Business Ideas : కేవలం వేలల్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఇంటి నుండే లక్షలు సంపాదించవచ్చు
Business Ideas : పెద్దగా పెట్టుబడి అవసరం లేదు… శారీరక శ్రమ కూడా ఎక్కువేం ఉండదు.. ఇంట్లో నుండే శ్రద్దగా పనిచేసుకుంటే లక్షలు సంపాదించవచ్చు. అలాంటి బిజినెస్ ఏదో తెలుసా?

తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభాలు
Home Business : వర్క్ ప్రమ్ హోం అనేది ఇప్పుడు వచ్చింది... కానీ హోం బిజినెస్ అనేది ఎప్పట్నుంచో ఉంది. కులవృత్తులవారిది అనాదిగా ఇంటినుండే వ్యాపారం... ఇటీవలకాలంలో ఇలా ఇంటిపట్టునే చేసుకునే వ్యాపారాలకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా చాలామంది మహిళలు ఇంటిబాధ్యతలు చూసుకుంటూనే తీరిక సమయాల్లో సొంతంగా డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారు... అలాంటివారికి నర్సరీ వ్యాపారం బాగుంటుంది. ఇందులో డబ్బులతో పాటు ప్రకృతిని కాపాడుతున్నామనే సంతృప్తి కూడా లభిస్తుంది.
ఎక్కువ సమయం, పెద్ద పెట్టుబడి, భారీ పరికరాలు అవసరం లేని వ్యాపారాలు అయితే ఇంటినుండి నడిపించడం సులువు అవుతుంది. అలాగని లాభాలు తక్కువగా ఉంటే ఆదాయం పెరగదు. ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే సురక్షితమైన వ్యాపారమే నర్సరీ. మొక్కలపై ఆసక్తి ఉంటే చాలు మీ ఇంటి ఆవరణ, బాల్కనీ నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
మంచి డిమాండ్ ఉన్న బిజినెస్
ఇంటి తోట, మిద్దె తోట, పర్యావరణ పరిరక్షణ, రసాయనాలు లేని కూరగాయల వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీనివల్ల ప్రజలు ఎక్కువగా మొక్కలు కొంటున్నారు. పెళ్లిళ్లు, పండుగలు, షాప్ ఓపెనింగ్స్‌లో బహుమతిగా మొక్కలు ఇవ్వడం కూడా సాధారణమైపోయింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మొక్కల అమ్మకాలకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న స్థలం ఉన్నా సరే, మొక్కలను నెమ్మదిగా పెంచుకుంటూ పోతే మంచి ఆదాయం సంపాదించవచ్చు.
హోం నర్సరీ వ్యాపారం ప్రత్యేకత ఏంటంటే మొక్కలు పెరిగేకొద్దీ వాటి ధర పెరుగుతుంది. ఈ రోజు నారుగా ఉన్న మొక్క, రెండు నెలల్లో పూల మొక్కగా మారినప్పుడు దాని అమ్మకం విలువ కూడా పెరుగుతుంది. అమ్ముడుపోలేదని చింతించాల్సిన అవసరం లేదు. మొక్కలు పెరగడమే లాభం.
మొదట చిన్నగా ప్రారంభించండి
ప్రారంభంలో 100 చదరపు అడుగుల స్థలంలో, పాలిథిన్ కవర్లు, మట్టి కుండీలు, కొబ్బరి పీచు, పశువుల ఎరువు, నీరు పోసే పరికరం వంటి సాధారణ వస్తువులతో సుమారు రూ.5,000తో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. అనుభవం వచ్చాక, ఎక్కువ రకాల మొక్కలు, షేడ్ నెట్ వంటివి చేర్చుకుని లాభాన్ని మరింత పెంచుకోవచ్చు.
మొక్కలను రైతులు, దగ్గరలోని నర్సరీలు లేదా హోల్‌సేల్ అమ్మకందారుల నుంచి కొని పెంచవచ్చు. మొదట కొన్ని నెలలు ప్రయోగం చేసి, మన ప్రాంతంలో ఏ మొక్కలు బాగా పెరుగుతున్నాయో గమనించి, ఆ తర్వాత వాటినే ఎక్కువగా పెంచడం మంచిది.
ఈ మొక్కలు పెంచండి
కూరగాయలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలు, గాలిని శుభ్రపరిచే ఇండోర్ ప్లాంట్స్, వాస్తు మొక్కలు వంటి రకాలు పెడితే కస్టమర్ రీచ్ పెరుగుతుంది. వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో ఫోటోలు పంచుకుని అమ్మకాలు చేయవచ్చు. చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు మొదటి కస్టమర్లు కావచ్చు.
ఈ జాాగ్రత్తలు పాటించండి..
నర్సరీ బిజినెస్ తో పాటు అదనపు ఆదాయం కోసం, మొక్కల సంరక్షణపై శిక్షణ, ఇళ్లకు నేరుగా మొక్కల సలహాలు, గార్డెన్ ఏర్పాటుకు మార్గదర్శకత్వం వంటి సేవలు కూడా అందించవచ్చు. కానీ నిర్వహణ ముఖ్యం... ఉప్పు శాతం తక్కువ ఉన్న నీటిని వాడాలి, మట్టి కుండీలకు నీరు పోవడానికి రంధ్రాలు ఉండాలి, వారానికి ఒకసారి వేపనూనె కలిపిన నీటిని స్ప్రే చేస్తే పురుగులు రాకుండా ఉంటాయి. వర్షం, తీవ్రమైన వేడి వంటి సమయాల్లో అదనపు శ్రద్ధ అవసరం.
ఆదాయానికి ఆదాయం... ఆనందానికి ఆనందం
చిన్న స్థలాన్ని, చిన్న పెట్టుబడిని పెద్ద అవకాశంగా మార్చగలదు ఈ నర్సరీ వ్యాపారం. ఇది మహిళలకు ఆదాయంతో పాటు మానసిక ప్రశాంతత, సృజనాత్మకతను ఇచ్చే రంగంగా మారుతోంది. మొక్కలు పెంచడం కేవలం కాలక్షేపం కాదు, మీకోసం ఒక గుర్తింపునిచ్చే వ్యాపారంగా కూడా మారుతుంది. ఆసక్తితో ప్రారంభించండి, ప్రకృతి మీకు ఆదాయాన్ని ఇస్తుంది! 5 వేల పెట్టుబడితో 50 వేల వరకు సంపాదించే సూపర్ బిజినెస్! మహిళలూ, రంగంలోకి దిగి అదరగొట్టండి!

