కార్డ్ డిఫాల్ట్ వడ్డీ కంటే తక్కువగా ఉంటుంది. బ్యాంక్ యాప్‌లో లేదా కస్టమర్ కేర్ ద్వారా ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నవారు లేదా బకాయిలు పెరిగినవారు డెట్ కన్సాలిడేషన్ లోన్ తీసుకుని అన్ని బిల్లులను ఒక్కసారిగా క్లియర్ చేసుకోవచ్చు. వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం.
చివరి ఆప్షన్ ఇదే
మీ ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉంటే డెబ్ట్ సెటిల్మెంట్ ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంక్‌తో మాట్లాడి కొంత మొత్తం చెల్లించి మిగతాదాన్ని మాఫీ చేయించుకోవచ్చు. కానీ ఇది సిబిల్ స్కోర్‌కు భారీ నష్టం చేస్తుంది. కాబట్టి ఇదిని చివరి దశలో మాత్రమే పరిశీలించాలి. నిపుణుల సూచన ప్రకారం, బిల్లు సమస్యలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం మంచిది. ఆటో డెబిట్ సేవలు, రిమైండర్లు పెట్టుకోవడం, ఖర్చులను నియంత్రించడం క్రెడిట్ కార్డ్ వాడకాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. సిబిల్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ తప్పులు ఉంటే వెంటనే దిద్దించుకోవాలి.

