Zomato: జోమాటో షాకింగ్ నిర్ణయం.. తమ కస్టమర్ల డేటా రెస్టారెంట్‌లతో పంచుకునేందుకు సిద్ధం
Zomato: జొమాటో పెద్ద నిర్ణయమే తీసుకుంది. తమ కస్టమర్ల డేటాను రెస్టారెంట్ తో పంచుకునేందుకు సిద్ధమైంది. దీని వల్ల కస్టమర్ల ఫోన్ నెంబర్ తో పాటూ వారు ఇష్టయిష్టాలు కూడా రెస్టారెంట్ వారికి తెలిసే అవకాశం ఉంటుంది. దీని వల్ల లాభాలు, నష్టాలేంటో తెలుసుకోండి.

జొమాటో పెద్ద నిర్ణయం
ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో తాజాగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. త్వరలో జోమాటో తన వినియోగదారుల ఫోన్ నంబర్లు, కొన్ని ప్రాథమిక వివరాలు రెస్టారెంట్‌లతో పంచుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ డేటా కస్టమర్ అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే షేర్ చేస్తామని కంపెనీ చెబుతోంది. అంటే మీకు ఇష్టమైతేనే మీ తాలూక వివరాలు రెస్టారెంట్ వరకు చేరుతాయి.
రెస్టారెంట్లకు ఈ డేటా ఎందుకు?
దాదాపు పది సంవత్సరాలుగా రెస్టారెంట్ యజమానులు జోమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు ఒకే డిమాండ్ చేస్తున్నారు . అది మాకు ఆర్డర్ చేసే కస్టమర్ల వివరాలు మా చేతికి ఇవ్వండి అని. తమ దగ్గర ఎవరు ఆర్డర్ చేస్తున్నారో తెలుసుకోవడం ద్వారా వారికి ఆఫర్లు పంపడానికి, మెరుగైన సేవలు ఇవ్వడానికి డేటా అవసరం అని రెస్టారెంట్ యజమానులు వాదిస్తున్నారు. కస్టమర్లతో నేరుగా సంబంధం వల్ల తమ వ్యాపారానికి మేలు జరుగుతుందన్నది వారి నమ్మకం.
డేటా ఎలా షేర్ చేస్తారు?
ఈ నేపథ్యంలో జోమాటో NRAI (నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)తో చర్చలు జరిపింది. చివరికి డేటా షేరింగ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. జోమాటో యాప్‌లో ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆర్డర్ పెట్టే సమయంలో మీ ఫోన్ నంబర్‌ను రెస్టారెంట్‌తో పంచుకోవాలా? అనే ప్రశ్న వస్తుంది. మీరు అవును అంటే మీ నెంబరు రెస్టారెంట్‌కు చేరుతుంది. మీరు నో అంటే మీ వివరాలు జోమాటో దగ్గరే ఉంటాయి. ఎవరితోనూ షేర్ చేయదు.
మీకు లాభం ఏమిటి?
ఈ మార్పుతో వినియోగదారులకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. రెస్టారెంట్‌లు మీకు ప్రత్యేక ఆఫర్లు పంపగలవు. మీకు ఇష్టమైన వంటకాలను సూచించగలవు. దీనివల్ల మీకు మరింత కస్టమైజ్డ్ అనుభవం అందుతుందని జొమాటో చెబుతోంది. జొమాటో యాప్ ద్వారా కాకుండా, నేరుగా రెస్టారెంట్‌తో కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ భయాలు ప్రజల్లో
ఇలా డేటా పంచుకోవడంపై చాలా మంది వినియోగదారుల్లో ఆందోళన ఉంది. స్పామ్ కాల్స్ రావడం, ప్రమోషనల్ మెసేజ్‌లు పెరగడం వంటివి జరగవచ్చు. తమ డేటా ఇంకెక్కడికి వెళ్తుందో తెలియక కస్టమర్లు భయపడవచ్చు. డేటా దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఎంతో ఇది సేఫేనా? అనే ప్రశ్న వేస్తున్నారు. జోమాటో మాత్రం స్పష్టంగా మీరు ఒప్పుకోకుండా మీ సమాచారం ఎవరితోనూ షేర్ చేయము అని మాట ఇస్తోంది.

